Begin typing your search above and press return to search.

ఉత్త‌రాంధ్ర టీడీపీ ఉద్య‌మం.. రివ‌ర్స‌యిందా..?

By:  Tupaki Desk   |   30 Aug 2021 12:30 AM GMT
ఉత్త‌రాంధ్ర టీడీపీ ఉద్య‌మం.. రివ‌ర్స‌యిందా..?
X
ఉత్త‌రాంధ్ర టీడీపీ ఉద్య‌మం రివ‌ర్స‌యిందా? వైసీపీకి పోటీగా ప్రారంభించిన‌.. ఉత్త‌రాంధ్ర ఉద్య‌మం ఆదిలోనే విమ‌ర్శ‌ల‌పాలైందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల‌ను వైసీపీ ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం చేసింద‌ని.. టీడీపీ నేత‌లు ఆరోపిస్తున్న విష‌యం తెలిసిందే. అంతేకాదు.. విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను ప్రైవేటీక‌రించేందుకు జ‌గ‌న్ ప్ర‌భుత్వ‌మే కేంద్రంతో ఒప్పందం చేసుకుంద‌ని.. ఈ క్ర‌మంలో విశాఖ‌కు అన్యాయం జ‌రుగుతున్న ప్ర‌భుత్వం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని.. టీడీపీ నేత‌లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు.. స‌హా.. ఇత‌ర నేత‌లు.. ఉద్య‌మం ప్రారంభించా రు. ఇది సీరియ‌ల్ ప‌ద్ధతిలో సాగుతుంద‌ని నేత‌లు తెలిపారు. అయితే.. ఈ ఉద్య‌మానికి .. ఆదిలోనే గండి ప‌డింది. ఇదే ఉత్త‌రాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ టీడీపీపై విరుచుకుప‌డ్డారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కల అని మంత్రి బొత్స‌ పేర్కొన్నారు. సుజల స్రవంతి కోసం టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో 400 కోట్లు మాత్రమే కేటాయించటానికి అచ్చెన్నాయుడుకు సిగ్గులేదా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉత్తరాంధ్రకు చెందిన మీరు మంత్రిగా ఉండి ఈ ప్రాంతానికి ఏ అభివృద్ధి చేశారని అచ్చెన్నాయుడుపై మంత్రి సత్యనారాయణ నిప్పులు చెరిగారు. అదేస‌మయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణను ముఖ్యమంత్రి జగన్ నేరుగా వ్యతిరేకిస్తున్నారని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ తెలిపారు. స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ శాసనసభలో కూడా తీర్మానం చేశామని ఆయన గుర్తు చేశారు. నరేంద్రమోడీ క్యాబినెట్‌లో మంత్రిగా ఉన్న అశోక్ గజపతికి స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ అంశం తెలియదా అని మంత్రి ప్రశ్నించారు.

అప్ప‌ట్లో కేంద్ర మంత్రిగా ఉన్న అశోక్ గజపతి స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణను నాడు ఎందుకు వ్యతిరేకించలే దని నిల‌దీశారు. విశాఖ ఉక్కు ఉత్తరాంధ్ర హక్కు కాదు, అది ఆంధ్రుల హక్కు అని ఆయన అన్నారు. స్టీల్ ప్లాంట్‌పై కేంద్ర నిర్ణయాన్ని వైసీపీ వ్యతిరేకిస్తుందన్నారు. కానీ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌రిస్తే.. ఆ పాపం మాత్రం టీడీపీకే చుట్టుకుంటుంద‌ని మంత్రి చెప్పుకొచ్చారు. అయితే.. బొత్స‌వ్యాఖ్య‌ల‌పై ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి కౌంట‌ర్ టీడీపీ నుంచి రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. అంటే.. ఈ ప‌రిణామాల‌ను టీడీపీ అంగీక‌రిస్తోందా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.