Begin typing your search above and press return to search.

ఉత్త‌రాంధ్ర సీనియ‌ర్ల పయనం ఎటు?

By:  Tupaki Desk   |   15 July 2017 7:20 AM GMT
ఉత్త‌రాంధ్ర సీనియ‌ర్ల పయనం ఎటు?
X
రాజ‌కీయాల్లో ఓ వెలుగువెలిగి..ఆ త‌ర్వాత తెర‌మరుగైన ఉత్త‌రాంధ్ర నేతల గురించి కొత్త చ‌ర్చ మొద‌లైంది. ఉత్త‌రాంధ్ర‌లో కీల‌క జిల్లా అయిన‌ విశాఖ రాజకీయాలను ప్రభావితం చేసిన సీనియర్ నాయకులైన దాడి వీరభద్రరావు - కొణతాల రామకృష్ణ - సబ్బం హరి చాలా కాలంగా తెరవెనక్కు వెళ్లిపోయారు. ఆయా పార్టీల అధిష్టానానికి అతి ద‌గ్గ‌ర‌గా న‌డుచుకున్న ఈ నేత‌లు అనంత‌రం త‌మ దారి తాము చూసుకున్నారు. అయితే త‌దుప‌రి ఎలాంటి అడుగు వేయ‌క‌పోవ‌డంతో వారి అనుచ‌రుల్లోనూ ఒకింత అస్ప‌ష్ట‌త నెలకొంది. మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో వీరు మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావచ్చున‌ని అంటున్నారు.

తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడైన దాడి వీరభద్రరావు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన తరువాత వైకాపాలో చేరారు. కొంత కాలం ఆ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించినప్పటికీ, పార్టీ అధినేత వైఎస్ జగన్‌ తో విభేదించి బయటకు వచ్చేశారు. అయితే, ఆయన తిరిగి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లాలనుకున్నా, అనివార్య కారణాల వలన అది సాధ్య కాలేదు. చంద్రబాబు - జగన్‌ తో దాడి విభేదించిన పరిస్థితులు ఉన్నాయి. రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం కానీ, శాశ్వత మిత్రుత్వం కానీ ఉండదంటారు. దాడి వీరభద్రరావు రాజకీయాల్లో ఇంకా కొనసాగాలనుకున్నా, లేక ఆయన కుమారుడు రత్నాకర్‌ ను రాజకీయ ఊతం ఇవ్వాలన్నా, దాడి మళ్లీ ఏ పార్టీలోనైనా చేరాల్సిన అవసరం ఉంది. అది ఏది అన్నది త్వరలోనే తేలేట్టు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి అసెంబ్లీ నుంచి దాడి రత్నాకర్ పేరును వైకాపా పరిశీలిస్తున్న నేపథ్యంలో దాడి మళ్లీ ఆపార్టీలోకి వెళతారన్నది ప్రచారంలో ఉంది. గత కొంతకాలంగా దాడి క్రియాశీలక రాజకీయాల్లో లేకపోయినా, గత కొద్ది రోజులుగా మళ్లీ ప్రజా సమస్యలపై పోరాటం మొదలుపెట్టారు.

మరో సీనియర్ నాయకుడు కొణతాల రామకృష్ణ వైకాపా నుంచి బయటకు వచ్చిన తరువాత ఏ పార్టీలోకి వెళతారన్న అంశంపై చర్చోప చర్చలు జరిగాయి. అయితే, ఈ విషయం ఆయన అనుచరులకు కూడా అంతుపట్టడం లేదంటే, ఆయన ఎంత గోప్యంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఎంత సీనియర్ నాయకుడికైనా ఓ రాజకీయ పార్టీ జెండా ఉండాలి. కొణతాల ఏ పార్టీలోకి వెళతారో ఇప్పటికీ మిలియన్ డాలర్ల ప్రశ్నగానే ఉన్నప్పటికీ, ఆయన మళ్లీ ప్రజల్లోకి వస్తున్నారు. వివిధ సమస్యలపై ముఖ్యమంత్రికి లేఖలు రాస్తున్నారు. విశాఖ నగరంలోని కాలుష్యంపై పోరాటానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొణతాల పొలిటికల్ రీ ఎంట్రీ త్వరలోనే ఉంటుందని స్పష్టమవుతోంది. చాలా కాలం కిందట కొణతాలను తెలుగుదేశం పార్టీ ఆహ్వానించింది కాదని దూరంగా ఉన్నారు. ఆ తరువాత ఆయన బీజేపీలోకి వెళతారన్న ప్రచారం జరిగింది. ఆ ఊహాగానాలపై కొణతాల స్పందించేదు. ఏదియేమైనా 2019 నాటికి ఆయన ఏదో ఒక జెండా కింద పనిచేస్తారని తెలుస్తోంది.రాజకీయ చతురుడు సబ్బం హరి చాలా కాలంగా ఇంటికే పరిమితమైపోయారు. వ్యక్తిగత కారణాల వలన ఆయన ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. అయితే, ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారా? రారా? అన్నది వేచి చూడాలి.

విశాఖ జిల్లాల సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో కొంతమంది, సిట్టింగ్ ఎంపిల్లో ఒకరు నియోజకవర్గాలను మార్చుకోడానికి ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించారని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆమాటకు వస్తే, అధికార పార్టీ నుంచి జంపింగ్‌లే ఎక్కువగా ఉంటాయనే వాద‌న‌లు సైతం వినిపిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో జిల్లాలోని ముగ్గురు సీనియర్ నాయకులైన దాడి వీరభద్రరావు - కొణతాల రామకృష్ణ - సబ్బం హరిలో ఎవరి ఆసరానైన తీసుకోవలసిన అవసరం అధికార, ప్రతిపక్ష పార్టీలకు ఉందని అంటున్నారు. సబ్బం హరి మాట ఎలా ఉన్నా, దాడి వీరభద్రరావు, కొణతాల రామకృష్ణ మరి కొద్ది కాలంలోనే ఏదో ఒక పార్టీ గూటికి చేరే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.