Begin typing your search above and press return to search.

పీసీసీ చీఫ్ గా ఉత్త‌మ్ ఔట్‌.. ఇన్ ఎవ‌రంటే?

By:  Tupaki Desk   |   15 May 2019 6:06 AM GMT
పీసీసీ చీఫ్ గా ఉత్త‌మ్ ఔట్‌.. ఇన్ ఎవ‌రంటే?
X
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంత‌రం పీసీసీ చీఫ్ గా ఉత్త‌మ్ కుమార్ రెడ్డిని నియ‌మిస్తూ కాంగ్రెస్ అధినాయ‌క‌త్వం నిర్ణ‌యం తీసుకుంది. ఐదేళ్ల అనంత‌రం.. తాజాగా ఆయ‌న స్థానే మ‌రొక‌రిని నియ‌మించే దిశ‌గా కాంగ్రెస్ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా స‌మాచారం.

విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం ఉత్త‌మ్ ను పీసీసీ చీఫ్ స్థానం నుంచి తొల‌గించి.. ఆయ‌న స్థానంలో కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌.. మృదుస్వభావిగా పేరున్న దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబుకు అవ‌కాశం ఇవ్వాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు చెబుతున్నారు. పార్టీని మ‌రింత బ‌లోపేతం చేసేందుకు వీలుగా పార్టీ అధినాయ‌క‌త్వం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా తెలుస్తోంది.

మంగ‌ళ‌వారం గాంధీ భ‌వ‌న్ లో చోటు చేసుకున్న ఒక ప‌రిణామ‌మే తాజా వాద‌న‌కు బ‌లం చేకూరిన‌ట్లుగా స‌మాచారం. మంగ‌ళ‌వారం ఉత్త‌మ్‌.. శ్రీ‌ధ‌ర్ బాబుల మ‌ధ్య న‌డిచిన ఆస‌క్తిక‌ర చ‌ర్చే కొత్త మార్పుల విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టిన‌ట్లుగా తెలుస్తోంది. గాంధీ భ‌వ‌న్ లో ఈ ఇద్ద‌రు నేతలు మాట్లాడుతుండ‌గా.. మాట‌ల మ‌ధ్య‌లో ఉత్త‌మ్ ఒక ఆస‌క్తిక‌ర వ్యాఖ్య చేశారు.

బీఫారాలు ఇక‌పై ఇచ్చేది నువ్వే క‌దా? అని వ్యాఖ్యానించ‌గా.. అందుకు ప్ర‌తిగా శ్రీ‌ధ‌ర్ బాబు స్పందిస్తూ.. పై నుంచి పంపేది నువ్వే క‌దా? అని కామెంట్ చేయ‌టంతో ఈ ఇద్ద‌రు నేత‌ల‌కు కీల‌క ప‌ద‌వులు ఇవ్వ‌నున్నట్లుగా భావిస్తున్నారు.  తాజా అంచ‌నాల ప్ర‌కారం రానున్న రెండురోజుల్లో ఉత్త‌మ్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తార‌ని తెలుస్తోంది. ఆవెంట‌నే శ్రీ‌ధ‌ర్ బాబు నియామ‌కం గురించి ప్ర‌క‌ట‌న వెలువ‌డుతుంద‌ని చెబుతున్నారు.

పీసీసీ చీఫ్ ప‌ద‌వికి రాజీనామా చేసిన త‌ర్వాత ఉత్త‌మ్ ను ఏఐసీసీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా నియ‌మిస్తార‌ని తెలుస్తోంది. ఈ వాద‌న‌కు బ‌లం చేకూర్చేలా ఇటీవ‌ల జ‌గ్గారెడ్డి వ్యాఖ్య‌ల్ని ప‌లువురు ప్ర‌స్తావిస్తున్నారు. ఉత్త‌మ్ ను పీసీసీ చీఫ్ గా మార్చ‌ర‌ని.. ఒక‌వేళ మార్చిన ప‌క్షంలో శ్రీ‌ధ‌ర్ బాబు.. కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్.. పొన్నంలో ఎవ‌రో ఒక‌రు అవుతార‌ని చెప్పారు. ఆయ‌న అంచ‌నాకు త‌గ్గ‌ట్లే శ్రీ‌ధ‌ర్ బాబు పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తుండ‌టం విశేషం.  చూస్తుంటే.. టీపీసీసీ.. ఏఐసీసీకి సంబంధించి భారీ మార్పులు రానున్న రెండు రోజుల్లో చోటు చేసుకోనున్నాయా? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.