Begin typing your search above and press return to search.

కేటీర్ స‌వాల్ కు ఉత్తమ్ ప్ర‌తి స‌వాల్!

By:  Tupaki Desk   |   1 Feb 2018 1:07 PM GMT
కేటీర్ స‌వాల్ కు ఉత్తమ్ ప్ర‌తి స‌వాల్!
X
గద్వాలలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో.....కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డిపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగతి తెలిసిందే. 2019లో జ‌ర‌గ‌బోతోన్న ఎన్నిక‌ల్లో టీఆర్‌ఎస్ త‌ప్ప‌క విజ‌యం సాధిస్తుంద‌ని, తాము ప్రభుత్వం ఏర్పాటు చేయకపోతే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని షాకింగ్ కామెంట్స్ చేశారు. అదే స‌మ‌యంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే ఉత్త‌మ్ కుమార్ రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకుంటారా? అంటూ స‌వాల్ విసిరారు. తెలంగాణ‌ను కాంగ్రెస్ పార్టీ స‌ర్వ నాశ‌నం చేసింద‌ని, కాంగ్రెస్ వ‌ల్ల రాష్ట్రానికి ప‌ట్టిన గబ్బును వదిలించాలంటే నాలుగేళ్లు సరిపోవని, మరో 20ఏళ్లు పడుతుందన్నారు. త‌మ‌ది ప్ర‌జా రంజ‌క పాల‌న‌ని, మరో 20 ఏళ్ల దాకా తెలంగాణలో కేసీఆరే ముఖ్యమంత్రి అని స్పష్టం చేశారు. ఈ నేప‌థ్యంలో, కేటీఆర్ స‌వాల్ ను ఉత్త‌మ్ స్వీక‌రించారు. రాజకీయాల్లో కేటీఆర్ ఓ బచ్చా అని ఉత్తమ్ తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. తెలంగాణలో ప్ర‌తి కాంట్రాక్ట్ కు ఆరు శాతం క‌మీష‌న్ ఇవ్వాల్సిందేన‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

2019 ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ 100కు పైగా స్థానాల్లో విజ‌యం సాధిస్తుంద‌ని కేటీఆర్ నొక్కి వ‌క్కాణిస్తున్నార‌ని, ఆయ‌న చెప్పిన‌ట్లు జ‌రిగితే రాజకీయ సన్యాసానికి సిద్ధమని స్ప‌ష్టం చేశారు. అంతేకాకుండా, 2019లో టీఆర్ ఎస్ అధికారంలోకి వస్తే తాను కుటుంబ‌స‌మేతంగా రాజ‌కీయాల నుంచి తప్పుకుంటాన‌న్నారు. ఒక‌వేళ 100 కు పైగా సీట్లు రాకుంటే ఏం చేస్తారో కేటీఆర్ చెప్పాలని నిలదీశారు. అదే స‌మ‌యంలో కాంగ్రెస్ గెలిస్తే...... కేసీఆర్ - కేటీఆర్ - కవిత - హరీష్ రావు....కుటుంబ‌స‌భ్యులు రాజ‌కీయ స‌న్యాసం చేస్తారా? అని ప్ర‌తి స‌వాల్ విసిరారు. తెలంగాణ‌లో కుటుంబ‌పాల‌న న‌డుస్తోంద‌ని, అధికారంతో కేటీఆర్ కళ్ళు నెత్తికెక్కాయని విరుచుకుప‌డ్డారు. తెలంగాణ‌లో టీఆర్ ఎస్ అధికారంలో ఉండ‌డం ప్రమాదకరమన్నారు. కాంగ్రెస్ పై ఇటువంటి ఆరోప‌ణ‌లు చేసేందుకు సిగ్గుండాల‌న్నారు. టీఆర్ ఎస్ పాలన అద్భుతంగా ఉంటే ప్ర‌తిప‌క్షాల విమర్శలకు ఉలికిపాటెందుక‌ని ప్ర‌శ్నిచారు. విమ‌ర్శ‌లు చేసినందుకే కేసులు పెట్టాల్సి వస్తే.....కేసీఆర్ మీద ఎన్నో కేసులు పెట్టాల‌న్నారు.