Begin typing your search above and press return to search.

ఇటు ఉత్త‌మ్ అటు కేసీఆర్ రెడీ అయిపోతున్నారు

By:  Tupaki Desk   |   25 Feb 2018 4:39 AM GMT
ఇటు ఉత్త‌మ్ అటు కేసీఆర్ రెడీ అయిపోతున్నారు
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ యాత్ర‌ల పేరుతో జిల్లాల టూరుకు రెడీ అయ్యారు. ఈనెల 26న క‌రీంన‌గ‌ర్‌ లో - ఈ నెల 27న సింగరేణి యాత్రను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు చేపట్టనున్నారు. మార్చి 5న సీఎం కేసీఆర్ ధర్మపురి - ముధోల్ - నిర్మల్ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. అయితే ఈ టూర్ల వెనుక పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ బ‌స్సు యాత్ర ఉంద‌ని ప‌లువురు అంటున్నారు. ఈనెల 26 తేదీ నుంచి ఉత్త‌మ్ బ‌స్సుయాత్ర ప్రారంభం కానున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ రాష్ట్రవ్యాప్త టూరుకు సిద్ధ‌మ‌య్యార‌ని విశ్లేషిస్తున్నారు.

కేసీఆర్‌ సర్కారు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించేందుకే తాము ప్రజా చైతన్య బస్సుయాత్ర చేపడుతున్న‌ట్లు టీపీసీసీ ర‌థ‌సార‌థి ఉత్త‌మ్‌ కుమార్ రెడ్డి ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ నెల 26 నుంచి 'ప్రజా చైతన్య బస్సుయాత్ర' పేరుతో బస్సు యాత్రను నిర్వహిస్తున్నట్లు ప్ర‌క‌టించారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణ నేడు రెండు లక్షల కోట్ల అప్పులు ఊబిలో కూరుకుపోయి అప్పుల రాష్ట్రంగా మారిపోయిందని ఆయ‌న ఆరోపించారు. ఉద్యోగాల భ‌ర్తీ లేద‌ని - రైతులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నార‌ని - ప్ర‌జ‌లు ఆవేద‌న‌లో ఉన్నార‌ని పేర్కొంటూ వారికి భ‌రోసా ఇచ్చేందుకే తాను రాష్ట్ర వ్యాప్తంగా బ‌స్సుయాత్ర‌కు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమారరెడ్డి వెల్లడించారు. ఇందులో భాగంగానే 'ప్రజా చైతన్య బస్సుయాత్ర' విజయవంతం కావడానికి టీపీసీసీ నాలుగు కమిటీలను నియమించింది.

ఇదే స‌మ‌యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. జిల్లాల ప‌ర్య‌ట‌న‌కు రెడీ అయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈనెల 27న సింగరేణిలో పర్యటించనున్నారు. మంచిర్యాలలోని శ్రీరాంపూర్‌ గనుల ప్రాంతంలో ఆయన పర్యటిస్తారు. అదేరోజు మధ్యాహ్నం అక్కడి ప్రగతి మైదాన్‌ లో జరిగే సమావేశంలో ఆయన కార్మికులనుద్దేశించి ప్రసంగిస్తారు. సీఎం పర్యటన సందర్భంగా రామగుండం 1 - 2 - 3 గనులు - బెల్లంపల్లి - మందమర్రి - శ్రీరాంపూర్‌ గనుల్లో పనిచేసే కార్మికులకు ఈనెల 27న సెలవు ప్రకటించారు. యాత్రకు సంబంధించి శనివారం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. మార్చి 5న ధర్మపురి - ముథోల్‌ - నిర్మల్‌ నియోజకవర్గాల్లో ఆయన పర్యటిస్తారు. ఆ సందర్భంగా ధర్మపురి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం అక్కడి ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు. నియోజ కవర్గానికి సంబంధించిన సమస్యలపై చర్చిస్తారు. అనంతరం ముథోల్‌ నియోజకవర్గంలోని బాసర దేవాయంలో పూజలు నిర్వహించి.. అక్కడి ప్రజాప్రతినిధులతో భేటీ అవుతారు. సాయంత్రం నిర్మల్‌ లో జిల్లా అధికారుల కార్యాలయాలు - పోలీస్‌ కార్యాలయాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలోనూ ఆయన ప్రసంగిస్తారు.