Begin typing your search above and press return to search.

అంతా కేవీపీయే చేశాడు

By:  Tupaki Desk   |   13 Jun 2016 7:41 AM GMT
అంతా కేవీపీయే చేశాడు
X
తెలంగాణ కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు ఏపీ రాజకీయాలపై మాట్లాడారు. కాపు నేత ముద్రగడ పద్మనాభం దీక్ష నేపథ్యంలో గత నాలుగు రోజులుగా ఏపీ వ్యవహారాలపై దృష్టి పెట్టిన ఆయన ముద్రగడను పరామర్శించేందుకు కూడా ఆంధ్ర వెళ్లారు. తాజాగా ఆయన పలు అంశాలపై మాట్లాడారు. మనసులో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడంతో ఇప్పుడది అందరినీ ఆకర్షిస్తోంది. పాత విషయాలే అయినా ప్రజలు మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. అంతేకాదు... ఏపీలో తనకు మంచి ఫాలోయింగ్ ఉందని వీహెచ్ చెప్పుకున్నారు కూడా.

తాను ఆంధ్రాకు వెళ్తే జనం తన చుట్టూ చేరుతారని.. తనకు అక్కడ మంచి ఫాలోయింగ్ ఉందని వీహెచ్ అంటున్నారు. కాంగ్రెస్ లో చంద్రబాబు తన వద్ద పనిచేశాడని.. కాలం కలిసొచ్చి ఆయన సీఎం అయ్యారని కూడా వీహెచ్ అన్నారు. అదేసమయంలో ఏపీలో వైఎస్ మరణానంతర రాజకీయాలపైనా వీహెచ్ మాట్లాడారు. జగన్ కాంగ్రెస్ ను వీడడానికి తానేమీ కారణం కాదని.. కేవీపీ రామచంద్రరావు దానికి కారణమని ఆయన ఆరోపించారు. వైఎస్ మృతదేహం ఉండగానే సంతకాలు చేయించింది కేవీపీయేనని.. ఆ పని వల్లే మొత్తం కథ అడ్డం తిరిగిందని వీహెచ్ అన్నారు. కొద్ది రోజులు వెయిట్ చేస్తే జగన్ కు మంచి ఛాన్సు వచ్చేదని, సీఎం అయ్యుండేవారని అన్నారు. అప్పుడు సంతకాల సేకరణ చేపట్టిన కేవీపీ బాగానే ఉన్నాడు కానీ జగన్ మాత్రం దెబ్బయిపోయాడని ఆయన జాలిపడ్డారు.

కాగా ఏపీలో తనకు మంచి ఫాలోయింగ్ ఉందన్న వీహెచ్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. ఏపీలో ఏపీ కాంగ్రెస్ నేతలకే దిక్కులేదని... అలాంటిది వీహెచ్ ను ఎవరు పట్టించుకుంటారని అంటున్నారు. నోరు విప్పితే చాలు ఏదో ఒకటి మాట్లాడే వీహెచ్ ను కదిపితే ఏదో ఒక కామెంటు దొరుకుతుంది, వార్తలు వండుకోవచ్చని భావించే జర్నలిస్టులు ఆయన చుట్టూ చేరుతారని.. వారిని చూసి వీహెచ్ అదంతా తన ఫాలోయింగ్ అనుకుంటున్నారని అంటున్నారు.