Begin typing your search above and press return to search.

ఉత్త‌మ్ సాబ్‌...కామెంట్లు కాదు చాలెంజ్ చేయండి

By:  Tupaki Desk   |   4 Aug 2017 7:24 AM GMT
ఉత్త‌మ్ సాబ్‌...కామెంట్లు కాదు చాలెంజ్ చేయండి
X
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు, ఆయ‌న త‌న‌యుడు కేటీఆర్‌ ను ఇర‌కాటంలో పెట్టే క్ర‌మంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ పార్టీ స‌రైన వ్యూహంతో ముందుకు పోవ‌డం లేదా? విమ‌ర్శ‌ల విష‌యంలో దూకుడుగా ముందుకు సాగుతున్న కాంగ్రెస్ త‌ద్వారా ఎదుర‌య్యే చాలెంజ్‌ ను ఎదుర్కోవ‌డంలో మాత్రం వెన్నుచూపుతోందా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి స్పంద‌న తీరు ఇదే రీతిలో ఉందని అంటున్నారు. గాంధీభవన్‌ లో పార్టీ నేతలు మల్లుభట్టి విక్ర మార్క - పొన్నాల లక్ష్మయ్య - మల్లు రవి - దాసోజు శ్రవణ్‌ - నేరెళ్ల శారద - వినోద్‌ రెడ్డి తదితరులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీఆర్ ఎస్‌ - సీఎం కేసీఆర్‌ పై నిప్పులు చెరిగారు.

తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిరంతరం చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని ఉత్త‌మ్ కుమార్ రెడ్డి విమర్శించారు. పరిపాలన చేయడం చేతగాక - కాంగ్రెస్‌ పార్టీ - ఇతర పార్టీలు - మీడియాపై విమర్శలు చేస్తున్న పెద్ద అసమర్థుడు అని విమర్శించారు. సన్న - చిన్నకారు రైతులంతా తమ భూములకు సరైన న్యాయం జరగడం లేదని, న్యాయం కోసం కోర్టులను ఆశ్రయిస్తే...కాంగ్రెసోళ్లు కేసులు వేసి ఆపుతున్నారని సీఎం చెప్పడం సిగ్గు చేటన్నారు. పేదల భూములు బలవంతంగా లాక్కుంటుంటే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. పాలకులు న్యాయం చేయపోతే రాజ్యాంగం ప్రకారం కోర్టులకు వెళ్లే హక్కు ప్రతి ఒక్కరికి ఉందన్నారు. విలాసవంతమైన భవనాల్లో జీవించే హక్కు మీకుండగా... పేదలు కోర్టుకు పోయే హక్కు ఉండదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ హయాంలో మిగిలి పోయిన ఖాళీ పోస్టులను భర్తీ చేయకుండా నిరుద్యోగులను సీఎం మోసం చేస్తున్నారని విమర్శించారు. అందుకే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని చెప్పారు. మీడియా సమావేశంలో దుర్యోధనునిలా సీఎం ఏకాపాత్రాభినయం చేశారని విమర్శించారు. ఇటువంటి బెదిరింపులకు కాంగ్రెస్‌ భయపడబోదని హెచ్చరించారు. విద్యుత్‌ కాంట్రాక్టు ఉద్యోగుల విషయంలో కోర్టుల్లో కేసులు వేయడం తమకు సంబంధం లేదన్నారు. నిరుద్యోగి శ్రవన్‌ కేసు వేస్తే, టీఆర్‌ ఎస్‌ కి సంబంధం ఉన్న న్యాయవాది సత్యారెడ్డి వాదించారన్నారు. సింగరేణి వారసత్వ ఉద్యోగాల విషయంలో జాగృతి సంస్థకు సంబంధం ఉన్న వ్యక్తులు కేసు వేశారన్నారు.

తెలంగాణ మంత్రి, సీఎం కేసీఆర్ త‌న‌యుడు కేటీఆర్‌ కు సంబందించిన హిమాన్షు మోటర్స్ వ్య‌వ‌హారంలోనూ అబద్దాలు ప్రచారం చేస్తున్నార‌ని ఉత్త‌మ్ కుమార్ రెడ్డి మండిప‌డ్డారు. కంపెనీ లేద‌ని ఒకసారి, అందులో వ్యాపార క‌లాపాలు జ‌ర‌ప‌డం లేద‌ని మ‌రోసారి చెప్తున్నారని ఈవిష‌యంలో స్ప‌ష్ట‌త ఇవ్వాల‌న్నారు. కాగా, ఈ కంపెనీ విష‌యంలో, ఇసుక మాఫియా-ద‌ళితుల మ‌ర‌ణం దుమారంపై కేటీఆర్‌ రాజీనామా చేయాలని, ఉప ఎన్నికలకు సిద్ధమని కొంత మంది కాంగ్రెస్ నేత‌లు చేస్తున్న డిమాండ్‌కు పార్టీ కట్టుబడి ఉందా అని ప‌లువురు విలేక‌రులు అడిగిన‌ ప్రశ్నకు ఉత్తమ్‌ సమాధానం దాటవేశారు. త‌ద్వారా కాంగ్రెస్ పార్టీ విమ‌ర్శ‌ల‌కు సిద్ధ‌మే త‌ప్ప ఉప ఎన్నిక‌ల‌ స‌వాల్లు ఎదుర్కునేందుకు సై అనే విధంగా లేద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చ‌ర్చించుకుంటున్నారు. విమ‌ర్శ‌లు చేయ‌డంతో పాటుగా ప్రధాన ప్ర‌తిప‌క్షంగా స‌వాళ్లు ఎదుర్కునేందుకు సైతం రెడీగా ఉంటేనే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం స‌త్తా తెలుస్తుంద‌ని చెప్తున్నారు.