Begin typing your search above and press return to search.

కవిత స్థాయి ఏమిటో చెప్పిన ఉత్తమ్

By:  Tupaki Desk   |   28 Jan 2017 5:24 AM GMT
కవిత స్థాయి ఏమిటో చెప్పిన ఉత్తమ్
X
రాజకీయాల్లో దయ అన్నది అస్సలు ఉండదంటారు. ప్రత్యర్థుల పట్ల ఎలాంటి కనికరం లేకుండా విరుచుకుపడటం కనిపిస్తుంది. మెట్లు ఎక్కటానికి ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎన్నుకుంటారు. కొందరు అవకాశాల్ని అందిపుచ్చుకొని ఎదిగితే.. మరికొందరు అవకాశాల్ని తమకు తాము సృష్టించుకొని ఎదిగే ప్రయత్నం చేస్తుంటారు. తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కమ్ ఎంపీ కవిత తీరు రెండో వైనానికి దగ్గరగా ఉంటుంది.

వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ.. ఒకటి తర్వాత మరొకటి అన్న చందంగా ఆమె అడుగులు వేయటం కనిపిస్తుంది. ఉద్యమ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చినట్లు కనిపించేట్లు ఉండే ఆమె విజన్ చాలా విస్తృతమైనదిగా చెబుతుంటారు. తనకువచ్చిన అవకాశాల్ని వినియోగించటమే కాదు.. తనకు తానుగా అవకాశాల్ని సృష్టించుకోవటంలోనూ ఆమెకు ఆమేసాటి.

తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుపైనా.. నాటి ముఖ్యమంత్రులపైనా ఒంటి కాలితో విరుచుకుపడేందుకు ఉత్సాహం ప్రదర్శించేవారు. నిజానికి అప్పటికి కవిత స్థాయి కేవలం కేసీఆర్ కుమార్తె మాత్రమే. అయితే.. తన విమర్శల్ని మీడియాలో ప్రముఖంగా వచ్చేలా చేసుకోవటం దగ్గర నుంచి.. పదునైన వాదనను వినిపించటం.. విమర్శలతో ఉక్కిరిబిక్కిరి చేసేలా అవకాశం లభించిన వేదిక మీద తన సత్తాను చాటి తనదైన బ్రాండ్ ను ఆమె క్రియేట్ చేసుకోగలిగారు.

ఎంపీగా లోక్ సభలో అడుగు పెట్టిన కొద్దిరోజులకే క్లిష్టమైన.. కష్టతరమైన కశ్మీర్ అంశంపై ఆయన తన వాణిని వినిపించటం..కలకలం రేపటం లాంటివి చేశారు. ఇలా ఒకటి తర్వాత మరొకటి అన్న చందంగా తన స్థాయిని పెంచుకుంటున్న కవిత.. తాజాగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఉద్దేశించి విమర్శలు చేశారు.కవిత లాంటి నేత.. జాతీయస్థాయినేత అయిన రాహుల్ మీద విమర్శలు చేయటమా? అని తెలంగాణ కాంగ్రెస్ నేతలు రగిలిపోతున్నారు. అందుకే ఆమెపై మాటలదాడిని మొదలెట్టారు. ఇందులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ రథసారధి ఉత్తమ్ కుమార్ రెడ్డి కవితపై నిప్పులు చెరిగారు.

తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని గుర్తించిన సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇస్తే.. అధికారంలోకి వచ్చామన్న అహంకారంతో కళ్లునెత్తికెక్కిన కవిత మాత్రం ఏకంగా రాహుల్ గాంధీపై నోరు పారేసుకున్నారన్నారు. రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి కవితదా? అంటూ ప్రశ్నించిన ఉత్తమ్.. ‘‘సోనియాగాంధీ దయతో మీ అయ్య కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. కావాలంటే మీ అయ్యను అడిగి తెలుసుకో’’ అని మండిపడ్డారు. ప్రధానమంత్రి న‌రేంద్ర మోడీ అనాలోచితంగా, అహంకారపూరితంగా నోట్ల రద్దు కార్యక్రమాన్ని చేయటం వల్ల సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. త‌న మాట‌ల గార‌డితో ప్ర‌జ‌ల‌ను మ‌భ్య పెడుతున్న మోడీ తీరును ప్ర‌జ‌లు ఆల‌స్యంగానైనా అర్థం చేసుకున్నార‌ని తెలిపారు.

కాంగ్రెస్ మాజీ ఎంపీ మ‌ధుయాష్కీ మాట్లాడుతూ క‌లెక్ట‌ర్ ను త‌న కాళ్ల ద‌గ్గ‌ర కూర్చోబెట్టుకోవ‌డం ద్వారా నిజామాబాద్ ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత త‌న దొర‌సానిత‌నం చాటుకున్నార‌ని తెలిపారు. బాధ్య‌తాయుత‌మైన ఎంపీ స్థానంలో ఉన్న వ్య‌క్తి ప్ర‌భుత్వ అధికారుల‌తో ఏ విధంగా వ్య‌వ‌హ‌రించాలో తెలియ‌కుంటే ఎలా అని యాష్కీ ప్ర‌శ్నించారు. పైగా వారు విలువ‌లు, స‌మాజానికి ప‌ద్ద‌తులు చెప్తార‌ని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్ర‌భుత్వాన్ని ప్ర‌స‌న్నం చేసుకోవ‌డానికి సీఎం కేసీఆర్ ప్రాధాన్యం ఇస్తున్నారే త‌ప్ప ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను పట్టించుకోవ‌డం లేద‌ని యాష్కీ విమ‌ర్శించారు.

సోనియా గాంధీ దయతో అయితే గియితే కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రి కావాలే కానీ.. టీఆర్ ఎస్ పార్టీ అధినేత సీఎం ఎలా అవుతారు? సోనియాగాంధీ అంత తోపే అయితే.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు పవర్ లోకి రానట్లు? ఇలాంటి ప్రశ్నల్ని ఉత్తమ్ లాంటోళ్లు వేసుకుంటే.. కవిత లాంటినేతల ‘స్థాయి’ గురించి నోరు పారేసుకోరని చెప్పాలి. విమర్శించటం తప్పు కాదు.. కానీ.. అందులోభాగంగా ఎత్తి చూపే లాజిక్ కు ప్రజలు కన్వీన్స్ అయ్యేలా ఉండటం చాలా ముఖ్యమన్న విషయాన్ని మర్చిపోకూడదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/