Begin typing your search above and press return to search.

అజాత శత్రువు మరణిస్తే కేసీఆర్ కలిసొచ్చే కాలమంటారా?

By:  Tupaki Desk   |   8 May 2016 4:48 AM GMT
అజాత శత్రువు మరణిస్తే కేసీఆర్ కలిసొచ్చే కాలమంటారా?
X
మాటలు మహా ప్రమాదకరమైనవి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఉత్సాహం ఏ మాత్రం పనికిరాదు. ఆచితూచి మాట్లాడాల్సిన సమయంలో నోటి వెంట వచ్చే ఒక్క మాటకు చెల్లించాల్సిన మూల్యం భారీగా ఉంటుంది. మాట్లాడే మాట విషయంలో కచ్ఛితత్వం.. తప్పులు దొర్లకుండా వ్యవహరించే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. తొలిసారి నోరు జారారా? సందర్భం కాని సందర్భంలో.. అనకూడని మాటను అన్నారా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇలాంటి భావన కలగటానికి కారణంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలే. తాజాగా వారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల్ని ప్రస్తావిస్తూ చేస్తున్న విమర్శల్ని చూస్తే.. ముఖ్యమంత్రి అనవసరంగా మాట్లాడినట్లున్నారే అన్న భావన కలగటం ఖాయం.

పాలేరు ఉప ఎన్నికను పురస్కరించుకొని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారటం గమనార్హం. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. 50 ఏళ్లకు పైగా ప్రజా జీవితాన్ని గడిపి.. అందరితో అజాత శత్రువుగా వ్యవహరించిన ఒక రాజకీయ నాయకుడు మరణిస్తే.. ఆ కారణంగా వచ్చిన ఉప ఎన్నికను ఉద్దేశించి.. ‘‘కలిసొచ్చే కాలం’’ అంటూ కేసీఆర్ వ్యాఖ్య చేయటాన్ని తీవ్రంగా తప్పు పడుతున్నారు. ముఖ్యంత్రి మాటలు సమంజసంగా ఉన్నాయా? అని ఉత్తమ్ ప్రశ్నిస్తున్నారు.

అధికార దాహంతోనే కేసీఆర్ పాలేరు ఉప ఎన్నికల బరిలో నిలిచారని.. సిట్టింగ్ ఎమ్మెల్యేలు మరణిస్తే.. వారి కుటుంబ సభ్యులను ఎన్నికల్లో ఏకగ్రీవం చేసే సంప్రదాయం ఉన్నా.. దాన్ని వదిలేసి ఎన్నికలకు దిగటం ఏమిటంటూ నిలదీస్తున్నారు. తుమ్మలకు మంత్రి పదవిని కట్టబెట్టిన కేసీఆర్.. ఇప్పుడు ఎమ్మెల్యే పదవిని కట్టబెట్టాలని చూస్తున్నారని.. అది సాధ్యం కాదంటున్నారు. ఈ ఎన్నిక సందర్భంగా తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి ప్రస్తావన తీసుకురావటంపై ఉత్తమ్ నిప్పులు చెరుగుతున్నారు.

హుజూరాబాద్ లో తాను సిట్టింగ్ ఎమ్మెల్యేగా బరిలోకి దిగినప్పుడు శ్రీకాంతాచారి తల్లికి టిక్కెట్టు ఎలా ఇస్తారంటూ ప్రశ్నిస్తున్న ఉత్తమ్.. ఆమె ఓడిపోతుందన్న విషయం తెలిసే కేసీఆర్ టిక్కెట్టు ఇచ్చారని.. నిజంగా శ్రీకాంతాచారి తల్లి మీద అభిమానమే ఉండి ఉంటే.. ఎమ్మెల్సీగా ఆమెను ఎందుకు ఎన్నుకోలేదంటూ ప్రశ్నిస్తున్నారు. ఉత్తమ్ ఫైరింగ్ పాలేరు ఉప ఎన్నికల ఫలితం మీద ప్రభావం చూపిస్తుందా? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. మరోవైపు.. ఉప ఎన్నిక సందర్భంగా కేసీఆర్ ఆచితూచి వ్యాఖ్యలు చేస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.