Begin typing your search above and press return to search.

అక్కడి జంపింగ్ ఎమ్మెల్యేలకు హైకోర్టు షాక్

By:  Tupaki Desk   |   9 May 2016 7:45 AM GMT
అక్కడి జంపింగ్ ఎమ్మెల్యేలకు హైకోర్టు షాక్
X
ఉత్తరాఖండ్ లో రాజకీయాలు మహా రంజుగా మారాయి. ఆ రాష్ట్రంలోని కాంగ్రెస్ అధికారపక్షానికి షాకు ఇవ్వాలని భావిస్తున్న బీజేపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. రావత్ సర్కారు మీద ఆగ్రహంగా ఉన్న రెబెల్ ఎమ్మెల్యేలతో రావత్ సర్కారును దించేయాలన్న ప్రయత్నాలకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. తాజాగా.. కాంగ్రెస్ ను వీడిని తొమ్మిది మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఒక కీలక నిర్ణయాన్ని హైకోర్టు ప్రకటించింది. ఈ నిర్ణయం రెబెల్ ఎమ్మెల్యేలకే కాదు.. బీజేపీకి సైతం మింగుడుపడనిది మారుతుందనటంలో సందేహం లేదు.

కాంగ్రెస్ పార్టీ నుంచి జంప్ అయిన రెబల్ ఎమ్మెల్యేలకు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. తాజాగా తొమ్మిది మంది రెబల్ ఎమ్మెల్యేలకు ఉత్తరాఖండ్ హైకోర్టులో చుక్కెదురైంది. తమపై రాష్ట్ర స్పీకర్ వేసిన అనర్హత వేటును సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటీషన్ ను కోర్టు కొట్టి వేసింది. కోర్టు తీసుకున్న నిర్ణయం ఉత్తరాఖండ్ కాంగ్రెస్ పార్టీకి ఉపశమనాన్ని ఇచ్చినట్లైంది.

ఉత్తరాఖండ్ అసెంబ్లీలో రావత్ ప్రభుత్వం మంగళవారం బలపరీక్షను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. తాజాగా రెబెల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ వేసిన అనర్హత వేటును హైకోర్టు సమర్థించిన నేపథ్యంలో మంగళవారం జరిగే రావత్ సర్కారు బలపరీక్షలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకునే వీలుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏమైనా జంపింగ్ ఎమ్మెల్యేల తీరుపై ఉత్తరాఖండ్ హైకోర్టు తీర్పు షాకింగ్ గా చెప్పక తప్పదు.