Begin typing your search above and press return to search.

ఆ రాష్ట్ర ఎన్నిక‌ల్లో.. ``అన్నం మూట‌`` హాట్ టాపిక్‌.. రీజ‌నిదే!

By:  Tupaki Desk   |   30 Jan 2022 11:30 PM GMT
ఆ రాష్ట్ర ఎన్నిక‌ల్లో.. ``అన్నం మూట‌`` హాట్ టాపిక్‌.. రీజ‌నిదే!
X
దేశంలో జ‌రుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కొన్ని కొన్ని రాష్ట్రాల్లో చిత్ర‌మైన సంగ‌తులు వెలుగులోకి వ‌స్తున్నాయి. మొన్నామ‌ధ్య గోవాలో కాంగ్రెస్ పార్టీ.. టికెట్లు కేటాయించిన అభ్య‌ర్థుల‌ను వారివారి మ‌త విశ్వాసాల‌ను అనుర‌స‌రించి.. ఆయా మందిరాల‌కు తీసుకువెళ్లి.. వారితో ప్ర‌మాణం చేయించింది. ``మేం గెలిచినా.. ఓడినా.. పార్టీ మార‌బోం!`` అని వారి నుంచి హామీ తీసుకుంది. ఆ త‌ర్వాతే.. టికెట్లు ఇచ్చింది. ఇది దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది.

ఇప్పుడు ఇదే కోవ‌లో దేశంలోనే పెద్ద రాష్ట్రం ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో జ‌రుగుతున్న ఎన్నిక‌ల ప్ర‌చారంలో ``అన్నం మూట‌`` హాట్ టాపిక్‌గా మారింది. మ‌రి దీనికి రీజ‌నేంటి? ఎందుకిలా చేస్తున్నారు? అనేది ఆస‌క్తిగా మారింది. యూపీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం సమాజ్వాదీ పార్టీ ఎట్టిప‌రిస్థితిలోనూ గెలిచి తీరాల‌ని కంక‌ణం క‌ట్టుకుంది. ఈ క్ర‌మంలో పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ప్రచారం ముమ్మరం చేశారు. అయితే ఆయన ఎక్కడికెళ్లినా వెంట ఓ చిన్న ఎర్రటి మూటను తీసుకెళ్తున్నారు. అందులో ప‌సుపు క‌లిపిన అన్నం ఉంటోంది. మ‌రి దీంతో ఏం చేస్తున్నారు అనేది ఆక‌ర్ష‌ణ‌గా ఉండ‌డం గ‌మ‌నార్హం.

మరికొద్ది రోజుల్లో ఉత్తర్ప్రదేశ్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ కూడా విస్తృతం ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే ఇటీవల ఆయన ఎక్కడికి వెళ్లినా ఓ చిన్న ఎర్రటి మూటను జేబులో పెట్టుకుని వెంట తీసుకెళ్తున్నారు. పార్టీ ప్రచారంలో భాగంగా గాజియాబాద్లో అఖిలేశ్ యాదవ్ ఇటీవ‌ల‌ పర్యటించారు. ఈ సందర్భంగా ఈ అన్నం మూట వెనుక రహస్యాన్ని వెల్లడించారు. ఈ మూటలో అన్నం ఉందని తెలిపారు. బీజేపీని గద్దెదించాలనే లక్ష్యంతో ఉన్న అఖిలేశ్.. యూపీలో ఆ పార్టీ ఓటమి చవిచూసే వరకు పోరాటం ఆపమని ఆ అన్నంపై ప్రమాణం చేసినట్లు చెప్పుకొచ్చారు. తమ నేతలతో కూడా ఈ మూటపై ప్రమాణం చేయిస్తున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా జయంత్ చౌదరితో కలిసి మరోసారి ఆ ఎర్రమూటపై ప్రమాణం చేశారు అఖిలేశ్ యాదవ్. "ఈ ప్రచారంలో నేను ఓ ఎర్ర మూటను వెంట తీసుకెళ్తున్నాను. ఇందులో అన్నం ఉంది. నేతలతో అన్నంపై ప్రమాణం చేయించేందుకు నేను దీనిని తీసుకెళ్తాను. ఇదే అన్నంపై ఆధారపడి మనం జీవిస్తున్నాం. ఈ సందర్భంగా బీజేపీనిను గద్దెదించే వరకు పోరాటం ఆపమని మేము ఇద్దరం సంయుక్తంగా ప్రమాణం చేస్తున్నాం`` అని తెలిపారు. రైతులకు అన్యాయం చేసిన బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించడమే తమ లక్ష్యమని అఖిలేశ్ యాదవ్ చెప్పుకొచ్చారు. ఈ అన్నం మూట వ్య‌వ‌హారం రాష్ట్రంలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌గా మారింది.