Begin typing your search above and press return to search.

గెలుపు గుర్రాల్ని మాత్రమే బరిలోకి

By:  Tupaki Desk   |   31 Jan 2017 4:42 AM GMT
గెలుపు గుర్రాల్ని మాత్రమే బరిలోకి
X
తెలంగాణ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్లకు పైనే టైం ఉంది. అయితే.. ఈ ఎన్నికల సందర్భంగా ఏడాదికి ముందే తమ అభ్యర్థుల్ని ప్రకటించనన్నట్లుగా ఈ మధ్యనే తెలంగాణ కాంగ్రెస్ రథసారధి ఉత్తమ్ కుమార్ చెప్పిన ముచ్చట తెలిసిందే. అయితే.. అవన్నీఉత్త మాటలు కావని.. ఆ దిశగా పార్టీ కసరత్తు మొదలు పెట్టిందని చెబుతున్నారు. గెలుపు గుర్రాల్ని మాత్రమే బరిలోకి దించటమే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని చెబుతున్నారు.

ఇందుకోసం ఆ పార్టీ పెడుతున్న కఠిన నిబంధనల మీద ఇప్పుడా పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసిన నేతల వివరాలు.. వారి పొలిటికల్ ట్రాక్ రికార్డు.. ఎన్నికల్లో వారి జయపజయాల మీద తీవ్రస్థాయిలో కసరత్తు జరుగుతుందని చెబుతున్నారు. ఇందుకోసం ఒక ప్రైవేటు సంస్థతో సర్వే చేయించినట్లుగా తెలుస్తోంది.

2019 ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థులుగా టికెట్ సంపాదించటం అంత తేలికైన వ్యవహారం కాదని.. కఠిన విధానాల్ని అనుసరించాలని.. వడపోత కార్యక్రమం శాస్త్రీయంగా ఉండాలన్న ఆలోచనతో కాంగ్రెస్ ఉందని చెబుతున్నారు. ఇందుకోసం పెట్టుకొన్ని కొన్ని గైడ్ లైన్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. టీ కాంగ్రెస్ టికెట్ పొందాలనుకునే వారు వరుసగా రెండుసార్లు కంటే ఎక్కువగా ఓడిపోయిన చరిత్ర ఉండకూడదు. గత ఎన్నికల్లో పాతిక వేల కంటే ఎక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయిన వారికి టికెట్ ఇచ్చే అవకాశం ఎంతమాత్రం ఉండదని తేల్చి చెబుతున్నారు. అంతేకాదు.. గడిచిన ఎన్నికల్లో మూడో స్థానంలోనో.. నాలుగో స్థానంలో నిలిచిన అభ్యర్థులపేర్లనుపరిశీలనకు కూడా స్వీకరించకూడదని నిర్ణయించినట్లుగా చెబుతున్నారు.

సీనియర్.. జూనియర్ అన్న విషయాల్ని పక్కన పెట్టి.. ఎవరైతే పార్టీ కోసం కష్టపడి పని చేస్తారో.. కమిట్ మెంట్ ఎక్కువగా ఉంటుందో వారికి మాత్రమే టికెట్ల ఎంపికలో ప్రాధాన్యత ఇవ్వాలే కానీ.. మరే విషయాల్ని పరిగణలోకి తీసుకోకూడదన్న మాట బలంగా వినిపిస్తోంది. కొన్ని చోట్ల జూనియర్లకు టికెట్లు ఇచ్చేందుకు వెనుకాడకూడదని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

సీనియర్లకు టికెట్లు ఇవ్వకపోవటం.. వారిని అవమానించటం ఎంత మాత్రం కాదన్న వాదనను వారు బలంగా వినిపిస్తున్నారు. టికెట్లు ఎవరికి ఇచ్చామా అన్న దాని కంటే పార్టీ గెలుపు మాత్రమే ముఖ్యమన్న విషయాన్ని గుర్తించాలన్న మాటను అందరికి అర్థమయ్యేలా చెప్పాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నిర్ణయాలతో పాటు.. జిల్లా పార్టీ అధ్యక్షులకు పార్టీ టికెట్లు ఇచ్చే అవకాశం లేదన్నవిషయాన్ని ఇప్పటికే స్పష్టం చేసిన కాంగ్రెస్ తీరుపై.. ఇప్పటికైతే నేతలు ఉరకుండిపోయినా.. ఎన్నికల వేళకు వీరు ఎలా రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారిందని చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/