Begin typing your search above and press return to search.

బీజేపీ ముణగటం ఖాయమేనా ?

By:  Tupaki Desk   |   3 Jun 2021 4:30 AM GMT
బీజేపీ ముణగటం ఖాయమేనా ?
X
దేశం మొత్తంమీద బీజేపీకి అత్యంత కీలకమైన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. కేంద్రంలో కమలంపార్టీ అధికారంలో ఉండాలంటే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించటం ఎంతవసరమో బీజేపీకి తెలిసినంతంగా మరొకరికి తెలీదు. అలాంటి రాష్ట్రంలో కమలంపార్టీ ఇపుడు గడ్డు పరిస్దితులను ఎదుర్కొంటోంది. వచ్చే ఏడాదిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు కమలంపార్టీపై జనాల్లో బాగా వ్యతిరేకత పెరిగిపోతుండటంతో కేంద్రానికి సెగ బాగా తగులుతోంది.

యోగి ఆదిత్యనాద్ సీఎం అయినదగ్గర నుండి రాష్ట్రంలో వివాదాలు రేగుతునే ఉన్నాయి. శాంతి, భద్రతల సమస్య బాగా దిగజారిపోయింది. ఇదే సమయంలో లవ్ జీహాద్ బాగా పెరిగిపోతోంది. ముఠాకక్షలు పెరిగిపోయాయి. ప్రభుత్వంపై యోగికి పట్టు దాదాపు జారిపోయింది. ఇలాంటి సమయంలోనే కరోనా వైరస్ సమస్య మొదలైంది. మొదటి వేవ్ ను ఏదోలా నెట్టుకొచ్చేసినా సెకెండ్ వేవ్ ముందు యోగి పప్పులుడడకలేదు.

సెకెండ్ వేవ్ నియంత్రణలో ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. ఎక్కడచూసినా వేలసంఖ్యలో రోగులు, డెత్ కేసులు. ఇక కరోనా వైరస్ తో చనిపోయిన వారిని సరయు, గంగానదుల్లో విసిరేస్తున్నారు. నదీతీరాల్లో వందలాది మృతదేహాలు బయటపడుతున్నాయి. దాంతో జనాల్లో భయాందోళనలు పెరిగిపోతున్నాయి. జనాల్లో టెన్షన్ తగ్గటానికి ప్రభుత్వపరంగా చేస్తున్న ప్రయత్నాలేంటో అర్ధం కావటంలేదు.

ఆక్సిజన్ ఉత్పత్తి, సరఫరా సక్రమంగా లేదు. రోగులకు అవసరమైన మందులు సరిగా దొరకటంలేదు. బెడ్లు దొరక్క రోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అవసరమైనవారికి సరైన వైద్యం అందక రోగులు, వారి కుటుంబసభ్యులు అల్లాడిపోతున్నారు. క్షేత్రస్ధాయిలో పరిస్ధితులను గమనించిన తర్వాత హైకోర్టు ఉత్తరప్రదేశ్ ను దేవుడే రక్షించాలని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

ఇలాంటి పరిస్ధితుల్లో వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికల్లో తిరిగి అధికారం అందుకోవటం సాధ్యమేనా అని బీజేపీ అగ్రనేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఈమధ్యనే జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోవటంతో సీనియర్ నేతలు తలలు పట్టుకున్నారు. యోగి ప్రభుత్వంపై జనాల్లో పెరిగిపోయిన వ్యతిరేకతకు ఈ ఫలితాలు నిదర్శనంగా మారాయి. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా కేంద్రప్రభుత్వం కూడా చోద్యం చూడటం మినహా ఏమీ చేయలేకపోయింది. మొత్తంమీద వచ్చే ఎన్నికల్లో బీజేపీ పుట్టి ముణగటం ఖాయమనే అనుమానంగా ఉంది. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.