Begin typing your search above and press return to search.

ఉత్త‌మ్ కీల‌క వ్యాఖ్య‌లు..కూట‌మి చాప్ట‌ర్ ముగిసిన‌ట్లేనా?

By:  Tupaki Desk   |   28 Dec 2018 4:24 PM GMT
ఉత్త‌మ్ కీల‌క వ్యాఖ్య‌లు..కూట‌మి చాప్ట‌ర్ ముగిసిన‌ట్లేనా?
X
ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డిన దాదాపు 15 రోజుల త‌ర్వాత కాంగ్రెస్ పార్టీ ఓట‌మిపై పీసీసీ చీఫ్ ఉత్త‌మ్‌ కుమార్ రెడ్డి పార్టీ ఓట‌మిపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. గాంధీభ‌వ‌న్‌ లో జ‌రిగిన ఇష్టాగోష్టిలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయ‌న్నారు. వీవీ ప్యాట్ స్లిప్స్ లెక్కపెట్టాలని కోర్టుకి వెళ్తున్న ద‌శ‌లో...రిటర్నింగ్ అధికారి స్లిప్స్ తీసేయ‌డం ఏమిట‌ని విస్మ‌యం వ్య‌క్తం చేశారు. ఎవరి ఆదేశాలతో ఇలా జరుగుతున్నాయని ఆయ‌న అనుమానం వ్య‌క్తం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం - రాష్ట్ర ఎన్నికల కమిషన్ కి పిర్యాదు చేస్తున్నామ‌ని వివ‌రించారు.

1% తేడా ఉన్న ధర్మపురి-కోదాడ-ఇబ్రహీంపట్నం నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎందుకు వీవీ ప్యాట్‌ స్లిప్పుల‌ను లెక్కపెట్టలేదని ఉత్త‌మ్‌ కుమార్ రెడ్డి ప్ర‌శ్నించారు. `వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కపెట్టడానికి ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? పోల్ అయిన ఓట్లకు... లెక్కింపు ఓట్లకి తేడా ఉంది. దీనికి ఎవరు బాద్యులు. కనీసం సమాధానం చెప్పే వాళ్లే లేరు. మంచిర్యాల 4 గంటల తర్వాత వేల సంఖ్యలో ఓట్లు పోల్ అయ్యాయి. అదెలా సాధ్యం? కనీసం ఎన్నికల సంఘం కూడా స్పందించడం లేదు`` అని వ్యాఖ్యానించారు. ఎన్నికలపై ఓ అనుమానం ప్రజల్లో ఉందని - రెండు మూడు రోజుల్లో ఓటమిపై సమీక్షించుకుంటామ‌న్నారు. ``ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్రచారం కూడా బాగా చేశాం. పేపర్లో ప్రకటనలు - టీవీల్లో విస్తృత ప్రచారం చేశాం అయినా ఓట‌మి ఎదురైంది. ఈ నేప‌థ్యంలో అభ్యర్థులతో మాట్లాడుతున్నాం. పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై ఏఐసీసీదే తుది నిర్ణయం. పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ కు మెరుగైన ఫలితాలు ఉంటాయి`` అని వివ‌రించారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కాలేదని ఈ నేప‌థ్యంలో సీఎల్పీ నాయ‌కుడిగా ఎవ‌రుంటారో తెలియ‌ద‌ని పేర్కొన్నారు.

కేసీఆర్ ఫెడరల్ ఫ్రెంట్ గురించి తాను మాట్లాడనని ఉత్త‌మ్‌ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. ``పొత్తులు కొద్దిగా ముందు ఖరారు అయితే బాగుండు అని అనిపించింది. కూటమి కొనసాగింపుపై రెండు మూడు రోజుల్లో కుంతియాతో చర్చిస్తాం`` అని న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్యలు చేశారు. ఓట‌మిపై ఏఐసీసీ కి ప్రాథమిక నివేదిక ఇచ్చామ‌ని ఉత్త‌మ్‌ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.