Begin typing your search above and press return to search.

హుజూర్‌ నగర్ ఉప ఎన్నికతో మళ్లీ ఆంధ్ర - తెలంగాణ వార్..

By:  Tupaki Desk   |   21 Sep 2019 12:10 PM GMT
హుజూర్‌ నగర్ ఉప ఎన్నికతో మళ్లీ ఆంధ్ర - తెలంగాణ వార్..
X
హుజూర్‌నగర్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ రావడంతో రాజకీయ పార్టీల మధ్య ఆరోపణలు - ప్రత్యారోపణలతో వేడి పెరిగింది. హుజూర్ నగర్ నియోజకవర్గ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదలైన వెంటనే పార్టీల మధ్య విమర్శలు జోరందుకున్నాయి. టీఆరెస్ పార్టీ ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తికి టికెట్ ఇచ్చిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు.

టీఆరెస్ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి పేరును టీఆరెస్ అధినేత - సీఎం కేసీఆర్ ప్రకటించడంతో ఉత్తమ్ ఈ ఆరోపణలు చేశారు. సైది రెడ్డి తెలంగాణవాసి కాదని - ఆంధ్రప్రాంతానికి చెందినవారని ఆయన ఆరోపిస్తున్నారు. కాగా సైదిరెడ్డి 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచే పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఉత్తమ్ చేతిలో ఆయన సుమారు 7 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఉత్తమ్‌ కు 92,996 ఓట్లు వస్తే.. సైదిరెడ్డికి 85,530 ఓట్లు వచ్చాయి. ఉత్తమ్ ఆ ఎన్నికల్లో గెలిచిన తరువాత సార్వత్రిక ఎన్నికల్లో లోక్ సభకు పోటీ చేసి గెలవడంతో హుజూర్ నగర్ స్థానం ఖాళీ అయి ఇప్పుడు ఉప ఎన్నిక జరగునంది.

సైదిరెడ్డి పేరును టీఆరెస్ ప్రకటించడంతో ఉత్తమ్ మండిపడుతున్నారు. హుజూర్ నగర్ అభివృద్ధి కోసం టీఆర్ ఎస్ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ 30 వేల మెజార్టీతో గెలవడం ఖాయమని చెప్పారు. బంగారు తెలంగాణ చేస్తానని చెప్పిన కేసీఆర్... ఈ ఆరేళ్లలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. హుజూర్ నగర్ లో కాంగ్రెస్ ను గెలిపించి కేసీఆర్ నియంతృత్వ పాలనకు చరమగీతం పలకాలని పిలుపునిచ్చారు. హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి అక్టోబర్ 21న ఉప ఎన్నిక జరగనుంది. అక్టోబర్ 24న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.