Begin typing your search above and press return to search.

ఏపీలో తెలంగాణ ఎంపీ అరెస్టు

By:  Tupaki Desk   |   13 Jun 2016 10:54 AM GMT
ఏపీలో తెలంగాణ ఎంపీ అరెస్టు
X
కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు వి.హనుమంత రావును ఆంధ్రప్రదేశ్ లో పోలీసులు అరెస్టు చేశారు. నాటకీయ పరిణామాల మధ్య పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి స్టేషన్ కు తీసుకెళ్లారు. ఆయనతో పాటుగా అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను పరామర్శించేందుకు రాజమండ్రి వచ్చిన వీహెచ్ ను తొలుత పోలీసులు ఆయన బస చేసి హోటల్ నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. ముద్రగడను కలిసి తీరుతానని భీష్మించిన వీహెచ్‌ ను - హర్షకుమార్‌ ను - టీఎన్‌ టీయూసీ రాష్ట్ర నాయకులు కొత్త సీతారాములును కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తులపై వారిని విడుదల చేశారు.

వీహెచ్ ఆదివారం రాత్రి హైదరాబాద్ నుంచి రైలు మార్గంలో కొవ్వూరు చేరుకోగా తెల్లవారు జామున అమలాపురం మాజీ ఎంపీ జి.వి. హర్షకుమార్ ఆయనను కారులో రాజమండ్రి తీసుకెళ్లారు. అయితే... ఆ సమాచారం తెలుసుకున్న పోలీసులు కొద్దిసేపట్లోనే ఆయన్ను చుట్టుముట్టి బస చేసిన హోటల్ నుంచి బయటకు రాకుండా చేశారు. ముద్రగడ పద్మనాభాన్ని కలవకుండా అడ్డుకున్నారు. అనంతరం వన్‌ టౌన్ పోలీస్ స్టేషన్‌ కు తరలించారు. కాగా ముద్రగడ విషయంలో, కాపు ఉద్యమానికి సంఘీభావం ప్రకటించేందుకు వీహెచ్ రాజమండ్రి వచ్చారు. ముద్రగడను కలిసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా పోలీసులు అందుకు అనుమతించలేదు.

తాజా పరిణామాలపై వీహెచ్ చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. ముద్రగడ విషయంలో ఆయన అనుసరిస్తున్న వైఖరిని తప్పు పట్టారు. కాపు ఉద్యమాన్ని తక్కువగా చూస్తే దెబ్బతింటారని హెచ్చరించారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ కూడా స్పందించాలని ఆయన ఇంతకుముందే డిమాండ్ చేశారు.