Begin typing your search above and press return to search.

తబ్లీగీలు బయటకు రావాలంటే...ఉత్తరాఖండ్ చర్యలే మార్గం

By:  Tupaki Desk   |   7 April 2020 8:30 PM GMT
తబ్లీగీలు బయటకు రావాలంటే...ఉత్తరాఖండ్ చర్యలే మార్గం
X
ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి... మిగిలిన దేశాలతో పోలిస్తే భారత్ లో చాలా తక్కువేనని చెప్పాలి. ఎవరు ఏమన్నా... ఆదిలో కరోనా వ్యాప్తి దేశంలో అంతగా లేకున్నా... ఢిల్లీలోని మర్కజ్ లో జరిగిన తబ్లీగీ జమాత్ సభకు హాజరై తిరిగి తమ ప్రాంతాలకు చేరిన వారి కారణంగానే... దేశంలో కరోనా విజృంభణ ఓ రేంజిలోకి వెళ్లిందన్నది నిర్వివాదాంశం. మొత్తంగా ఇప్పుడు దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 4 వేలను దాటిపోయాయంటే... అందులో తబ్లీగీల కారణంగా నమోదైన కేసులే అధికం. తబ్లీగీ సభకు వెళ్లివచ్చిన వారంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలని కేంద్రంతో పాటు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు నిత్యం ప్రకటనలు ఇస్తూనే ఉన్నాయి. అయినా కూడా తబ్లీగీలు ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో చిన్న రాష్ట్రమైనా ఉత్తరాఖండ్ తీసుకున్న చర్యలతో తబ్లీగీలు ఒక్కసారిగా బయటకు రాక తప్పలేదు. తబ్లీగీ జమాత్ కు హాజరై... వైద్య పరీక్షలకు సిద్దం కాని వారిపై మర్డర్ కేసులు పెడతామంటూ ఉత్తరాఖండ్ చేసిన సంచలన ప్రకటనతో తబ్లీగీలంతా బయటకు వచ్చేశారు.

ఇలాంటి క్రమంలో తెలుగు రాష్ట్రాలతో పాటు మిగిలిన చాలా రాష్ట్రాల్లో ఇంకా చాలా మంది తబ్లీగీలు.. తబ్లీగీ జమాత్ కు హాజరై కూడా వైద్య పరీక్షలకు సిద్ధం కాకపోవడం - ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యం ప్రకటనలు జారీ చేస్తున్నా పట్టించుకోకుండా ఇంకా తప్పించుకునే తిరుగుతున్న వైనం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా ఉత్తరాఖండ్ తరహాలోనే తబ్లీగీకి హాజరై బయటకు రాని వారిపై మర్డర్ కేసులు పెట్టేస్తామని ప్రకటిస్తే తప్పించి వారంతా బయటకు రారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే... ఎన్ని ప్రకటనలు చేసినా... ఇప్పటికీ పలు రాష్ట్రాల్లో తబ్లీగీకి హాజరై బయటకు రాకుండా ఉంటున్న తబ్లీగీలు చాలా మందే ఉన్నారు. వారంతా బయటకు రావాలంటే.. కాస్తంత కఠినమైనా... ఉత్తరాఖండ్ తరహాలో మర్డర్ కేసుల మాట ఎత్తితే తప్పించి తబ్లీగీలు దారికి రారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే తబ్లీగీ జమాత్ కారణంగానే దేశంలో కరోనా వైరస్ విస్తరణ ఓ రేంజిలో పెరిగిందన్న వాదనల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులను ఇతర వర్గాలు ఓ రకమైన భయంతో చూస్తున్నాయి. ఇలాంటి తరుణంలో తబ్లీగీకి హాజరైన ముస్లింలు స్వచ్ఛందంగా బయటకు రావాల్సింది పోయి... దాక్కుంటున్న వైనం నిజంగానే ఈ తరహా భావనలను ఇంకా పెంచడం ఖాయమే. ఇదే జరిగితే సమాజంలో తబ్లీగీలపై ఓ రకమైన వ్యతిరేక ముద్ర పడే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ విపరిణామాలన్నింటినీ ఆలోచించిన తర్వాతే... ఉత్తరాఖండ్ ప్రభుత్వం బయటకు రాని తబ్లీగీలపై ఏకంగా మర్దర్ కేసులు పెడతామని ప్రకటించిందన్న వాదన వినిపిస్తోంది. ఈ ప్రకటన మేరకు తబ్లీగీలు దారికొచ్చారు. ఇప్పుడు ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 40 దాకా ఉంటే.. వాటిలో 30 కేసులు తబ్లీగీలవేనట. మరి మిగిలిన రాష్ట్రాలు కూడా ఉత్తరాఖండ్ మాదిరే మర్దర్ కేసులంటూ ప్రకటన ఇస్తే... తబ్లీగీలంతా బయటకు రాక తప్పదన్న వాదన వినిపిస్తోంది.