Begin typing your search above and press return to search.

టికెట్ల పంపకం మరీ ఇంత ఎర్లీగానా?

By:  Tupaki Desk   |   3 Feb 2018 10:53 AM GMT
టికెట్ల పంపకం మరీ ఇంత ఎర్లీగానా?
X
సాధారణంగా పార్టీలు సిట్టింగులకు టికెట్లు ఇస్తాం.. అని ప్రకటిస్తూ ఉంటాయి. ఏవో అత్యంత ఘోరంగా పనిచేసే ఒకరిద్దరి విషయంలో తప్ప ఇలాగే జరుగుతుంది. కొన్ని సీట్ల ఎంపిక విషయంలో నామినేషన్ల గడువు ముగిసిపోవడానికి కొన్ని గంటల ముందు వరకు కూడా పంచాయతీలు తెగకుండా నడుస్తూనే ఉంటాయి. సాధారణంగా ముఠాలు - రాష్ట్ర పార్టీ నాయకత్వాన్ని బైపాస్ చేసి ఢిల్లీలో పైరవీలు చేసుకోవడానికి అవకాశం ఉన్న కాంగ్రెస్ వంటి పార్టీల్లో ఇలాంటి వాతావరణం తరచుగా కనిపిస్తూ ఉంటుంది. కానీ చాలా విలక్షణమైన రీతిలో ఈసారి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముందుగానే అభ్యర్థులను ప్రకటించేయబోతున్నట్లుగా టీపీసీసీ చీఫ్ ఉత్తంకుమార్ రెడ్డి అనడం చిత్రంగా కనిపిస్తోంది. దీనివల్ల అభ్యర్థులు ముందస్తు ఎన్నికలు వచ్చినా కూడా ఎలాంటి తడబాటు లేకుండా జనంలోకి వెళ్లడం వీలవుతుందని ఆయన అంటున్నారు. అయితే ఉత్తమ్ అనుకుంటున్న వ్యూహం వల్ల కొన్ని ప్లస్సులు కొన్ని మైనస్సులు కనిపిస్తున్నాయి.

ముందుగా అభ్యర్థులను ప్రకటించడం అనేది అసాధ్యమైన విషయం ఎంతమాత్రమూ కాదు. ఎందుకంటే.. దాదాపు మూడో వంతు కంటె ఎక్కువ మంది టికెట్ గ్యారంటీ నాయకులు ఉంటారు. వారి పేర్లను ఇప్పుడే ప్రకటించేసి.. మేం ప్రకటించేశాం.. ‘మమ‘ అనేయవచ్చు. ప్రతిష్టంభన ఉండే కొన్ని సీట్ల విషయంలో ఎంత దూరమైనా సాగతీయవచ్చు.

కాకపోతే.. అలాంటి సీటు గ్యారంటీ నేతల విషయంలో కాకుండా.. మిగిలిన చోట్ల కూడా కొత్తగా ఎంపిక చేస్తున్న వారి పేర్లను కూడా కనీసం సగమైనా ఇప్పుడే ప్రకటించగలిగితేనే వారు ఎన్నికల ప్రచార పర్వంలోకిదిగి. ప్రజల మన్నన చూరగొనగలడానికి ప్రయత్నించడమూ - అంతో ఇంతో నిలదొక్కుకోవడమూ జరుగుతుంది. ఆ రకంగా కొంత మేలు జరుగుతుంది. కానీ ఇలాంటి ముందస్తు ప్రకటన వల్ల ఒక మైనస్ కూడా ఉంది.

ప్రస్తుతం కేసీఆర్ ప్రభుత్వం మంతనాలకు లొంగి అటుగా వలసలు వెళ్తున్న నాయకులు అనేకులు ఉన్నారు. కానీ ఎన్నికల రోజులు దగ్గర పడే కొద్దీ.. తెరాసలో తమకు సీటు దక్కదని ఖరారైతే.. ఇతర పార్టీల్లోకి వెళ్లడానికి సిద్ధంగా ఉండే బలమైన నాయకులు కూడా పెద్దసంఖ్యలోనే ఉంటారు. అలాంటి వారికి ప్రస్తుతం ఉన్న ఆల్టర్నేటివి పార్టీ కాంగ్రెస్ ఒక్కటే! తెలుగుదేశం లో చేరడానికి ఎవ్వరూ ముచ్చటపడకపోవచ్చు. అలాంటి నేపథ్యంలో కొన్ని రోజులు టికెట్లు ప్రకటించకుండా వేచిచూస్తే తెరాస నుంచి కూడా కొందరు బలమైన నాయకులు కలిసిరాగలరు. ముందుగా టికెట్లు ప్రకటించడం వల్ల డోర్లు మూసేసినట్లు అవుతుందని కూడా పలువురు భావిస్తున్నారు.

పైగా ప్రాక్టికల్ గా మరో ఇబ్బంది ఉంది. తెలంగాణ లో కాంగ్రెస్ ఈసారి ఎన్నికలకు తెరాస-యేతర పార్టీలన్నిటితో మిలాఖత్ అయి ఎన్నికలకు వెళ్లాలనుకుంటోంది. రాహుల్ సూచన కూడా అదే. అలాంటప్పుడు.. అసలు ఎన్ని పార్టీలు ఉంటాయో ఎన్ని బలంగా ఉంటాయో.. వారికి ఎన్నేసి సీట్లు పంచాలో ఏమీ తేలకుండా ఇప్పుడే టికెట్లు పంచేస్తే.. ఆ వ్యూహం ఫలిస్తుందా అనేది కూడా అనుమానమే.