Begin typing your search above and press return to search.

కూట‌మి విచ్చిన్నం...ఒక‌డుగే దూరం

By:  Tupaki Desk   |   10 Nov 2018 4:35 PM GMT
కూట‌మి విచ్చిన్నం...ఒక‌డుగే దూరం
X
తెలంగాణ మహా కూటమి చీలిక దిశ‌గా సాగుతోంది. ఓ వైపు సీట్లు మ‌రోవైపు నియోజ‌క‌వ‌ర్గాల కేటాయింపు విష‌యంలో వివాదం కొన‌సాగుతోంది. తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ పై ఢిల్లీ వేదికగా అధిష్టానం ముమ్మర కసరత్తు చేసి మిత్రపక్షాలకు కేటాయించాల్సిన స్థానాలు - సామాజిక వర్గాల వారిగా ప్రాతినిధ్యంపై సుదీర్ఘంగా చర్చించిన సంగ‌తి తెలిసిందే. అయితే, అధికారికంగా ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌కుండా లీకులు ఇవ్వ‌డం - అవి త‌మ‌కు ఆమోద‌ యోగ్యంగా లేని క్ర‌మంలో సీపీఐ - టీజేఎస్ అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నాయి. తమకు మరిన్ని సీట్లు కావాలంటున్న టీజేఎస్‌ కాంగ్రెస్‌ కు డెడ్‌ లైన్ విధించింది. అయితే - ఈ డెడ్‌ లైన్ అనంత‌రం జ‌రిగిన ప‌రిణామాలు కూట‌మిని చీలిక దిశ‌గా తీసుకువెళతాయ‌నే అభిప్రాయాన్ని క‌లిగించింది.

సాయంత్రంలోగా సీట్ల ఖరారుపై స్పష్టత ఇవ్వకపోతే సాయంత్రం కోర్‌ కమిటీలో చర్చించి కీలక నిర్ణయం తీసుకుంటామని హెచ్చరించింది. కాంగ్రెస్ ఐదు సీట్లు మాత్రమే కేటాయించడంతో 12 నుంచి 17 నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ప్రకటించేందుకు కోదండరాం సిద్ధమవుతున్నారని - దీనికి సంబంధించి ఇప్పటికే జాబితాను సిద్ధం చేసుకున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగింది. పీసీసీ చీఫ్ ఉత్త‌మ్‌ కుమార్ రెడ్డి కూట‌మి నేత‌ల‌తో భేటీ అయ్యారు. కూటమి భాగస్వామ్య పార్టీ ల తరుపున హాజరైన కోదండరాంతో చ‌ర్చించారు. అయితే - పార్క్ హయత్‌ లో భేటీ అనంత‌రం మీడియాతో మాట్లాడకుండా ఉత్తమ్‌ కుమార్ రెడ్డి వెళ్లిపోయారు. చర్చల్లో పురోగతి లేద‌ని కాంగ్రెస్ అసంతృప్తిలో ఉంది.

కాగా, ఈ స‌మావేశం నుంచి కూడా కోదండ‌రాం అర్ధాంతరంగా వెళ్లిపోయారు. చర్చల్లో పురోగతి లేదని పేర్కొంటూ కోదండరాం మధ్యలోనే వెళ్లిపోయారు. రేపు మరోసారి కూటమి సమావేశం కానుంద‌ని - అప్పుడు త‌మ‌ నిర్ణయాన్ని ప్రకటిస్తామ‌న్నారు. అయితే, శ‌నివారం సాయంత్ర‌మే కోదండ‌రాం త‌మ పార్టీ నేత‌ల‌తో స‌మావేశం ఏర్పాటు చేసుకొని కీల‌క చ‌ర్చ‌లు పూర్తి చేశారు.