Begin typing your search above and press return to search.

ఏంది కేసీఆర్.. ఈ లెక్కలన్ని నిజమేనా?

By:  Tupaki Desk   |   16 April 2020 5:00 AM GMT
ఏంది కేసీఆర్.. ఈ లెక్కలన్ని నిజమేనా?
X
కరోనా వేళ విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో పేదలకు అండగా నిలిచేందుకు కేసీఆర్ సర్కారు చేస్తున్న సాయానికి సంబంధించి కొత్త తరహాలో ‘లెక్క’ చెప్పారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సారధి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పేద ప్రజలకు రెండు నెలలకు పన్నెండు కేజీల చొప్పున బియ్యాన్ని అందించటంపై ఆయన విరుచుకు పడుతున్నారు. తెల్లరేషన్ కార్డుల వారికి ప్రభుత్వం పన్నెండు కేజీల బియ్యం ఇస్తామని ప్రకటించిందని.. రేషన్ షాపుల్లో కేజీ బియ్యం రూపాయి మాత్రమేనని.. అంటే.. పన్నెండు కేజీలు ఇస్తున్నందున ప్రభుత్వం చేస్తున్న సాయం పన్నెండు రూపాయిలేనని.. నెలకు చూస్తే ఆరు రూపాయిలేనని చెప్పారు.

అంతేకాదు.. నెలకు ఐదు కేజీల చొప్పున బియ్యాన్ని కేంద్రం ఇస్తుందని.. ఈ లెక్కన చూస్తే కేసీఆర్ సర్కారు చేస్తున్న సాయం రూపాయి మాత్రమేనంటూ షాకింగ్ లెక్క చెప్పుకొచ్చారు. లాక్ డౌన్ ప్రకటించిన 23 రోజులైనా తెల్లరేషన్ కార్డు దారులకు కేసీఆర్ ప్రకటించిన పన్నెండు కేజీల బియ్యం.. రూ.1500 సాయం ఇప్పటికి అందరికి అందలేదన్నారు. తెల్లరేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న పది లక్షల మంది పేదలకూ ఈ సాయం అందించాలని చెప్పారు.

గతంలో మాదిరి బియ్యంతో పాటు తొమ్మిది రకాల నిత్యవసర వస్తువులను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. బియ్యంతో పాటు మూడు కేజీల పప్పు.. కిలో నూనె.. పంచదార సరఫరా చేయాలన్నారు. కేసీఆర్ పాలనలోని నిర్వహణ లోపాల కారణంగా పెద్ద ఎత్తున నష్టం జరిగినట్లుగా ఆరోపించారు. గతంలో నెలకు రూ.8 నుంచి రూ.10వేల కోట్ల వరకూ తెలంగాణ రాష్ట్ర ఆదాయం ఉంటుందని చెప్పారని.. అదే నిజమనుకుంటే ఉద్యోగుల వేతనాలు.. పింఛన్లకు నెలకురూ.3400 కోట్లు మించదన్నారు. అలాంటప్పుడు లాక్ డౌన్ ఒక్క వారమే జరిగినప్పుడు పూర్తి స్థాయిలో వేతనాలు.. పింఛన్లు ఎందుకు ఇవ్వనట్లు? అని ప్రశ్నించారు. మరీ.. లెక్కలకు కేసీఆర్ ఏమని బదులిస్తారో చూడాలి.