Begin typing your search above and press return to search.

90వేల కోట్ల మాట కేసీఆర్ కు చుట్టుకుందా?

By:  Tupaki Desk   |   20 Sep 2016 7:51 AM GMT
90వేల కోట్ల మాట కేసీఆర్ కు చుట్టుకుందా?
X
అవకాశం వచ్చినప్పుడే పట్టు బిగించాలి. మిగిలిన రంగాల్లో ఎలా ఉన్నా.. రాజకీయాల్లో ఈ సూత్రాన్ని పక్కాగా అమలు చేయాలి. ఆ విషయంలో ఏ మాత్రం తప్పు చేసినా అడ్డంగా బుక్ అయినట్లే. ఇక.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి అధినేత పాలనలో తప్పును ఎత్తి చూపించటం ఒక సమస్య అయితే.. దాన్ని నిరూపించటం అంత తేలికైన వ్యవహారం కాదు. ప్రజలకు అర్థమయ్యేలా తప్పుల్ని చెప్పేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. తాము చెప్పే ఏ మాటనైనా తమకు తగ్గట్లుగా మలుచుకునే తత్వం ఉన్న తెలంగాణ అధికారపక్షాన్ని దెబ్బ తీసేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు పడుతున్న కష్టం ఇంతా అంతా కాదు.

తాజాగా.. బీజేపీ చీఫ్ అమిత్ షా తెలంగాణకు రావటం.. వరంగల్ పట్టణంలో భారీ బహిరంగ సభ పెట్టటం.. ఈ సందర్భంగా కేసీఆర్ సర్కారుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అమిత్ షా చేసిన వ్యాఖ్యలు.. విమర్శలు తెలంగాణ కాంగ్రెస్ నేతలకు సరికొత్త ఆయుధాలు అయినట్లుగా చెబుతున్నారు. ఇందుకు తగ్గట్లే తాజాగా టీ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రంలోని మోడీ సర్కారు రూ.90వేల కోట్ల నిధులు ఇచ్చినట్లుగా పేర్కొన్నారు.

దీన్ని పట్టుకున్న ఉత్తమ్.. ఇంత భారీ మొత్తాన్ని ఏం చేశారని.. ఆ మొత్తానికి లెక్క చెప్పరా? అంటూ ప్రశ్నిస్తున్నారు. తెలంగాణకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నిస్తున్న ఉత్తమ్ కుమార్.. తెలంగాణ ఎమ్మెల్యేల్ని ఫిరాయింపులు చేయటానికి ప్రోత్సహించటం తప్పించి తెలంగాకు చేసిందేమీ లేదని తేల్చేశారు. సాగునీటి ప్రాజెక్టులు.. మిషన్ భగీరదలో భారీ అవినీతి జరిగిందంటూ తీవ్ర ఆరోపణలు చేసిన ఆయన.. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఫ్యామిలీ తప్పించి మరే కుటుంబం హ్యాపీగా లేదన్నారు. కేంద్రం ఇచ్చినట్లుగా చెబుతున్న రూ.90వేల కోట్ల నిధులకు సంబంధించిన లెక్కను కేసీఆర్ ఎప్పటికి చెబుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తమ రాజకీయ ప్రత్యర్థి ఆరోపణల్ని అందిపుచ్చుకున్న ఉత్తమ్ కుమార్.. వాటిని ఎక్కు పెడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇరుకున పెడుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.