Begin typing your search above and press return to search.

ఇలాంటివి సంపన్న రాష్ట్ర ఇమేజ్ కు దెబ్బే కేసీఆర్

By:  Tupaki Desk   |   16 Aug 2016 1:34 PM GMT
ఇలాంటివి సంపన్న రాష్ట్ర ఇమేజ్ కు దెబ్బే కేసీఆర్
X
కీలక స్థానాల్లో ఉన్న వారు తొందరపడి ఒక వ్యాఖ్య చేస్తే దానికి తర్వాతి పరిణామాలు ఎలా ఉంటాయన్న విషయం తలపండిన రాజకీయ నేతలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. తెలంగాణ రాష్ట్రం సంపన్న రాష్ట్రమన్న విషయాన్ని తరచూ చెప్పే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఇబ్బంది పెట్టేలా.. ఆయన మాటలు ఆయన్నే డిఫన్స్ లో పడేసేలా తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు చేయటం గమనార్హం.

తెలంగాణ రాష్ట్రంలో నిధులకు కొదవ లేదని.. సంపన్న రాష్ట్రంగా దూసుకెళుతుందన్న మాటను పదే పదే చెప్పే మాటను సవాల్ చేస్తున్నట్లుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి తాజాగా ఒక కీలక వ్యాఖ్య చేశారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తాము పవర్ లోకి వస్తే రైతులకు పూర్తి రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చిన కేసీఆర్.. ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదంటూ మండిపడ్డారు. ఎన్నికల ప్రచార సమయంలో చెప్పిన మాటకు భిన్నంగా పవర్ లోకి వచ్చాక చెప్పారని.. మొత్తం రుణమాఫీ స్థానే లక్ష రూపాయిలు మాత్రమే రుణమాఫీ చేస్తానని చెప్పి.. ఆ తర్వాత నాలుగు దఫాల్లో మాఫీ చేస్తానని చెప్పి.. అది కూడా చేయలేదని మండిపడ్డారు.

తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పాతిక నెలలు అవుతున్నా.. ఇప్పటివరకూ రైతుల రుణమాఫీని మొత్తంగా మాఫీ చేయలేదని వ్యాఖ్యానించారు. మూడో విడత రుణమాఫీ ఇప్పటివరకూ విడుదల కాలేదన్న విషయాన్ని గుర్తు చేసిన ఆయన.. రైతుల్ని ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. మిగిలిన పథకాలు ఆపేసి.. ఒకేసారి రుణమాఫీని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సంపన్న రాష్ట్రమని చెప్పే తెలంగాణలో.. రైతుల రుణమాఫీని ఇంకా మాఫీ చేయకపోవటం ఏమిటన్న విమర్శ కేసీఆర్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రుణమాఫీ మూడో విడత ఇంకా విడుదల కాకపోవటానికి కారణం ఏమిటన్న అంశానికి తెలంగాణ అధికారపక్ష నేతలు ఏం సమాధానం చెబుతారో..?