Begin typing your search above and press return to search.

2024 ఎన్నిక‌ల్లో మోదీని ముంచే రాష్ట్రం ఇదేనా?

By:  Tupaki Desk   |   20 May 2021 9:30 AM GMT
2024 ఎన్నిక‌ల్లో మోదీని ముంచే రాష్ట్రం ఇదేనా?
X
భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన కీల‌క నేత‌ న‌రేంద్ర మోదీ వ‌రుస‌గా రెండు ప‌ర్యాయాలు దేశ ప్ర‌ధానమంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. 2014 ఎన్నికల్లో త‌న‌దైన శైలి ప్ర‌చారంతో రంగంలోకి దిగిన మోదీ... బీజేపీని బ్ర‌హ్మాండమైన మెజారిటీతో గెలిపించారు. ఆ త‌ర్వాత 2019 ఎన్నిక‌ల్లోనూ బీజేపీకి ఎదుర‌న్న‌దే లేద‌న్న‌ట్లుగా పార్టీ ప్ర‌స్థానం సాగేలా ప్ర‌ణాళిక‌లు ర‌చించారు. ఇక్క‌డి దాకా బాగానే ఉన్నా... అప్పుడే 2024లో జ‌రిగే సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు సంబంధించిన ఈక్వేష‌న్ల‌పై అప్పుడే విశ్లేష‌ణ‌లు మొద‌ల‌య్యాయి. అస‌లు 2024 ఎన్నిక‌ల్లో మోదీ మ‌రోమారు విజ‌యం సాధిస్తారా? అన్న దిశ‌గానూ ఆస‌క్తిక‌ర వాద‌న‌లు మొద‌ల‌య్యాయి. విజ‌యం మాట దేవుడెరుగు... బీజేపీకి మంచి ప‌ట్టున్న రాష్ట్రంగా పేరున్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్... మోదీని నిండా ముంచేసే ప్ర‌మాదం లేక‌పోలేద‌న్న వాద‌న‌లూ ఆస‌క్తి రేకెత్తిస్తున్నాయి.

క‌రోనా తొలి ద‌శ సంద‌ర్భంగా దానిని క‌ట్ట‌డి చేయ‌డం కోసం ప్ర‌ధాని హోదాలో మోదీ తీసుకున్న నిర్ణ‌యాల‌కు దేశ‌వ్యాప్తంగా పెద్ద ఎత్తున మ‌ద్ద‌తు ల‌భించింది. అయితే సెకండ్ వేవ్ ను క‌ట్ట‌డి చేయ‌డంలో మోదీ ఘోరంగా విఫ‌ల‌మ‌య్యార‌న్న వాద‌న‌లు ఇప్పుడు పెను క‌ల‌క‌ల‌మే రేపుతున్నాయి. సెకండ్ వేవ్ దేశంలో ఏ రీతిన భ‌యోత్పాతం సృష్టిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. మోదీ స‌ర్కారు అంత‌గా అల‌ర్ట్ గా లేని నేప‌థ్యమే దేశంలో క‌రోనా విల‌య తాండ‌వానికి కార‌ణ‌మ‌న్న వాద‌న‌లూ వినిపిస్తున్నాయి. ఇలాంటి త‌రుణంలో అప్ప‌టిదాకా అప్ర‌హ‌తిహాతంగా పెరుగుతూ వ‌చ్చిన మోదీ గ్రాఫ్ ఒక్క‌సారిగా దిగ‌జారడం మొద‌లైపోయింది. దేశీయ మీడియాతో పాటు అంత‌ర్జాతీయ మీడియాలోనూ మోదీ గ్రాఫ్ త‌గ్గిపోతున్న వైనంపై లెక్క‌లేన‌న్ని క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ఈ త‌ర‌హా ప‌రిస్థితిపై నెటిజ‌న్లు కూడా త‌మ‌దైన రీతిలో సెటైర్లు సంధిస్తున్నారు.

ఇక అస‌లు విషయానికి వ‌స్తే... 2024 ఎన్నిక‌ల్లో మోదీ మునిగితే.. అందుకు ప్ర‌ధాన కార‌ణంఆ యూపీనే నిలుస్తుంద‌ని కూడా రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. అదెలాగ‌న్న విష‌యాన్ని కూడా లెక్క‌లు వేసి మ‌రీ చెబుతున్నారు. యూపీ అంటే ఉత్త‌రాదిలోనే కాకుండా దేశంలోనే పెద్ద రాష్ట్రం. అత్య‌ధిక లోక్ స‌భ స్థానాలున్న రాష్ట్రం కూడా. ఈ రాష్ట్రం బీజేపీకి పెట్ట‌ని కోట కిందే లెక్క‌. కులాల ప్రాతిప‌దిక‌న ఓటింగ్ జ‌రిగే ఈ రాష్ట్రంపై బీజేపీ ఎప్ప‌టినుంచో ప‌ట్టు సాధించేసింది. ప్ర‌స్తుతం ఆ పార్టీనే యూపీలో అధికారంలో ఉంది. మోదీకి అత్యంత ఇష్టుడైన యోగి ఆదిత్య‌నాథ్ ఆ రాష్ట్రానికి సీఎంగా ఉన్నారు. దేశంలో క‌రోనా ప‌రిస్థితి ఎలా ఉందో... అంతుకు కొన్ని రెట్లు యూపీలో ఉన్న‌ట్లుగా గ‌ణాంకాలు చెబుతున్నాయి. క‌రోనా వ‌ల్ల కొన‌సాగుతున్న మ‌ర‌ణాల్లో యూపీలోనే అత్య‌ధికంగా ఉన్న‌ట్లుగా కూడా క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి. ప్ర‌తి 5 కుటుంబాల్లో ఓ కుటుంబంలో క‌నీసం ఒక్క మృతి అయినా న‌మోదు అవుతున్న ప‌రిస్థితి. ఇలాంటి ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దే విష‌యంలో యోగి ఘోరంగా విఫ‌ల‌మ‌య్యార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఈ ప్ర‌భావం సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీపై ప‌డ‌టం కూడా ఖాయ‌మే. మొత్తంగా 2024 ఎన్నిక‌ల్లో మోదీ నేతృత్వంలోని బీజేపీ మునిగితే... అందులో యూపీ పాత్రే కీల‌క‌మ‌న్న వాద‌న‌లు ఆస‌క్తి రేకెత్తిస్తున్నాయి.