Begin typing your search above and press return to search.

సాయం కోసం టీచ‌ర‌మ్మ వ‌స్తే..అరెస్ట్ చేయ‌మ‌న్న సీఎం

By:  Tupaki Desk   |   30 Jun 2018 7:10 AM GMT
సాయం కోసం టీచ‌ర‌మ్మ వ‌స్తే..అరెస్ట్ చేయ‌మ‌న్న సీఎం
X
అధికారంలోకి వ‌చ్చినంత‌నే అదేదో అద్భుతం త‌మ‌ను ఆవ‌హించిన‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తూ.. భ‌విష్య‌త్తును చెడ‌గొట్టుకునే నేత‌ల‌కు కొద‌వ ఉండ‌దు. చేతిలో ఉన్న అధికారం ప‌ట్ల ఎంత విధేయ‌త‌తో వ్య‌వ‌హ‌రిస్తే.. ప్ర‌జ‌ల్లో అంత మంచిపేరు తెచ్చుకునే వీలుంది. త‌ల‌కు ప‌వ‌ర్ ఎక్కేస్తే..ఉత్త‌రాఖండ్ సీఎంకు ఎదురైన ప‌రిస్థితే ఎదుర‌వుతోంది. త‌న‌కు సాయం చేయాల‌ని.. త‌న‌కు జ‌రుగుతున్న అన్యాయానికి న్యాయం చేయాల‌న్న ఒక టీచ‌ర‌మ్మ‌ను అరెస్ట్ చేయించిన ముఖ్య‌మంత్రి త్రివేంద్ర‌రావ‌త్ తీరు ఇప్పుడు వివాదాస్ప‌దంగా మారుతోంది.

ప‌లువురు త‌ప్పు ప‌డుతున్న ఈ ఉదంతంలోకి వెళితే.. ఉత్త‌ర కాశీలో పాతికేళ్లుగా టీచ‌రుగా ప‌ని చేస్తున్న 57 ఏళ్ల ఉత్త‌ర బ‌హుగుణ ప్ర‌స్తుతం తానున్న చోటు నుంచి డెహ్రాడూన్ కు బ‌దిలీ చేయాల‌ని కోరుతున్నారు. దీనికి కార‌ణం లేక‌పోలేదు. 2015లో ఆమె భ‌ర్త చ‌నిపోయారు. దీంతో.. పిల్ల‌ల‌కు ద‌గ్గ‌ర‌గా ఉండేందుకు త‌న‌ను బ‌దిలీ చేయాల‌ని ఆమె అధికారుల్ని ప‌దే ప‌దే కోరుతున్నారు. కానీ.. అధికారులు మాత్రం ఆమె విన‌తిని పెద్ద‌గా ప‌ట్టించుకున్న‌ది లేదు. అంతేనా.. ఆమె కోరిన‌ట్లు బ‌దిలీ చేయ‌టానికి చాలా టైం ప‌డుతుంద‌ని చెబుతున్నారు.

దీంతో.. విసిగిన ఆమె త‌న గోడును చెప్పుకోవ‌టానికి ఉత్త‌రాఖండ్ సీఎం నిర్వ‌హించే ద‌ర్బారుకు హాజ‌ర‌య్యారు. త‌న బాధ‌ను చెప్పుకున్నారు. త‌న వేద‌న‌ను చెప్పుకుంటున్న మ‌హిళపై సీఎం ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆమెపై నోరు పారేసుకున్నారు. దీంతో.. బ‌రస్ట్ అయిన టీచ‌ర‌మ్మ సీఎంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆరిచారు. దీంతో.. ఆమెను అరెస్ట్ చేయాల‌న్న ఆదేశంతో పాటు.. ఆమెను స‌స్పెండ్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు.

ఈ వ్య‌వ‌హారం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. ముఖ్య‌మంత్రి విధుల‌కు అంత‌రాయం క‌లిగించార‌న్న ఆరోప‌ణ మీద ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు త‌ర్వాత బెయిల్ మీద విడుద‌ల చేశారు. ఈ వ్య‌వ‌హారం మీడియాకు ఎక్కింది. ఇదే స‌మ‌యంలో సీఎం స‌తీమ‌ణికి సంబంధించి ఆస‌క్త‌క‌ర విష‌యం ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ముఖ్య‌మంత్రి త్రివేంద్ర రావ‌త్ భార్య సునీత ప్రైమ‌రీ స్కూల్ టీచ‌ర్ గా ప‌ని చేస్తున్నార‌ని.. 1992లో ఆమె పౌదీ గ‌ద్వాల్ లో బాధ్య‌త‌లు చేప‌ట్ట‌గా.. నాలుగేళ్లకే ఆమెను డెహ్రాడూన్ కు బ‌దిలీ చేశార‌ని.. ఆపై 22 ఏళ్లుగా అక్క‌డే విధులు నిర్వ‌ర్తించిన వైనం వెలుగు చూసింది. దీంతో.. సీఎం స‌తీమ‌ణి విష‌యంలో ఒక‌లా.. సాదాసీదా టీచ‌ర‌మ్మ విష‌యంలో మ‌రోలా వ్య‌వ‌హ‌రిస్తారా? అంటూ ప‌లువురు మండిప‌డుతున్నారు. ఒక సామాన్యురాలి మీద సీఎం కేసు పెట్టించిన తీరును ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు.