Begin typing your search above and press return to search.

యూపీ : ఆట మొదలవుతుంది జాగ్రత్తరోయ్! అదిగో ఫిబ్రవరి 10

By:  Tupaki Desk   |   10 Feb 2022 2:30 AM GMT
యూపీ : ఆట మొదలవుతుంది జాగ్రత్తరోయ్! అదిగో ఫిబ్రవరి 10
X
వార‌సుల పోరులో మ‌ళ్లీ గెలుపు ఎవ‌రిది అన్న‌ది ప్ర‌ధాన వాద‌న‌గా ఉంది. దేశ రాజ‌కీయాల‌కు న‌మూనాగా నిలిచే ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో రేప‌టి వేళ మరో ప్ర‌జాస్వామ్య ఘ‌ట్టం ఆవిష్కృతం కానుంది. ఇందుకు త‌గ్గవిధంగా యంత్రాంగం కూడా స‌న్నాహాలు పూర్తిచేసింది.
మొత్తం 403 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎన్నిక‌ల‌కు ఏడు ఘ‌ట్టాలు ప్ర‌ధాన భూమిక పోషించ‌నున్నాయి.ఆ వివ‌రం ఈ క‌థ‌నంలో...

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల జాత‌ర రేప‌టి నుంచి ప్రారంభం కానుంది.మొద‌టి విడ‌త పోలింగ్ కు స‌ర్వం సిద్ధం అయింది.మొత్తం ఏడు ద‌శ‌ల్లో అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌క్రియ జ‌ర‌గ‌నుంది.ఫిబ్ర‌వ‌రి 10,14,20,23,27,మార్చి 3,7 తేదీల‌లో పోలింగ్ కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ సారి పోరు బ‌లీయంగా రెండు వ‌ర్గాల మ‌ధ్యే జ‌ర‌గ‌నుంది.బీజేపీ మ‌రియు ఎస్పీ మ‌ధ్యే ప్ర‌ధాన‌మ‌యిన పోరు నెల‌కొని ఉంది.బీజేపీకి ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థి యోగి ఆదిత్యానాథ్ ఉన్నారు.ముఖ్య‌మంత్రిగా మ‌రోసారి ప‌ద‌వి అందుకోవాల‌న్న ఆత్రంతో ఉన్నారు.ఎప్ప‌టిలానే హిందుత్వ రాజ‌కీయాల‌ను న‌మ్ముకుని ఉన్నారు.

ఇదే స‌మ‌యాన ఎస్పీకి అఖిలేశ్ యాద‌వ్ పూర్తిగా నాయ‌క‌త్వ బాధ్య‌త‌లు స్వీక‌రించి,తండ్రి ములాయాంను మించి త‌న‌దైన శైలిలో దూసుకుపోతున్నారు.కొంత ఇంటిపోరు కూడా వెన్నాడుతూనే ఉంది. వీరితో పాటు కాంగ్రెస్ కూడా త‌న‌దైన స‌త్తా చాటేందుకు ప్ర‌య‌త్నిస్తోంది.ప్రియాంక‌ గాంధీ నాయ‌క‌త్వాన పోరాడుతోంది.ఇన్ని శ‌క్తులు ఉన్నా కూడా కొన్ని చిన్న‌, చిన్న ప్రాంతీయ పార్టీలు కూడా తమ ఉనికి నిలుపుకునేందుకు తాప‌త్ర‌య‌ప‌డుతున్నాయి.

ఈ సారి ఎన్నిక‌ల్లో బీఎస్పీ లీడ‌ర్ మాయావ‌తి సైలెంట్ అయిపోయారు.ఆమెను అధికంగా ప్ర‌భావితం చేసిన‌, ఆమెకు వెన్నుద‌న్నుగా నిలిచిన ద‌ళిత ఓటు బ్యాంకు ఎటు వెళ్తుందా అన్న ఆస‌క్తే అంద‌రిలోనూ నెల‌కొంది.ఒక‌ప్పుడు ద‌ళితులు కొంత‌కాలం కాంగ్రెస్ కి, ఇంకొంత కాలం బీఎస్పీకి అండ‌గా ఉన్నారు.కానీ కాల గ‌తిలో కాంగ్రెస్ త‌న ప‌రువు పోగొట్టుకోవ‌డంతో ప్ర‌త్యామ్నాయ శ‌క్తిగా మాయావ‌తి ఎదిగారు.ఇప్పుడు ఆమె స్థానంలో ద‌ళిత ఓట్ల‌ను త‌మ‌కు అనుగుణంగా పంచుకునేందుకు అటు బీజేపీ కానీ ఇటు ఎస్పీ కానీ తెగ ప్ర‌య‌త్నిస్తున్నాయి. వీరితో పాటు బ్రాహ్మ‌ణ ఓట్లు కూడా ఇక్క‌డ కీల‌క‌మే!

ఓట్లు,సీట్లు రాజ‌కీయాల్లో భాగంగా ద‌ళితుల‌కు బీజేపీ బాగానే ప్రాధాన్యం ఇచ్చింద‌ని తెలుస్తోంది.107మందితో కూడిన తొలి జాబితా విడుద‌ల చేసిన సంద‌ర్భంలో 19 మందికి ఇచ్చార‌ని,ఇందులో మాయావ‌తి (జాత‌వ్ సామాజిక వ‌ర్గం) కులంకు చెందిన వారికే 13 సీట్లు ఇచ్చార‌ని తెలుస్తోంది. బీజేపీ వాదం ప్ర‌కారం చూసుకుంటే ద‌ళితుల కోసం సంక్షేమ ప‌థ‌కాలు విస్తృతంగా అమలు చేసి త‌ద్వారా ఓటు బ్యాంకు రాబ‌ట్టుకోవాల‌ని చూస్తున్నారు.

అఖిలేశ్ మాత్రం త‌న‌దైన పంథాలో రాజ‌కీయం చేస్తూ ఓబీసీల‌ను, యాదవుల‌ను క‌లిపే ప్ర‌య‌త్నం ఒక‌టి చేస్తున్నారు అని వార్త‌లు వ‌స్తున్నాయి.కొత్త‌త‌రం రాజ‌కీయంలో అఖిలేశ్ రాణిస్తార‌ని, ఆయ‌న తాను అనుకున్న‌ది సాధిస్తార‌ని స‌మాజ్ వాదీ పార్టీ భావిస్తోంది.ముఖ్యంగా ఏ పార్టీకి అయినా కావాల్సింది రాష్ట్ర జ‌నాభాలో 21శాతం ఉన్న ద‌ళితులే! అందుకే వారిని ఆకట్టుకునే ప‌నిలోనే రెండు పార్టీలూ ఉన్నాయ‌న్న‌ది వాస్త‌వం.