Begin typing your search above and press return to search.

100 రోజుల్లో 'గల్ఫ్ భరోసా'.. ఉత్తమ్

By:  Tupaki Desk   |   7 Nov 2018 7:02 AM GMT
100 రోజుల్లో గల్ఫ్ భరోసా.. ఉత్తమ్
X
కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను ఆకట్టుకునేందుకు పావులు కదుపుతుంది. అధికారంలోకి వస్తే జనరంజక పాలన అందుతుందని సంకేతాలు పంపుతుంది. తాజాగా గల్ప్ బాధితుల కోసం అభయ ‘హస్తం’ ఇచ్చేందుకు ముందుకొచ్చింది. 100 రోజుల్లో సమగ్ర ఎన్నారై పాలసీని రూపొందిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.

గల్ఫ్ దేశాల బాట పట్టిన చిన్న సన్న కారు రైతులకు బీమా పాలసీ అమలు చేయనున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. విదేశాల్లో ఉంటున్న రైతులకు కూడా ‘రైతు బంధు’ పథకం కింద రూ.5 లక్షల బీమా పాలసీ కల్పిస్తామని అన్నారు. మేనిఫెస్టోలో ఈ అంశాన్ని చేరుస్తూ ప్రకటించారు. గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి - రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

గల్ఫ్ పాలసీ ముఖ్యాంశాలివే..

1. విదేశాల్లో మృతి చెందిన కార్మిక కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్ గ్రేషియా. తిరిగొచ్చిన సంవత్సరంలోపు ఇక్కడ మరణించినా ఈ పథకం వర్తిస్తుంది

2. గల్ఫ్ జైళ్లలో ఉన్న కార్మికుల కోసం ఉచిత న్యాయ సహాయం

3. రేషన్ కార్డు కొనసాగింపు - ఆరోగ్యశ్రీ వర్తింపు

4. పెన్షన్ తో కూడిన ‘ప్రవాసీ యోగ క్షేమ’ పథకం అమలు

5. ఎన్నారైలు - కార్మికులకు పునరావాసం

6. గల్ఫ్ వేళ్లేందుకు అవసరమైన మెడికల్ చెకప్ రీఎంబర్స్ మెంట్

7. ఏటా అధికారికంగా ‘ప్రవాసీ తెలంగాణ దివస్’

8. హైదరాబాద్ లో సౌదీ కాన్స్యులేట్ - యూఏఈ కాన్స్యులేట్ ఏర్పాటు

9. ప్రవాసీ సంస్థలను అనుసంధానపరచి సమస్యల పరిష్కారానికి కృషి

10. న్యాక్ కేంద్రాల బలోపేతం - నైపుణ్య శిక్షణ కేంద్రాల ఏర్పాటు

11. మానవ అక్రమ రవాణా నిర్మూలించేందుకు నిరంతర పర్యవేక్షణ