Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ అధ్యక్షుడికి ఎంత ధైర్యమొచ్చేసిందో..

By:  Tupaki Desk   |   14 March 2016 9:35 AM GMT
కాంగ్రెస్ అధ్యక్షుడికి ఎంత ధైర్యమొచ్చేసిందో..
X
ఈ రోజుల్లో అధికారంలో ఉన్న పార్టీ అవినీతి చేయదంటే నమ్మే వాళ్లు ఉండరు. ఈ విషయంలో ఒక పార్టీ ఎక్కువ ఒక పార్టీ తక్కువ అనేమీ లేదు. అధికారంలో ఉన్న పార్టీ అవినీతి గురించి ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టడమూ మామూలే. ఐతే కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలోనూ అధికార పార్టీ నాయకులు అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. కానీ ఆ అవినీతిపై ప్రతిపక్షాలు పెద్దగా మాట్లాడకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే.

అప్పుడప్పుడూ రేవంత్ రెడ్డి లాంటి వాళ్లు ఏవో ఆరోపణలు చేస్తుంటారు కానీ.. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ.. కేసీఆర్ అండ్ కో మీద పెద్దగా అవినీతి ఆరోపణలు చేసిన దాఖలాలు లేవు. అటువైపు ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ మీద వైఎస్సార్ కాంగ్రెస్ ఏ స్థాయిలో దాడి చేస్తోందో చూస్తూనే ఉన్నాం. కానీ తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ నాయకులు ఎవరికి వారే అన్నట్లుంటున్నారు చాన్నాళ్లుగా. ఐతే ఎట్టకేలకు ఆ పార్టీలో కాస్త కదలిక వచ్చింది. చాలా సాఫ్టుగా కనిపించే పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా తీవ్ర ఆరోపణలు చేశారు.
కేసీఆర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో వేల కోట్ల అవినీతికి పాల్పడుతున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపణలు చేశారు.

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.40 వేల కోట్లకు పెంచడంలో పెద్ద కుట్ర దాగి ఉందని.. దీని ద్వారా వేల కోట్లు జేబులో వేసుకుంటున్నారని ఉత్తమ్ అన్నారు. మహారాష్ట్రతో ‘భగీరథ’ ఒప్పందంలోనూ పెద్ద అవినీతి దాగి ఉందని.. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రీడిజైన్ ద్వారా కూడా భారీగా డబ్బులు దండుకుంటున్నారని ఉత్తమ ఆరోపించారు. కేసీఆర్ హిట్లర్ లాంటి వాడని.. తెలంగాణ అసెంబ్లీని టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులా మార్చేశారని.. ప్రజలకు త్వరలోనే ఆయన నియంతృత్వ పోకడల్ని అర్థమై బుద్ధి చెబుతారని ఉత్తమ్ అన్నారు.