Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ పోటీ చేసే సీట్ల లెక్క చెప్పిన ఉత్త‌మ్‌

By:  Tupaki Desk   |   18 Sep 2018 5:18 AM GMT
కాంగ్రెస్ పోటీ చేసే సీట్ల లెక్క చెప్పిన ఉత్త‌మ్‌
X
ఓవైపు ముంద‌స్తుగా అభ్య‌ర్థుల ఎంపిక‌తో పాటు.. 105 మంది జాబితాను ప్ర‌క‌టించిన టీఆర్ ఎస్ అధినేత ముంద‌స్తు ఎన్నిక‌ల ప్ర‌చారంలో జోరుగా సాగుతున్నారు. కేసీఆర్ జెట్ స్పీడ్‌ ను అందుకోలేక విప‌క్షాలు కిందామీదా ప‌డుతున్నాయి. 105 మంది అభ్య‌ర్థుల్ని ప్ర‌క‌టించిన టీఆర్ ఎస్ కు ధీటుగా.. మ‌రే పార్టీ కూడా త‌మ అభ్య‌ర్థుల్ని ప్ర‌క‌టించేందుకు భారీగా క‌స‌ర‌త్తు చేస్తోంది. అయినా.. లెక్క‌లు ఓ ప‌ట్టున తేల‌ని ప‌రిస్థితి.

ఇదిలా ఉంటే.. క్యాలెండ‌ర్లో రోజులు గడుస్తున్న‌కొద్దీ.. అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న ఎప్పుడున్న దానిపై స్ప‌ష్ట‌త రాని ప‌రిస్థితి. పొత్తుల‌పై ఇప్ప‌టివ‌ర‌కూ ఉన్న సందేహాల‌కు పుల్ స్టాప్ పెట్టి.. మ‌హా కూట‌మి ఖాయ‌మ‌ని తేల్చి చెబుతున్నారు తెలంగాణ కాంగ్రెస్ ర‌థ‌సార‌ధి ఉత్త‌మ్‌.

గెలుపే ధ్యేయంగా మ‌హాకూట‌మి ఉంటుంద‌ని.. గెలిచే అభ్య‌ర్థుల‌కే టికెట్లు ప‌క్కా అని ఆయ‌న స్ప‌ష్టం చేస్తున్నారు. త‌మ‌కు తాము 70 నుంచి 75 సీట్ల వ‌ర‌కూ పోటీ చేస్తామ‌ని చెబుతున్న ఉత్త‌మ్‌.... ముంద‌స్తుకు వెళ్లిన‌ కేసీఆర్ తీరును తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. ఇక‌.. త‌మ పార్టీ అభ్య‌ర్థుల జాబితాను అక్టోబ‌రులో ప్ర‌క‌టిస్తామ‌న్నారు.

కేసీఆర్ తీసుకున్న ముంద‌స్తు నిర్ణ‌యం పుణ్య‌మా అని.. తెలంగాణ‌కు కేసీఆర్ శ‌ని త‌ప్పిపోతుంద‌ని వ్యాఖ్యానించారు. తాజా ఎన్నిక‌ల్లో పోటీ ప్ర‌జ‌ల‌కు.. కేసీఆర్ కుటుంబానికి మ‌ధ్య‌నేన‌ని చెప్పిన ఉత్త‌మ్‌.. ముంద‌స్తుతో టీఆర్ ఎస్ త‌న గొయ్యి తానే త‌వ్వుకుంద‌న్నారు.

కేసీఆర్ ఊహాలోకాల్లో ప్ర‌యాణిస్తున్నార‌ని.. అలా ఉండే అసెంబ్లీని ర‌ద్దు చేశార‌ని.. ఊహాలోకంలో ఉండే ఓట‌మి పాల‌వుతార‌ని.. తాము క‌చ్ఛితంగా గెలుస్తామ‌ని ఉత్త‌మ్ ధీమాను వ్య‌క్తం చేశారు. కాంగ్రెస్ ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడే పార్టీ అని.. మాన‌వ హ‌క్కుల్ని గౌర‌వించే పార్టీగా ఆయ‌న చెప్పుకున్నారు.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున సీఎం అభ్య‌ర్థి ఎవ‌ర‌న్న ప్ర‌శ్న‌కు ఫ‌లితాల త‌ర్వాత రాహుల్ ఎవ‌రిని నియ‌మిస్తే వారే ముఖ్య‌మంత్రి అవుతార‌ని స్ప‌ష్టం చేశారు. బీజేపీతో అవ‌గాహ‌న కుదుర్చుకున్న టీఆర్ ఎస్ తో మ‌జ్లిస్ దోస్తీ ఎలా చేస్తుందో అర్థం కావ‌టం లేద‌ని మండిప‌డ్డారు. అమ‌ర‌వీరులు కోరుకున్న‌తెలంగాణే మ‌హాకూట‌మి ఉమ్మ‌డి అజెండా ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. మ‌రి.. ఉత్త‌మ్ మాట‌ల‌కు ఎన్ని ఓట్లు రాలుతాయో చూడాలి.