Begin typing your search above and press return to search.

పిల్లిని లోప‌లేసి కొడితే ఏమ‌వుతాది..?

By:  Tupaki Desk   |   27 Sep 2018 9:32 AM GMT
పిల్లిని లోప‌లేసి కొడితే ఏమ‌వుతాది..?
X
రాజ‌కీయాల్లో చిన్న చిన్న త‌ప్పుల‌కు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఆచితూచి అడుగులు వేస్తార‌ని.. ఎట్టి ప‌రిస్థితుల్లో తొంద‌ర‌ప‌డ‌ర‌ని.. వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించ‌టంలో మొన‌గాడుగా పేరున్న కేసీఆర్ వ‌రుస త‌ప్పులు చేస్తున్నారా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. ముంద‌స్తుకు వెళ్లే క్ర‌మంలో అసెంబ్లీని ర‌ద్దు చేసిన అనంత‌రం చోటు చేసుకుంటున్న ప‌రిణామాలు ఇప్పుడు కొత్త చ‌ర్చ‌కు తెర తీస్తున్నాయి.

త‌మ‌కు వ్య‌తిరేకంగా ఉండే వారిని.. త‌మ‌కు ఇబ్బందిగా మార‌తార‌న్న ఆలోచ‌న ఉన్న వారిపైనా సీబీఐ.. ఈడీల‌ను ప్ర‌యోగించే వైనానికి ఆప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న వంతు స‌హ‌కారాన్ని అందిస్తున్నార‌ని.. కొంద‌రు నేత‌ల మీద జ‌మానా నాటి కేసుల్ని దుమ్ము దులిపి బ‌య‌ట‌కు తీసి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నార‌న్న విమ‌ర్శ‌ల్ని మూట‌గ‌ట్టుకుంటున్నారు.

ఇటీవ‌ల జ‌గ్గారెడ్డి అరెస్ట్ కానీ.. తాజాగా రేవంత్ రెడ్డి ఇంటిపై ఈడీ దాడులు కానీ ఇవ‌న్నీ రాజ‌కీయ క‌క్ష‌తోనే చేస్తున్నారే త‌ప్పించి మ‌రొక‌టి కాద‌న్న మాట వినిపిస్తోంది. ప్ర‌భుత్వ ప్ర‌మేయం ఉందా? లేదా?. అధికార‌ప‌క్షం చొర‌వ‌తోనే ఇలాంటివి జ‌రుగుతున్నాయా? లేదా? అన్న విష‌యాల్ని ప‌క్క‌న పెడితే.. ఇలాంటివి కేసీఆర్ అండ్ కోకు ఏ మాత్రం క్షేమ‌క‌రం కాద‌న్న మాట వినిపిస్తోంది.

పిల్లిని సైతం గ‌దిలో ప‌డేసి చిత‌క్కొడుతుంటే ఒక ద‌శ దాటిన త‌ర్వాత తిర‌గ‌బ‌డుతుంద‌ని.. ఇప్పుడు రాష్ట్రంలో విప‌క్ష నేత‌ల ప‌రిస్థితి ఉంద‌న్న వాద‌న పెద్ద ఎత్తున జ‌రుగుతున్న నేప‌థ్యంలో విప‌క్ష నేత‌ల‌కు ఎదుర‌య్యే ఇబ్బందుల‌న్నీ అధికార‌ప‌క్షం పుణ్య‌మేన‌ని ప్ర‌జ‌లు భావించే అవ‌కాశం ఉంద‌న్న మాట వినిపిస్తోంది. ఈ వాద‌న‌కు త‌గ్గ‌ట్లే రేవంత్ ఇంట్లో ఈడీ దాడుల‌పై తెలంగాణ కాంగ్రెస్ ర‌థ‌సార‌ధి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి రియాక్ట్ అయ్యారు.

రాజ‌కీయ క‌క్ష‌తోనే రేవంత్ ఇంటి మీద ఐటీ దాడులు చేయిస్తున్నార‌ని చెబుతున్నారు. పాత కేసుల‌ను బ‌య‌ట‌కు తీసి కాంగ్రెస్ నేత‌ల్ని అణ‌గ‌దొక్కే కుట్ర‌కు తెర తీశార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. మొన్న జ‌గ్గారెడ్డి.. నేడు రేవంత్ రెడ్డి ఇంటిపై చేయిస్తున్న దాడులు చేత‌కానిత‌నానికి నిద‌ర్శ‌నంగా అభివ‌ర్ణించ‌టం గ‌మ‌నార్హం. ఐటీ దాడుల నేప‌థ్యంలో ఉత్త‌మ్ తో స‌హా ప‌లువురు కాంగ్రెస్ నేత‌లు రేవంత్ ఇంటికి వెళ్ల‌నున్న‌ట్లు చెబుతున్నారు. దాడుల మాటేమో కానీ.. భారీ సానుభూతి ప్ర‌జ‌ల్లో రావ‌టం ఖాయ‌మ‌న్న మాట వినిపిస్తోంది. మ‌రి ఇలాంటి ప‌రిణామాలతో లాభం కంటే న‌ష్ట‌మే ఎక్కువ‌న్న విష‌యాన్ని కేసీఆర్ సార్ గుర్తించ‌టం లేదా? అన్న సందేహాన్ని ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు.