Begin typing your search above and press return to search.

ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పై రాహుల్ ఆరా..ఇదేం లెక్క‌?

By:  Tupaki Desk   |   2 May 2018 5:17 AM GMT
ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పై రాహుల్ ఆరా..ఇదేం లెక్క‌?
X
బీజేపీ.. కాంగ్రెస్ ల‌కు ప్ర‌త్యామ్నాయంగా ఏర్పాటు చేయ‌నున్న‌ట్లుగా చెబుతున్న కేసీఆర్ ఫెడ‌ర‌ల్ ప్రంట్ పై చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రంగా సాగుతోంది. ఈ ఫ్రంట్ పై కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ దృష్టికి వెళ్ల‌ట‌మే కాదు.. గ్రౌండ్ రిపోర్ట్ ఏమిట‌న్న అంశంపై ప‌లువురిని అడుగుతున్న‌ట్లుగా చెబుతున్నారు.

ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పేరుతో ఇప్ప‌టికే ప‌లువురితో భేటీ అయిన కేసీఆర్.. ఈ రోజు స‌మాజ్ వాదీ నేత‌.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి అఖిలేశ్ యాద‌వ్ తో భేటీ కానున్నారు. హైద‌రాబాద్ వ‌స్తున్న ఆయ‌న కేసీఆర్ తో ఫెడ‌ర‌ల్ అంశంపై చ‌ర్చ‌లు జ‌ర‌ప‌నున్నారు.

ఇదిలా ఉంటే..త‌న‌ను క‌లిసిన తెలంగాణ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వీహెచ్ హ‌నుమంత‌రావు ద‌గ్గ‌ర ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ అంశాన్ని రాహుల్ ప్ర‌స్తావించిన వైనాన్ని వెల్ల‌డించారు. ఫ్రంట్ ల‌క్ష్యాలు.. ఎందుకు ఆ దిశ‌గా కేసీఆర్ నిర్ణ‌యం తీసుకున్నారు? లాంటి ప్ర‌శ్న‌ల్ని సంధించిన‌ట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. కేసీఆర్ ఫ్యామిలీలో న‌డుస్తున్న అధిప‌త్య పోరును ప‌క్క‌కు మ‌ళ్లించేందుకే కేసీఆర్ ఫెడ‌ర‌ల్ అంశాన్ని తెర మీద‌కు తెచ్చిన‌ట్లుగా చెప్పిన‌ట్లు వెల్ల‌డించారు.

అయినా.. అడ‌క్క‌.. అడ‌క్క వీహెచ్ లాంటోళ్ల ద‌గ్గ‌ర ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ గురించి అడిగితే.. ఆయ‌న ఇంత‌కు మించిన స‌మాధానం ఏం చెబుతారు? ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటు వెనుక ల‌క్ష్యాల గురించి కొంద‌రు మీడియా అధిప‌తుల‌తో కేసీఆర్ ర‌హ‌స్య చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ని.. ఈ విష‌యంపై వారి ఫీడ్ బ్యాక్ తీసుకున్న‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతున్న వేళ‌.. గ్రౌండ్ లెవెల్ వాస్త‌వాల్ని రాహుల్ లాంటోళ్ల వ‌ద్ద‌కు తీసుకెళ్లాలే కానీ.. వాటికి భిన్నంగా కేసీఆర్‌ ఇంట్లో అధిప‌త్య పోరు న‌డుస్తుంద‌న్న ఊహాజ‌నిత వాద‌న‌ను వినిపించ‌టంలో అర్థం లేద‌న్న మాట వినిపిస్తోంది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు స‌మ‌యంలో.. టీఆర్ ఎస్ ను కాంగ్రెస్ లో క‌లిపేసే అంశంపైనా నాడు కాంగ్రెస్ పెద్ద‌లు కొంద‌రు.. టీఆర్ఎస్ ను విలీనం చేసేందుకు స‌సేమిరా అన‌టం.. తామే సొంతంగా అధికారంలోకి వ‌స్తామ‌న్న వాద‌న‌ను వినిపించటం తెలిసిందే. తామిచ్చిన స‌ల‌హాతో తెలంగాణ‌లో కాంగ్రెస్ ఎంత న‌ష్ట‌పోయింద‌న్న విష‌యం తెలిసిందే. ఇంత జ‌రిగిన త‌ర్వాత కూడా.. తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు ఇచ్చే ఫీడ్ బ్యాక్ మీద రాహుల్ లాంటోళ్లు ఆస‌క్తి క‌న‌ప‌ర్చ‌టం దేనికి నిద‌ర్శ‌నం?