Begin typing your search above and press return to search.

హైద‌రాబాద్‌ లో సీమాంధ్రుల‌కు కాంగ్రెస్ టికెట్లు!

By:  Tupaki Desk   |   12 April 2018 6:14 AM GMT
హైద‌రాబాద్‌ లో సీమాంధ్రుల‌కు కాంగ్రెస్ టికెట్లు!
X
కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో హైద‌రాబాద్ లోని సీమాంధ్ర నేత‌ల‌కు టికెట్లు ఇచ్చేందుకు త‌మ పార్టీ అంగీక‌రించిన‌ట్లుగా ప్ర‌క‌టించారు. మీడియాతో మాట్లాడిన ఆయ‌న ఈ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఉత్త‌ర తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుంద‌న్న ధీమాను వ్య‌క్తం చేసిన ఉత్త‌మ్‌.. కాంగ్రెస్ చేస్తున్న ప్ర‌జా చైత‌న్య‌యాత్ర‌ల‌కు అన్ని వ‌ర్గాల నుంచి స్పంద‌న ల‌భిస్తోంద‌న్నారు.

పాల‌మూరు.. రంగారెడ్డి.. న‌ల్గొండ పాత జిల్లాల్లో కాంగ్రెస్ స్వీప్ చేస్తుంద‌న్న న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేసిన ఉత్త‌మ్‌.. త‌మ విజ‌యాన్ని ఎవ‌రూ ఆప‌లేర‌న్నారు. ఉత్త‌ర తెలంగాణ‌లోనూ కాంగ్రెస్ అన్ని స్థానాల్ని గెలుస్తుంద‌న్నారు. హైద‌రాబాద్ విష‌యంలో కాంగ్రెస్ పార్టీకి ప్ర‌త్యేక‌మైన వ్యూహం ఉంద‌ని.. న‌గ‌రంలోని సీమాంధ్ర నేత‌ల‌తో తాము మాట్లాడుతున్నామ‌ని.. వారికి టికెట్లు ఇచ్చేందుకు అధిష్ఠానం అంగీక‌రించింద‌న్నారు.

కాంగ్రెస్ పార్టీపై గ‌తంలో ఉన్న కోపం ఇప్పుడు సీమాంధ్రుల‌కు లేద‌న్నారు. వారు త‌మ వైపే ఉన్నార‌న్నారు. మ‌జ్లిస్ కు బీజేపీకి ర‌హ‌స్య ఒప్పందం ఉంద‌ని.. ఆ పార్టీ పోటీ చేసే స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ బ‌ల‌మైన అభ్య‌ర్థుల్ని బ‌రిలోకి దించుతుంద‌న్నారు. టీఆర్ ఎస్ కు వెళ్లిన చాలామంది కాంగ్రెస్ నేత‌లు తిరిగి పార్టీలోకి వ‌స్తామ‌ని చెబుతున్నార‌ని.. దీనిపై అధినాయ‌క‌త్వం ఇంకా నిర్ణ‌యం తీసుకోలేదున్నారు.

ఇదే సంద‌ర్భంగా మ‌రో ఆస‌క్తిక‌ర అంశాన్ని ఉత్త‌మ్ వెల్ల‌డించారు. టీడీపీపై పొత్తు విష‌యంపై అధిష్ఠానం నిర్ణ‌యిస్తుంద‌న్నారు. ఆయ‌న మాట‌లు టీడీపీతో పొత్తు అంశాన్ని ఖండించ‌ని తీరు చూస్తే.. రానున్న రోజుల్లో ఆశ్చ‌ర్య‌క‌ర పొత్తుకు తెర తీస్తుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మవుతోంది. దీన్ని బ‌ల‌ప‌రిచేలా కాంగ్రెస్ సీనియ‌ర్ నేత చేసిన వ్యాఖ్య‌లు మ‌రింత ఆస‌క్తిక‌రంగా మారాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవ‌టానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉంద‌ని.. ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే త‌ప్పేంటి? అంటూ ప్ర‌శ్నించ‌టం చూస్తే.. కాంగ్రెస్ తో పొత్తు ప‌క్కా అయ్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. రానున్న ఎన్నిక‌లు యుద్ధాన్ని త‌ల‌పించేలా ఉంటాయ‌ని.. యుద్ధంలో గెల‌వ‌టానికి ఎన్ని అంశాలు ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాలో అన్ని అంశాల్ని వినియోగించుకోవాల్సి ఉంటుంద‌న్న విష‌యంపై పార్టీలు దృష్టి పెట్టిన‌ట్లుగా క‌నిపిస్తుంద‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు.