Begin typing your search above and press return to search.

అందరూ ఏకమై.. కేసీఆర్ ను ఏకిపారేశారు..

By:  Tupaki Desk   |   30 Sep 2018 7:16 AM GMT
అందరూ ఏకమై.. కేసీఆర్ ను ఏకిపారేశారు..
X
ముందస్తు ఎన్నికల వేళ వేడి రాజుకుంటోంది. మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా పీసీపీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నిప్పులు చెరిగారు. టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ను ఏకిపారేశాడు.. రంగారెడ్డి జిల్లా గౌరెల్లి సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ప్రైవేటు విద్యాసంస్థల ఐక్యకార్యాచరణ సమితి ఏర్పాటు చేసిన ఆత్మగౌరవ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై కేసీఆర్ తీరును తూర్పార పట్టారు..

ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ‘పరిపాలన చేతకాని కేసీఆర్.. తెలంగాణ ప్రజలు నమ్మి అధికారమిస్తే నాలుగున్నరేళ్లకే చేతులెత్తేసి నమ్మిన ప్రజలను నట్టేట ముంచాడు. ప్రజలను మరోసారి మోసం చేసేందుకు కంకణం కట్టుకున్నాడు. కానీ తెలంగాణ బిడ్డలు ఆయన మోసాన్ని నమ్మేస్థితిలో లేరు. కుటుంబమంతా రాష్ట్రం మీద పడి దోచుకుంటోంది. ప్రశ్నించిన గొంతులను అణిచివేస్తోంది. అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసిన కేసీఆర్ కుటుంబానికి ఓటేస్తే ఈసారి బతకడమే కష్టంగా మారుతుంది’ అంటూ నిప్పులు చెరిగారు.

విద్యావంతులు - అఖిల పక్ష పార్టీ నేతలు హాజరైన ఈ సభలో ఉత్తమ్ ప్రభుత్వ వైఫల్యాలను టార్గెట్ చేసి ఎండగట్టారు. అభివృద్ధిలో కీలకమైన విద్యావ్యవస్థను టీఆర్ ఎస్ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. ప్రభుత్వ వ్యవస్థను నాశనం చేసి ఇప్పుడు ప్రైవేటు విద్యాసంస్థలపై పడ్డారని మండిపడ్డారు. కార్పొరేట్ సంస్థలకు తొత్తుగా మారి చిన్నపాటి ప్రైవేటు సంస్థలను అణిచివేస్తున్నాడని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రైవేటు విద్యావ్యవస్థను గాడిలో పెడతామన్నారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేసతున్న బోధన - బోధనేతర సిబ్బందికి ఆరోగ్యకార్డులు - ఏటా రూ.5 లక్షలతో కూడిన ఆరోగ్య బీమా అందిస్తామన్నారు.

ఇక ఏఐసీసీ కార్యదర్శి మధుయాస్కీ కూడా కేసీఆర్ పాలనను తూర్పార పట్టాడు. రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబానికి ప్రజలు చరమగీతం పాడాలని.. కల్వకుంట్ల వారి కంపునుంచి ప్రజలను విముక్తి చేయాలని కోరారు. టీటీడీపీ ప్రెసిడెంట్ ఎల్. రమణ మాట్లాడుతూ టీఆర్ ఎస్ పాలనలో విద్యావ్యవస్థ నాశనమైందని.. దీన్ని తిరిగి పునర్నిర్మించాలని అన్నారు. సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ ఎస్ పాలన నిజాం నిరంకుశ పాలనను తలపిస్తోందని ధ్వజమెత్తారు.

ఇక టీజేఎస్ అధినేత కోదండరాం అయితే కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన వారంతా కేసీఆర్ కు ఇప్పుడు దోస్తులయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ నేత ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ తెలంగాణలో ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని టీఆర్ ఎస్ గాలికి వదిలేసిందని.. ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు విడుదల చేయాలని కోరినా స్పందించడం లేదని మండిపడ్డారు.