Begin typing your search above and press return to search.

అవతరణ దినోత్సవం లేని ఆంధ్రలో ఉత్తరప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవం

By:  Tupaki Desk   |   21 Jan 2023 7:49 AM GMT
అవతరణ దినోత్సవం లేని ఆంధ్రలో ఉత్తరప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవం
X
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవంపై విపరీతమైన గందరగోళం.. జగన్ సీఎం అయిన తరువాత నవంబర్ 1న ఏపీ అవతరణ దినోత్సవం నిర్వహిస్తున్నప్పటికీ దానిపై ఎందరికో అభ్యంతరాలున్నాయి. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ నవంబర్ 1న ఏర్పడలేదు కాబట్టి ఆ తేదీన ఎలా నిర్వహిస్తారన్న ప్రశ్న వస్తోంది. ఆ కారణంగానే జగన్ కంటే ముందు సీఎంగా ఉన్న చంద్రబాబు 2014 తరువాత ఏపీ అవతరణ దినోత్సవం నిర్వహించలేదు. 2014 జూన్‌లో జరిగిన రాష్ట్ర విభజన అన్యాయమని.. కాబట్టి ఆ తేదీన నిర్వహించేదీ లేదని చంద్రబాబు అప్పట్లోనే చెప్పారు. అలా అని నవంబర్ 1న నిర్వహించాలంటే అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తేదీ అని.

అందులో తెలంగాణ కూడా ఉంటేనే ఆ తేదీ వర్తిస్తుందనేది ఒక వాదన. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ 1953 అక్టోబరు 1న ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి సామీప్యం ఉన్న రాష్ట్రం కాబట్టి ఆ తేదీని తీసుకోవాలన్నది మరికొందరి వాదన. ఇలా... ఏపీ అవతరణ దినోత్సవంపై లెక్కలేనంత గందరగోళం. కానీ, ఈ గందరగోళాన్ని పక్కనపెట్టి ప్రస్తుత ఏపీ సీఎం జగన్ మాత్రం నవంబర్ 1నే అవతరణ దినోత్సవం జరుపుతున్నారు.

ఇంత గందరగోళం ఉన్న ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడో దూరంగా ఉన్న ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలు జరపడానికి బీజేపీ నేతలు సిద్ధం కావడం ఇప్పుడు చర్చనీయమవుతోంది. అవును.. ఏపీలోని విశాఖపట్నంలో ఉత్తరప్రదేశ్ ఆవిర్భావ ఉత్సవాలు జరపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు.

జీవీఎల్ నరసింహారావు ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తెలుగువారే అయినప్పటికీ తెలుగురాష్ట్రాలలో బీజేపీకి బలం లేకపోవడంతో ఆయన్ను యూపీ నుంచి రాజ్యసభకు పంపించింది బీజేపీ. ఉత్తరప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని జనవరి 22న సాయంత్రం 4 గంటలకు విశాఖలోని జీవీఎంసీ మైదానంలో నిర్వహిస్తున్నారు. దీనికి విశాఖలోని యూపీ, బిహార్ ప్రజలు హాజరవుతారంటూ అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు జీవీఎల్.
ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్ నినాదంలో భాగంగా ఈ కార్యక్రమం చేస్తున్నట్లు జీవీఎల్ చెప్తున్నారు. అంతేకాదు..

దీనికి ఢిల్లీలోని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ కూడా హాజరవుతున్నారు. లోకల్ బీజేపీ నాయకులూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.మొత్తానికి అవతరణ దినోత్సవం ఏదో నిర్ణయించుకోలేని స్థితిలోఉన్న ఏపీలో వేరే రాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్వహించడంపై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.