Begin typing your search above and press return to search.

గవర్నర్ ను వదిలిపెట్టవా హనుమంతన్నా?

By:  Tupaki Desk   |   26 May 2016 6:02 PM GMT
గవర్నర్ ను వదిలిపెట్టవా హనుమంతన్నా?
X
ఆవు కథ గురించి తెలిసిందే. విషయం ఏదైనా మొదటి మాట తప్పించి మిగిలినంతా ఒకేలా ఉంటుంది. గత కొద్దిరోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ అయిన నరసింహన్ తీరుపై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు అదే పనిగా మండిపడటం తెలిసిందే. అయిన దానికి కాని దానికి నరసింహన్ పై తన అక్కసును వెళ్లగక్కే వీహెచ్ తాజాగా టార్గెట్ చేసిన వైనం చూస్తే.. గవర్నర్ ను వీహెచ్ ఇప్పట్లో వదిలిపెట్టేలా లేరన్న భావన కలగటం ఖాయం.

నిన్న (బుధవారం) కలెక్టర్ల సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన ‘‘తప్పులు చేసినోళ్లు గుళ్లకు వెళ్లే’’ వ్యాఖ్యను తనకు తగ్గట్లుగా మార్చేసుకున్న వీహెచ్ అటు చంద్రబాబును ఇటు గవర్నర్ ను హోల్ సేల్ గా టార్గెట్ చేయటం గమనార్హం. చంద్రబాబు చెప్పిన విషయాల్ని కొన్ని మీడియాలో ఒక విధంగా.. మరికొన్ని మీడియాలలో మరోలా రావటం తెలిసిందే. తన విమర్శలకు అనుకూలంగా ఉండేలా ఉన్న మీడియా రిపోర్ట్ లోని అంశాల్ని ప్రస్తావించిన హనుమంతన్న చంద్రబాబు తన వ్యాఖ్యలతో అందరి మనసుల్ని గాయపరిచారంటూ మండిపడ్డారు. తాను చేసిన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేసిన వీహెచ్.. ఈ ఇష్యూలోకి ఏ మాత్రం సంబంధం లేని గవర్నర్ నరసింహన్ ను తీసుకొచ్చేశారు.

‘‘అసలు పాపాలు చేసిన వాళ్లే దేవాలయాలకు వెళ్తారని చెప్పటం అమానుషం. మన రాష్ట్ర గవర్నర్ తరచూ దేవాలయాలకు వెళ్తున్నారు? దానికి చంద్రబాబు ఏం చెబుతారు? అయ్యప్ప భక్తుల్ని అవమానించేలా చంద్రబాబు మాట్లాడారు’’ అంటూ మండిపడ్డారు. అయితే.. ఇక్కడ వీహెచ్ మర్చిపోయిన అంశం ఒకటి ఉంది. గుడికి వెళ్లే వారి లిస్ట్ లో చంద్రబాబు కూడా ఉన్నారు. తాను గుడికి వెళుతూ.. గుడికి వెళ్లే వారిని తిట్టరు కదా? అన్న లాజిక్ వీహెచ్ కు ఎందుకు గుర్తుకు రాలేదో..?