Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ కు ఓవైసీ- ప‌వ‌న్ మ‌ద్ద‌తు..ఇదో కామెడీ

By:  Tupaki Desk   |   6 March 2018 5:52 AM GMT
కేసీఆర్‌ కు ఓవైసీ- ప‌వ‌న్ మ‌ద్ద‌తు..ఇదో కామెడీ
X
జాతీయ రాజకీయాల్లోకి వెళ్ల‌బోతున్నానంటూ..తెలంగాణ సీఎం - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చేసిన ప్ర‌క‌ట‌న తెలంగాణ‌ను మ‌రింత వేడెక్కించింది. ఇప్ప‌టికే అధికార‌ - ప్ర‌తిప‌క్షాలు ఎన్నిక‌ల మూడ్‌ లోకి వెళ్ల‌గా తాజాగా కేసీఆర్ ప్ర‌క‌ట‌న‌తో తెలంగాణ రాజ‌కీయం హాట్ టాపిక్ అయింది. ఈ క్ర‌మంలోనే తాజాగా ప్ర‌ధాన‌ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ పార్టీ కేసీఆర్‌ పై ఓ రేంజ్‌ లో ఎదురుదాడి చేసింది. అంతేకాకుండా ఆయ‌న‌కు మ‌ద్ద‌తు ఇచ్చేవారిపై సైతం సెటైర్లు వేసింది. ప్రజాచైతన్య యాత్ర పేరుతో బ‌స్సుయాత్ర చేపడుతున్న కాంగ్రెస్ నేత‌ల టూర్‌ నిజామాబాద్‌ జిల్లాలో కొనసాగింది. ఆర్మూర్‌ - బాల్కొండ - భీంగల్‌ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రసంగించారు. కాంగ్రెస్‌ పార్టీ చేపడుతున్న బస్సుయాత్ర నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు - నాలుగేండ్ల తన పాలనలోని వైఫల్యాలను కప్పింపుచ్చేందుకే థర్డ్‌ ఫ్రంట్‌ ఏర్పాటు అంటూ సీఎం కేసీఆర్‌ కొత్త డ్రామా మొదలుపెట్టారని ఆయ‌న మండిప‌డ్డారు.

కేసీఆర్ ఫ్రంట్ ప్ర‌క‌ట‌న చేయ‌డం - ఆయ‌న‌కు వెంట‌నే మ‌ద్ద‌తు ఇవ్వ‌డం ఆశ్చ‌ర్య‌క‌రంగా ఉంద‌ని టీపీసీసీ చీఫ్‌ ఉత్త‌మ్‌ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. జాతీయ స్థాయిలో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటును తెలంగాణకు బద్దవ్యతిరేకి అయిన అసదుద్దీన్‌ స్వాగితిస్తే - ఓటు ఉందో లేదో తెలియని పవన్‌ కళ్యాణ్‌ మద్దతు పలికారని ఎద్దేవా చేశారు. ఇదో పెద్ద కామెడీగా సాగింద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ప్రగతిభవన్‌కు ఆదివారం తండోపతండాలుగా తరలివచ్చింది జనం కాదని టీఆర్‌ ఎస్‌ కార్యకర్తలని అన్నారు. నాలుగేళ్లుగా రాష్ట్రంలో అన్నివర్గాలను మోసం చేసిన పెద్ద మనిషి అకస్మాత్తుగా దేశ రాజకీయాల గురించి మాట్లాడటం విచిత్రమని ఉత్త‌మ్ అన్నారు. ముందు సీఎం కేసీఆర్‌ పని తీరుపై చర్చ జరగాలన్నారు. పోడు సాగు చేస్తున్నారని గిరిజనులపై లాఠీచార్జి చేయించి - మిర్చి రైతులుకు బేడీలు వేయించిన ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.

టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వం ఇప్పటివరకు రూ.5లక్షల కోట్ల బడ్జెట్‌ ప్రవేశపెడితే.. అందులో వ్యవసాయ ఉత్పత్తులకు బోనస్‌ ఇచ్చేందుకు రూ.5 కూడా ఎందుకు కేటాయించలేదని ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో నాలుగు వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే - ఒక్క కుటుంబాన్ని కూడా పరామర్శించని కేసీఆర్‌ ఇప్పుడు దేశంలోని రైతుల ఆర్థిక స్థితి గురించి ఏ అర్హతతో మాట్లాడుతున్నారని అన్నారు. కేసీఆర్‌ థర్డ్‌ ఫ్రంట్‌ తో ఏం ఒరగదని - ఎంపీ సీట్లు కూడా రావని అన్నారు. కేసీఆర్‌ ది బోగస్‌ సర్వే అని - వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ ఎస్‌ కు 10సీట్లు కూడా రావని చెప్పారు. డిసెంబర్‌ లో ఎన్నికలు రాబోతున్నాయని - రాహుల్‌ నాయకత్వంలో కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందన్నారు. జైలుకెళ్లకుండా తప్పించుకునేందుకే సీఎం కేసీఆర్‌ థర్డ్‌ ఫ్రంట్‌ ముందుకు తీసుకొచ్చారని కాంగ్రెస్‌ శాసన మండలిపక్ష నేత షబ్బీర్‌ అలీ ఆరోపించారు. తెలంగాణలోని వాటర్‌ గ్రిడ్‌ - ఏపీలోని పోలవరం పనుల్లో జరిగిన అవినీతి చిట్టా కేంద్ర ప్రభుత్వం వద్ద ఉందని అన్నారు. దాంతో ఇద్దరు ముఖ్యమంత్రులకు జైలు భయం పట్టుకుందని విమర్శించారు.