Begin typing your search above and press return to search.

మూడేళ్ల ముందే రెఢీ అయిపోతారంట

By:  Tupaki Desk   |   19 May 2016 5:19 AM GMT
మూడేళ్ల ముందే రెఢీ అయిపోతారంట
X
పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు తమకు ఎదురులేదన్నట్లుగా వ్యవహరించిన కాంగ్రెస్ నేతలు.. పవర్ చేజారిన తర్వాత అడ్రస్ లేకుండా పోవటం తెలిసిందే. ఏపీలో ప్రత్యేక కారణాల వల్ల కాంగ్రెస్ మొత్తంగా ఖాళీ అయితే.. తెలంగాణలో పరిస్థితి అందుకు భిన్నం. పవర్ లో ఉన్నప్పుడు నిత్యం చెలరేగిపోయిన పలువురు నేతలతో పాటు.. కీలకస్థానాల్లో బాధ్యతలు నిర్వహించిన పలువురు నేతలు అడ్రస్ లేకుండా పోవటం తెలిసిందే. ఎందుకిలా అంటే.. ఎన్నికల ముందు నుంచి హడావుడి చేసినా ఎలాంటి ప్రయోజనం లేని నేపథ్యంలో.. ఎన్నికల ఏడాది లేదంటే.. అందుకు ఆర్నెల్ల ముందు పని మొదల పెడదామన్నట్లుగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు పలువురు వ్యవహరించటం తెలిసిందే.

నేతల్లో ఈ బద్ధకాన్ని వదిలించేందుకు సరికొత్త మాటను తెరపైకి తీసుకొచ్చింది తెలంగాణ కాంగ్రెస్. ఎప్పుడో మూడేళ్లకు వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే హడావుడి చేయాలని డిసైడ్ చేసింది. ఇందులో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా జిల్లాల వారీగా పార్టీ ఇన్ చార్జీలను నియమించి.. బాధ్యతలు అప్పగించింది. మూడేళ్లకు జరిగే ఎన్నికలకు ఇప్పటి నుంచి సమాయుత్తం కావాలని.. పార్టీని కింది స్థాయి నుంచి బలోపేతం చేయాలని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ డిసైడ్ చేసింది.

2019 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పని చేయాలని నిర్ణయించిన టీపీసీసీ వ్యవహారం చూస్తే.. పని తక్కువ మాటలు ఎక్కువన్నట్లుగా ఉందనిపించక మానదు. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల మీద పోరాటం చేయటానికి ఇప్పటికి సిద్ధం కాని కాంగ్రెస్ నేతలు.. సమీక్షా సమావేశాల్లో జోరుగా కబుర్లు చెప్పటం కనిపిస్తుంది. అంశాల వారీగా తెలంగాణ అధికారపక్షాన్ని ఎలా ఎదుర్కోవాలన్న విషయం మీద దృష్టి పెట్టాల్సిన తెలంగాణ కాంగ్రెస్.. మూడేళ్ల ముందే ఎన్నికల మాటను తెర మీదకు తీసుకొచ్చి క్యాడర్ లో హుషారు తెచ్చే ప్రయత్నం ఫలించదని చెబుతున్నారు. మాటలు ఎక్కువ చెప్పే కన్నా.. చేతల్లో కాంగ్రెస్ నేతలు మరింత దూకుడు ప్రదర్శిస్తే బాగుంటుంది. అందుకు ఉత్తమ్ లాంటి నేతలు మాటలు చెప్పటం కాస్త తగ్గిస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.