Begin typing your search above and press return to search.

తూచ్.. రాజీనామా చేయడం లేదట!

By:  Tupaki Desk   |   5 Jun 2019 12:52 PM GMT
తూచ్.. రాజీనామా చేయడం లేదట!
X
అటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తన నాయకత్వంలో వెళ్లి చిత్తు అయ్యింది కాంగ్రెస్ పార్టీ. ఆ పై లోక్ సభ ఎన్నికల్లో కూడా పెద్దగా సాధించింది ఏమీ లేదు. లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితికి కొంత వరకూ దెబ్బ పడినా, అది కాంగ్రెస్ పార్టీకి ప్లస్ కాలేదు. బీజేపీ లాభపడింది.

ఇక స్థానిక ఎన్నికల్లో కూడా యథారీతిన కాంగ్రెస్ పార్టీ చిత్తు అయ్యింది. ఈ నేపథ్యంలో వరస ఓటములకు బాధ్యుడిగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయబోతున్నట్టుగా వార్తలు వచ్చాయి. తన స్థానంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మరొకరికి బాధ్యతలను అప్పగించనున్నారని.. ఇది కాంగ్రెస్ లోని సీనియర్లకు మంచి అవకాశం అని ప్రచారం జరిగింది.

ఉత్తమ్ రాజీనామా నేపథ్యంలో పీసీసీ అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందనే అంశం గురించి కూడా చర్చ మొదలు అయ్యింది. అయితే ఈ అంశంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. తనకు రాజీనామా చేసే ఉద్దేశమే లేదని తేల్చేశారు.

తను పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయబోతున్నట్టుగా జరుగుతున్న ప్రచారం పూర్తిగా అబద్ధం అని ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చి చెప్పారు. తెలంగాణ పీసీసీ చీఫ్ గా తనే కొనసాగబోతున్నట్టుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించుకున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో తాము ఆశించిన ఫలితాలు రాలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధికార దుర్వినియోగంతో గెలిచిందని చెప్పుకొచ్చారు.