Begin typing your search above and press return to search.

మాన‌సికంగా సిద్ధ‌మ‌వుతున్న ఉత్త‌మ్‌!

By:  Tupaki Desk   |   27 Nov 2018 10:53 AM GMT
మాన‌సికంగా సిద్ధ‌మ‌వుతున్న ఉత్త‌మ్‌!
X
ప్ర‌జా కూట‌మి గెలిచినా - ఓడినా పూర్తి బాధ్య‌త నాదే'

'కూట‌మి ఓడిపోతే గాంధీభ‌వ‌న్‌ లో అడుగుపెట్ట‌ను'

హైద‌రాబాద్‌ లోని గాంధీభ‌వ‌న్‌ లో సోమ‌వారం ఉత్త‌మ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లివి. తెలంగాణ‌ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో ప్ర‌జా కూట‌మి ప‌రాజ‌యం ఖాయ‌మ‌ని తేల‌డం వ‌ల్లే ఉత్త‌మ్ అలా మాట్లాడార‌ని రాజ‌కీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప‌రాజ‌య భారాన్ని మోసేందుకు ఆయ‌న త‌న‌ను తాను మాన‌సికంగా సిద్ధం చేసుకుంటున్న‌ట్లు క‌నిపిస్తోంద‌ని విశ్లేషిస్తున్నారు.

కాంగ్రెస్‌ - టీడీపీ - సీపీఐ - తెలంగాణ జ‌న స‌మితి క‌లిసి ఒక్క‌టిగా పోటీ చేస్తున్నా తెలంగాణ‌లో ప్ర‌జా కూట‌మికి క్షేత్ర‌స్థాయిలో పెద్ద‌గా సానుకూలత‌లు క‌నిపించ‌డం లేద‌ని తెలుస్తోంది. కేసీఆర్ ఎక్క‌డ స‌భ పెట్టినా జ‌నం భారీగా వెళ్తుండ‌టం - సోనియా ముఖ్య అతిథిగా హాజ‌రైన మేడ్చ‌ల్ స‌భ‌కు త‌ప్ప కాంగ్రెస్ నిర్వ‌హించిన‌ స‌భ‌ల‌కు నామ‌మాత్రంగా ఆద‌ర‌ణ ల‌భిస్తుండ‌టం వంటి ప‌రిణామాలు ఉత్త‌మ్ క‌ళ్లు తెరిపించాయ‌ట‌. ఇక టీడీపీతో పొత్తు కూడా అనుకున్నంత క‌లిసి రావ‌డం లేద‌ట‌. చంద్ర‌బాబుపై తెలంగాణ ప్ర‌జ‌ల్లో అభిమానం కంటే వ్య‌తిరేక‌తే ఎక్కువ‌గా ఉన్న‌ట్లు ప‌లు స‌ర్వేలు ఇటీవ‌ల ఉత్త‌మ్‌ కు నివేదిక‌లు అందించాయ‌ట‌. దీంతో టీడీపీతో అన‌వ‌స‌రంగా పొత్తు పెట్టుకున్నామని ఆయ‌న లోలోప‌ల మ‌ద‌న‌ప‌డుతున్నార‌ట‌. ఓట‌మి క‌ళ్ల ముందు క‌నిపిస్తోంది కాబ‌ట్టే పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా ఆ ఫ‌లితానికి తాను బాధ్య‌త వ‌హించాల్సి ఉంటుంద‌ని గ్ర‌హించిన ఉత్త‌మ్.. మాన‌సికంగా అందుకు సిద్ధ‌మ‌య్యే ప్ర‌ణాళిక‌ల్లో భాగంగానే సెక్ర‌టేరియ‌ట్‌ లో సోమ‌వారం ప‌రాజ‌యం ప్ర‌స్తావ‌న తీసుకొచ్చార‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

అయితే - ఉత్త‌మ్ మాట‌ల‌కు ఆయ‌న అనుకూల వ‌ర్గాలు మ‌రో ర‌క‌మైన భాష్యాన్ని కూడా చెబుతున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌జా కూట‌మి గెలుపు ఖాయ‌మ‌ని ఉత్త‌మ్ భావిస్తున్నార‌ని.. అందుకే విజ‌యానికి తానే కార‌ణ‌మ‌నే భావ‌న‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాలని ఆయ‌న ప్ర‌య‌త్నిస్తున్నార‌ని వారు విశ్లేషిస్తున్నారు. దాని వ‌ల్ల సీఎం పీఠం త‌న‌కే ద‌క్కుతుంద‌న్న‌దే ఆయ‌న ప్ర‌ణాళిక కావొచ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు. మ‌రి ఉత్త‌మ్ మాట‌ల ఆంత‌ర్యం ఏంటో తెలియాలంటే ఇంకో 15 రోజులు వేచి ఉండ‌క త‌ప్ప‌దు!