Begin typing your search above and press return to search.

భారమంతా శ్రీ రాముడి మీదేనా ?

By:  Tupaki Desk   |   27 Feb 2022 10:34 AM GMT
భారమంతా శ్రీ రాముడి మీదేనా ?
X
ఉత్తరప్రదేశ్ లో ఆదివారం జరగనున్న ఐదవ విడత పోలింగ్ మొత్తం బాధ్యతంతా బీజేపీ రాముడిమీదే వేసేసినట్లుంది. ఎందుకంటే ఈరోజు జరగబోయే పోలింగ్ లో అయోధ్య రామమందిరం నిర్మాణమవుతున్న అయోధ్య జిల్లా కూడా ఉంది. ఎన్నికలు మొదలు కాకముందు యోగి ఆదిత్యనాద్ ప్రభుత్వం అభివృద్ధి మంత్రాన్నే ఎక్కువగా జపించింది. అయితే మొదటి మూడు విడతల పోలింగ్ లో బీజేపీకి పెద్ద సానుకూలంగా లేదని విశ్లేషణలు బయటకు వచ్చాయి.

దాంతో నాలుగో విడతలో బీజేపీ రూటు మార్చేసింది. అభివృద్ధిని పక్కనపెట్టేసి మతాన్నే ప్రధాన అస్త్రంగా మలచుకుంది. హిందుత్వ అజెండాపైనే ఎక్కువ దృష్టిపెట్టింది. అదే సమయంలో కర్నాటకలో మొదలైన హిజాబ్ వివాదాన్ని బీజేపీ బాగా అడ్వాంటేజ్ తీసుకోవాలని ప్రయత్నించింది. మరి నాలుగో విడత పోలింగ్ ఎవరికి అనుకూలమనే విషయంలో క్లారిటి రాలేదు. అందుకనే ఐదువ విడతలో పూర్తిగా రామమందిరం, హిందుత్వ కార్డులనే వాడుతోంది.

రెండోసారి గెలిచి బీజేపీ అధికారంలోకి రావాలంటే శ్రీరామచంద్రుడే కాపాడాలనే స్ధాయిలో కమలనాదులు ప్రచారం చేస్తున్నారు. టికెట్ల కేటాయింపు, ప్రచారంలో కూడా హిందువులు నాన్ హిందువులు అన్నట్లుగానే బీజేపీ నేతలు చొచ్చుకుపోయారు. వీళ్ళ సరళిని బట్టి ఆరు, ఏడు విడతల ప్రచారం, పోలింగ్ అంతా హిందుత్వ కార్డునే ఉపయోగించేట్లు అర్ధమైపోతోంది. ముస్లిం ఓటర్లు దాదాపు ఏకపక్షంగా ఎస్పీకి మద్దతుగా నిలుస్తున్నారనే ప్రచారం పెరిగిపోతోంది.

ముస్లిం ఓట్లను చీల్చేందుకు ఎంఐఎం, బీఎస్పీలు చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదని సమాచారం. బీఎస్పీకి ఓట్లేస్తే బీజేపీకి వేసినట్లే అనే బలమైన ప్రచారం జరిగింది. అలాగే ఎస్పీకి పడే ముస్లిం ఓట్లను చీల్చేందుకే ఎంఐఎం పార్టీ అభ్యర్ధులను పెట్టిందనే ప్రచారం కూడా జరిగుతోంది. దీంతో చాలా నియోజకవర్గాల్లో ముస్లిం ఓట్లు ఎస్సీకి అనుకూలంగా పడ్డాయన్నది అంచనా. ఈ కారణంగానే కారు యాక్సిటరేటర్ తొక్కినట్లు బీజేపీ శ్రీరామచంద్రుడినే గట్టిగా నమ్ముకున్నట్లు తెలుస్తోంది. మరి 61 సీట్లలో ఎవరికి మెజారిటి వస్తుందో చూడాల్సిందే.