Begin typing your search above and press return to search.

ఉత్తరాంధ్రా టీడీపీ కధ అలాగేనా ... ?

By:  Tupaki Desk   |   31 Aug 2021 4:30 PM GMT
ఉత్తరాంధ్రా టీడీపీ కధ అలాగేనా ... ?
X
టీడీపీకి ఉత్తరాంధ్రా జిల్లాలు అంటే పట్టు కొమ్మలు. ఆ పార్టీ పెట్టినది మొదలు జై కొడుతూ వస్తున్న జిల్లాలు. అలాంటి జిల్లాలు చేజారిపోయాయి. దాంతోనే టీడీపీ గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. టీడీపీ మళ్ళీ వచ్చే ఎన్నికల్లో గెలవాలి అంటే కచ్చితంగా ఉత్తరాంధ్రా జిల్లాలే ఆధారం. ఇక్కడ ఉన్న 34 అసెంబ్లీ సీట్లే టీడీపీ అధికారానికి ఆక్సిజన్ అని చెప్పాలి. ఏపీలో అధికారాన్ని అందుకొవడానికి మ్యాజిక్ నంబర్ 88 అయితే అందుకో సగానికి తక్కువగా ఇక్కడ సీట్లు ఉన్నాయి. ఈ సీట్లు ఎలాగైనా గెలిస్తేనే సైకిల్ పరుగులు తీసేది. కానీ రెండున్నరేళ్ల వైసీపీ ఏలుబడిలో టీడీపీకి ఏపీలోనే సీన్ వేరేగా ఉంది. ప్రత్యేకించి ఉత్తరాంధ్రా జిల్లాల్లో ఈ రోజుకూ పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు.

దాంతో ఉత్తరాంధ్రా అభివృద్ధి మీద చర్చ అంటూ టీడీపీ నేతలు అంతా తాజాగా సమావేశమయ్యారు. అభివృద్ధి అన్నది కేవలం ఒక అజెండా మాత్రమే. అసలైనది పొలిటికల్ అజెండా. ఉత్తరాంధ్రాలో టీడీపీని గాడిన పెట్టడమే ఆ అజెండా. ఇవన్నీ ఇలా ఉంటే విశాఖను రాజధానిగా వైసీపీ ప్రకటించింది. అది కోర్టు విచారణలో ఉంది. అయినా సరే వైసీపీ విశాఖే మన రాజధాని అంటూ జనాలలోకి వెళ్తోంది. అదే టైమ్ లో విశాఖ రాజధానిని సమర్ధించే స్థితిలో టీడీపీ లేదు. అంతే కాదు, రాజధాని పేరు మీద మభ్యపెడుతున్నారు అంటూ టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.

నిజానికి రాజధాని అంశం కోర్టులో కనుక లేకపోతే ఈ పాటికి వైసీపీ ప్రభుత్వం విశాఖను రాజధాని చేసి ఉండేదన్న సత్యం జనాలకు తెలియదా. అంటే ఇక్కడ ఎవరు ఎవరిని మభ్యపెడుతున్నారు అన్నది తమ్ముళ్లకే తెలియాలి. మరొ వైపు చూసుకుంటే ఉత్తాంధ్రా బీసీలకు తమ ప్రభుత్వం న్యాయం చేసిందని టీడీపీ అంటోంది. కానీ బీసీలకు ప్రత్యేకంగా అరవై దాకా కార్పోరేషన్లు ఏర్పాటు చేసి ఉత్తరాంధ్రా వారికే అక్కడ ఎక్కువ పదవులు వైసీపీ ఇచ్చింది. ఇక లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా వారికే అగ్ర తాంబూలం దక్కింది. మంత్రులుగా కూడా అయిదుగురుకి ఛాన్స్ ఇవ్వడమే కాదు, స్పీకర్, డిప్యూటీ సీఎం వంటి కీలకమైన పదవులు కూడా ఇచ్చింది.

మరి ఏ విధంగా బీసీలకు మేము పదవులు ఇచ్చామని టీడీపీ చెప్పుకుంటుందని వైసీపీ నేతలు అంటున్నారు. మొత్తానికి చూసుకుంటే టీడీపీ ఎన్నడూ లేని విధంగా ఉత్తరాంధ్రాలో ఇబ్బందులలో పడింది అన్నది నిజం. పార్టీని పైకి లేపే వారు కరవు అయ్యారు. మరి సైకిల్ జోరు ఎలా ? సాగుతుంది అన్నదే తమ్ముళ్లకు పట్టుకున్న అసలైన బెంగ.