Begin typing your search above and press return to search.

ఉత్త‌మ్‌ లో ఈ మార్పు గ‌మ‌నించారా

By:  Tupaki Desk   |   30 Oct 2016 11:30 AM GMT
ఉత్త‌మ్‌ లో ఈ మార్పు గ‌మ‌నించారా
X
టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్ కుమార్ రెడ్డి త‌న సొంత‌ నియోజ‌క‌ర‌వ‌ర్గ‌మైన సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌ నగర్‌ లో కాంగ్రెస్‌ హస్తం- రైతునేస్తం పేరిట ముఖ్యనేతల బహిరంగ సభలో కార్య‌క‌ర్త‌ల్లో భ‌రోసా నింపేందుకు మాట్లాడిన తీరుపై కాంగ్రెస్ నేత‌లు ఆస‌క్తిక‌రంగా చ‌ర్చించుకుంటున్నారు. సుదీర్ఘ కాలం త‌ర్వాత సొంత నియోజ‌క‌వ‌ర్గంలో బ‌హిరంగ స‌భ నిర్వ‌హించిన ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఈసందర్భంగా త‌న నియోజ‌క‌వ‌ర్గ కార్య‌క‌ర్త‌ల‌ను ఒకింత అనున‌యించే ప్ర‌య‌త్నం చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నందు వలన సమయం కేటాయించలేకపోతున్నానని చెప్పిన ఉత్తమ్ కార్య‌క‌ర్త‌లు ఈ విష‌యాన్ని అర్థం చేసుకోవాల‌న్నారు. స‌మ‌యాభావం వ‌ల్ల కార్య‌క‌ర్త‌ల‌కు చేరువ కాలేక‌పోతున్నాన‌ని వివ‌ర‌ణ ఇచ్చారు. హుజూర్‌ నగర్‌ - కోదాడ నియోజకవర్గ కార్యకర్తలు త‌మ కుటుంబ సభ్యులని, ఇక‌నుంచి అందుబాటులో ఉండి సమస్యలు తీరుస్తానని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేయాల‌ని పేర్కొంటూ 2019లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుందని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి భ‌రోసా ఇచ్చారు.

ఈ సంద‌ర్భంగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీరుపై మండిప‌డ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మాఇబ్బందులు తీరుతాయని రైతులు కలలు కంటే సీఎం కేసిఆర్‌ కాలుపెట్టగానే నాలుగు పంటలకు నీళ్ళు లేకుండా పోయాయని చెప్పారు. కేసీఆర్‌ పాలనలో రైతులు - సామాన్యుల పరిస్థితి మరింత దయనీయంగా తయారైందని అన్నారు. "ఇందిరమ్మ ఇళ్ళకు బిల్లుల్లేవ్‌.. డబుల్‌బెడ్‌రూం ఇళ్ళు లేవ్‌.. దళితులకు మూడెకరాల భూమి కొనివ్వలేదు.. కేజీ టు పిజి అంతకన్నాలేదు.. ఉపాధిహామీ కూలీలకు డబ్బులు ఇవ్వరు.. మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు నిధులు విడుదల చేయరు.. ఇలా అధికార టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వం మోసపూరిత మాటలతో పబ్బం గడుపుకుంటోంది"అని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మండిప‌డ్డారు. రైతులకు రుణమాఫీ చేయకుండా అడుగడుగునా నిర్లక్ష్యం చేస్తున్నారు.. రైతులను పట్టించుకోవడంలేదు.. విద్యార్థులకు రీఎంబర్స్‌ మెంట్‌ విడుదల చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. 40 లక్షల మంది రైతులకు 6 వేల కోట్లు.. 14 లక్షల మంది విద్యార్థులకు 3100 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించడంలో జాప్యం చేస్తున్నారని అన్నారు. అన్నదాతల ఇబ్బందులు, విద్యార్థుల కష్టాలు తుంగలో తొక్కి మిషన్‌కాకతీయ, మిషన్‌ భగీరథ కాంట్రాక్టర్లకు కోట్లరూపాయలు నిధులు విడుదల చేస్తూ వారి జేబులు నింపుతున్నారన్నారు. స్వతంత్య్ర భారతదేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వంగా టీఆర్‌ఎస్‌ను అభివర్ణించారు

పంటల్లేక అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా అధికారులు ఆత్మహత్యలుగా ధృవీకరించడంలేదని ఉత్త‌మ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఆహారధాన్యాల ఉత్పత్తిలో సగటు ఆదాయం ఘననీయంగా పడిపోయిందని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చివరిరోజుల్లో 107లక్షల టన్నుల ఆహారధాన్యాల ఉత్పత్తి ఉంటే ప్రస్తుతం 49లక్షల టన్నులకు పడిపోయిందంటే పరిస్థితి ఏవిధంగా ఉందన్న విషయం లెక్కలను బట్టి అర్థమవుతుందన్నారు. పంటలు నష్టపోయి రైతులు ఇబ్బందులు పడుతుంటే ఓదార్చడానికి కాంగ్రెస్‌ బృందం వెళితే అవహేళన చేసే విధంగా మాట్లాడుతుండటం సీఎంకే చెల్లుతుందని అన్నారు. బెదిరింపులు, అణచివేత, నియంతృత్వ ధోరణితో తమను అణగదొక్కాలని చూసినా భయపడేదిలేదని ఉత్త‌మ్ స్ప‌ష్టం చేశారు. విద్యార్థుల ఆత్మబలిదానాలు.. అమరుల త్యాగాలతో చలించిపోయి యూపీఏ చైర్మన్‌ సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ప్రకటించిందని తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి, ఏఐసీసీ కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు డాక్టర్‌ రామచంద్ర కుంతియా అన్నారు. సోనియా త్యాగఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసిఆర్‌ అన్నీ మరిచిపోయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దేశంలోనే తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వం ఎక్కువగా ఉందన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/