Begin typing your search above and press return to search.

అపార్థం చేసుకోవ‌ద్దంటున్న ఉత్త‌మ్‌

By:  Tupaki Desk   |   13 Aug 2017 6:00 AM GMT
అపార్థం చేసుకోవ‌ద్దంటున్న ఉత్త‌మ్‌
X
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌ కుమార్ రెడ్డికి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌గా చేప‌డుతున్న కార్య‌క్ర‌మాల‌తో పాటుగా పార్టీలోని అంత‌ర్గ‌త రాజ‌కీయాల‌ను ఎదుర్కోవ‌డం సైతం భ‌లే ఇబ్బందిగా మారుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. లోలోప‌లి కుమ్ములాట‌ల‌కు - అంత‌ర్గ‌త కుంప‌ట్ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అని పేరున్న కాంగ్రెస్ పార్టీలో ఉత్త‌మ్ ఇప్ప‌టివ‌ర‌కు బాగానే నెట్టుకొస్తున్న‌ట్లు చెప్తున్నారు. అయితే ఆయ‌న కొంద‌రు టీఆర్ ఎస్ పార్టీ నేత‌ల‌తో చ‌ర్చ‌ల్లో ఉన్న‌ట్లు కాంగ్రెస్ పార్టీలోని ఓ వ‌ర్గం ప్ర‌చారం మొద‌లుపెట్టింది. పార్టీలోని నేత‌ల జంపింగ్‌ ల‌ను అరిక‌ట్ట‌లేని ఉత్త‌మ్‌...టీఆర్ ఎస్‌ లో చేరిన సీనియ‌ర్ల‌ను తిరిగి కాంగ్రెస్ బాట ప‌ట్టించాల‌ని చూస్తున్నార‌ని...అది అయ్యే ప‌ని కాద‌ని తెలిసినా...ఇలా చేస్తున్నార‌ని సొంత పార్టీ నేత‌లే అంత‌ర్గ‌త సంభాష‌ణ‌ల్లో ఎద్దేవా చేసిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి.

అయితే ఇలా స్వ‌ప‌క్షంలోని విప‌క్ష నేత‌లే త‌న‌పై నెగెటివ్ క్యాంపెయిన్ మొద‌లుపెట్టిన నేప‌థ్యంలో తెలంగాణ పీసీసీ ర‌థ‌సార‌థి వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సి వ‌చ్చింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌ ఛార్జిగా నియమితులైన ఆర్‌ సీ కుంతియా గాంధీ భవన్‌ కు వచ్చిన సందర్భంగా కుంతియా - ఉత్తమ్‌ కుమార్ రెడ్డి - కౌన్సిల్‌ లో ప్రతిపక్ష నేత మహ్మద్ షబ్బీర్ అలీ కొంత సేపు మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా డీఎస్ తిరిగి కాంగ్రెస్‌ లో చేరనున్నట్లు జరుగుతున్న ప్రచారం గురించి విలేఖరులు ప్రస్తావించగా, ఉత్తమ్‌ కుమార్ రెడ్డి కల్పించుకుని తాను డీఎస్‌ ను ఆహ్వానించినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. కుంతియా మాట్లాడుతూ వివిధ కారణాలతో పార్టీ వీడిన వారు తిరిగి సొంత గూటికి చేరుకోవాలన్నారు. గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా పని చేసిన వారిని మాత్రం చేర్చుకోమని ఆయన తెలిపారు.

మ‌రోవైపు తాను టీఆర్‌ ఎస్‌ ను వీడి కాంగ్రెస్‌లో చేరుతానని కొందరు తనపై దుప్ప్రచారం చేస్తున్నారని రాజ్యసభ సభ్యులు డీ శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేసిన సంగ‌తి తెలిసిందే. తానంటే గిట్టని వారు ఇలాంటి ప్రచారం చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్‌ లో చేరే ప్రసక్తే లేదని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. పార్టీలోకి తిరిగి రావాల్సిందిగా త‌న‌ను ఆహ్వానించలేదని డీఎస్ తెలిపారు. తాను కాంగ్రెస్‌ లో చేరుతున్నట్టు చెప్పిన కాంగ్రెస్ నాయకులు ఎవరో వారి పేర్ల బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కొన్ని చానల్స్ - పత్రికలు ఇష్టానుసారం రాస్తున్నాయని, కనీసం రాసే ముందు తన వివరణ తీసుకోవాలని అన్నారు.