Begin typing your search above and press return to search.

అధికారులపై రైతు వినూత్న నిరసన వైరల్‌!

By:  Tupaki Desk   |   27 Nov 2022 11:30 AM GMT
అధికారులపై రైతు వినూత్న నిరసన వైరల్‌!
X
ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి అధికారులపై రకరకాల పద్ధతుల్లో నిరసన వ్యక్తం చేస్తుంటారు. ఎన్నిసార్లు సమస్య పరిష్కరించాలని అర్జీలు ఇచ్చినా, వినతి పత్రాలు ఇచ్చినా కొంతమంది అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంటారు. మరికొంతమంది అధికారులు రేపు రా, మాపు రా అని తిప్పుకుంటుంటారు. ఇలా ఏళ్ల తరబడి ఫిర్యాదులు చేస్తూ ఉన్న కొంతమంది అధికారులు పట్టించుకోరు.

ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో మథురకు చెందిన ఓ రైతు వినూత్న నిరసనకు దిగాడు. మథురకు చెందిన ఒక రైతు భూ సంబంధిత వివాదాలపై ఆరేళ్ల నుంచి అధికారులకు ఫిర్యాదు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఎన్నో వినతిపత్రాలు ఇచ్చాడు. ఇలా ఎన్నిసార్లు చేసినా అధికారులు అతడి సమస్యను పరిష్కరించలేదు. దీంతో విరక్తి చెందిన బాధిత రైతు వినూత్న నిరసనకు దిగాడు. 12 కిలోల ఫిర్యాదు పత్రాలను తలపై మోసుకుని సంబంధిత అధికారుల దగ్గరకు వెళ్లి వినూత్నంగా నిరసన తెలిపాడు. ఇప్పడీ ఈ ఘటన వైరల్‌గా మారింది.

«వివరాల్లోకెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని మథుర సమీపంలోని దాకుబిబావాలి గ్రామానికి చెందిన తన భూమిని గ్రామ పెద్దలు, కార్యదర్శి స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారని చరణ్‌ సింగ్‌ ఆరోపిస్తున్నాడు. దీంతో అతడు ఆరేళ్ల క్రితం మొదటిసారిగా అధికారులకు వారిపై ఫిర్యాదు చేశాడు.

అప్పటినుంచి ఇప్పటివరకు 211 సార్లు తన సమస్యపై అధికారులకు ఫిర్యాదు పత్రాలు అందించాడు. అయినా ఇంతవరకు ఫలితం శూన్యం. దీంతో ఆ ఫిర్యాదుల పత్రాలు మొత్తం 12 కిలోలను మూటలా కట్టగట్టి నిరసనకు దిగాడు.

రైతు ఫిర్యాదుపై ఎస్‌డీఎం మంత్ర ఇంద్రనందన్‌ సింగ్‌ స్పందించారు. ఫిర్యాదు చేసిన వ్యక్తే గ్రామ సభ భూమిని ఆక్రమించాడు. అతడిపై చర్యలు కూడా తీసుకున్నాం అని పేర్కొనడం విశేషం.

ఇటీవల కోల్‌కతాలో ఒక వ్యక్తి కూడా ఇలాంటి నిరసనకే దిగాడు. తన రేషన్‌ కార్డులో తన పేరును తప్పుగా పేర్కొన్నారని.. దీనిపై వినతి పత్రం ఇస్తే మళ్లీ తప్పుగా రాశారని.. ఇలా ఇప్పటివరకు మూడుసార్లు పేర్లు తప్పుగా రాశారని ఆరోపించిన సంగతి తెలిసిందే.

దీంతో అతడు గ్రీవెన్స్‌ ఫిర్యాదులకు తమ గ్రామానికి వచ్చిన కలెక్టర్‌ ఎదుట వినూత్నంగా నిరసన వ్యక్తం చేశాడు. తన పేరును కుత్తా (అంటే హిందీలో కుక్క) గా రాశారని కుక్కలా అరుస్తూ కలెక్టర్‌ ఎదుట నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.