Begin typing your search above and press return to search.

ఉత్త‌మ్ మాట‌!...రేవంత్ కూడా ఓ నీటి బిందువే!

By:  Tupaki Desk   |   6 Nov 2017 12:19 PM GMT
ఉత్త‌మ్ మాట‌!...రేవంత్ కూడా ఓ నీటి బిందువే!
X
ప్రస్తుతం తెలంగాణ‌ణ రాజ‌కీయాల‌ను ప‌రిశీలించే ఏ ఒక్క‌రైనా... ఇటీవ‌లే గ్రాండ్ ఓల్డ్ పార్టీలో చేరిన యువ‌నేత రేవంత్ రెడ్డికి ఉజ్వ‌ల భ‌విష్య‌త్తు ఉంద‌ని, తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌స్తే గిస్తే... రేవంత్ రెడ్డే సీఎం అవుతార‌ని ఘంటాప‌థంగా చెప్పేస్తారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలంగాణ‌లో జ‌నాక‌ర్ష‌క నేత అంటూ ఎవ‌రూ లేరు. ఉన్నవాళ్లంతా కూడా త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలిస్తే చాలులే అనుకునే టైపు. వారి నియోజ‌కవ‌ర్గం దాటితే... ప‌ట్టుమ‌ని ప‌ది మంది కూడా ప‌లుక‌రించేంత స్థాయి లేని నేత‌లే. రేవంత్ రెడ్డి అలాంటి నేత కాదు. అసాధార‌ణ‌మైన జ‌నాక‌ర్ష‌ణ క‌లిగిన నేత కాకున్నా... జ‌నాన్ని బాగానే మొబిలైజ్ చేసే స‌త్తా ఉన్న నేత కింద లెక్కే. ఈ విశ్లేష‌ణ‌తోనే రేవంత్‌ కు కాంగ్రెస్ పార్టీలో ఉజ్వ‌ల భ‌విష్య‌త్తు ఉంద‌న్న మాట వినిపిస్తోంది. ఈ మాట‌ను ఇప్ప‌టిదాకా కాద‌న్న వారే లేరంటే అతిశ‌యోక్తి కాదు. రేవంత్ రెడ్డి ఎంట్రీపై కాస్తంత అసంతృప్తి వ్యక్తం చేసిన కాంగ్రెస్ నేత‌లు కూడా నోరు మెదిపేందుకు సాహ‌సించ‌క‌పోవ‌డాన్ని చూసినా ఈ మాట నిజ‌మేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఇక కాంగ్రెస్‌లోకి ఎంట్రీ సంద‌ర్భంగా ఆ పార్టీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ స్వ‌యంగా రేవంత్‌ కు రెడ్ కార్పెట్ ప‌రిచిన చందంగా వ్య‌వ‌హ‌రించారు. ఓ రాష్ట్రానికి చెందిన యువనేత ఎంట్రీకి రాహుల్ గాంధీ ఏమీ అవ‌స‌రం లేదు. స‌ద‌రు రాష్ట్ర పీసీసీ చీఫ్ స‌మ‌క్షంలో పార్టీలో చేర్చుకుంటారంతే. అయితే అందుకు భిన్నంగా రేవంత్ రెడ్డికి ల‌భించిన స్వాగతం చూస్తే... టీకాంగ్రెస్‌ కు భ‌విష్య‌త్ దిక్కు ఆయ‌నే అన్న రీతిలో కాంగ్రెస్ నేత‌లు వ్య‌వ‌హ‌రించిన‌ట్లుగా వార్త‌లు వినిపించాయి. అయితే ఇదంతా ఉట్టిదేన‌ని తేలిపోయింది. ఈ విష‌యాన్ని కాంగ్రెస్ పార్టీలోని రేవంత్ ను వ్య‌తిరేకిస్తున్న నేతలు చెబుతున్న మాట కాదు. ఇక రేవంత్ వ‌దిలి వ‌చ్చేసిన టీ టీడీపీ నేత‌లు చెబుతున్న వాద‌న అంత‌క‌న్నా కాదు. రేవంత్ రెడ్డి వెంట‌బెట్టుకుని మ‌రీ ఢిల్లీ తీసుకెళ్లడంతో పాటు పార్టీలో చేర‌క‌ముందే రేవంత్ రెడ్డి నిర్వ‌హించిన ఆత్మీయ స‌మావేశానికి అనుకోని అతిథిగా విచ్చేసి అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసిన టీ పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డే.

అయినా ఈ దిశ‌గా ఉత్త‌మ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లేమిట‌న‌న్న విష‌యానికి వ‌స్తే... రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ ఎదురేగి మ‌రీ స్వాగ‌తం ప‌లికారు క‌దా, ఒక విధంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి కోసం రాహుల్ గాంధీ దిగిరావాల్సి వ‌చ్చింది క‌దా? అన్న ప్ర‌శ్న‌కు స్పందించిన ఉత్త‌మ్‌... అలాంటిదేమీ లేద‌ని ఒక్క‌మాట‌తో తేల్చి పారేశారు. ఆ ఒక్క మాట‌తోనే స‌రిపెట్ట‌ని ఉత్త‌మ్‌... ఈ దిశ‌గా చాలా మాట‌లే చెప్పేశారు. *రేవంత్‌ రెడ్డి కోసం రాహుల్‌ గాంధీ దిగిరావడమేంటి.? కాంగ్రెస్‌ లో చేరాలని రేవంత్‌ రెడ్డి అనుకున్నారు.. ఆ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళాం. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా పనిచేసిన వ్యక్తి కావడంతో, ఢిల్లీ స్థాయిలో రాహుల్‌ గాంధీ సమక్షంలో పార్టీలో చేరితే ఆయనకీ గౌరవం వుంటుందనుకున్నాం. ఆ ప్రకారమే జరిగిందంతా* అని కూడా ఉత్త‌మ్ కుండ‌బ‌ద్దలు కొట్టేశారు.

ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో స‌ద‌రు ఛానెల్ ప్ర‌తినిధి సంధించిన ప్ర‌శ్న‌ల‌కు ఉత్త‌మ్ ఈ మాట‌ల‌ను చెప్పార‌ట‌. ఇక‌పోతే.. కాంగ్రెస్ పార్టీలో రేవంత్‌కు పెద్ద పోస్టు ద‌క్క‌బోతోంద‌న్న వార్త‌ల‌పైనా ఉత్త‌మ్ ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్లు చేశారు. *కాంగ్రెస్‌ ఓ మహా సముద్రం.. అందులో రేవంత్‌ రెడ్డి కూడా ఓ నీటి బిందువు* అని వ్యాఖ్యానించిన ఉత్త‌మ్‌... రేవంత్ రెడ్డి ప‌ద‌వుల కోసం చాలా కాలం పాటు వేచి చూడ‌క త‌ప్ప‌ద‌న్న భావ‌న వినిపించేలా... నిజంగానే రేవంత్ కు ఫ్యూజులు ప‌గిలిపోయేలా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఉత్త‌మ్ నోట నుంచి వెలువ‌డ్డ ఈ మాట‌లు రేవంత్ చెవిన ప‌డ్డాయో?, లేదో? గానీ.. వింటే మాత్రం ఎలా స్పందిస్తారో చూడాలి. అయినా ఇప్పుడిప్పుడే పార్టీలోకి చేరిన రేవంత్ ఈ మాట‌లు విన్నా పెద్ద‌గా స్పందించేదేమీ లేద‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది.