Begin typing your search above and press return to search.

వీహెచ్ కామెంట్..గవర్నర్ గా నరసింహన్ వద్దట

By:  Tupaki Desk   |   2 Jun 2019 1:42 PM GMT
వీహెచ్ కామెంట్..గవర్నర్ గా నరసింహన్ వద్దట
X
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ గా మాజీ పోలీస్ బాస్ ఈఎస్ ఎల్ నరసింహన్ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నారు. తెలుగు నేల ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు గవర్నర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన నరసింహన్... తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోతే... రెంటికీ ఉమ్మడి గవర్నర్ గానే కొనసాగుతూ వస్తున్నారు. సుదీర్ఘ కాలం పాటు గవర్నర్ కొనసాగడమంటే మాటలు కాదు కదా. అది కూడా యూపీఏ ప్రభుత్వ హయాంలో గవర్నర్ గిరీ మొదలెట్టి.. ఎన్డీఏ సర్కారు వచ్చినా తనకేమీ ఇబ్బంది రాకుండా చూసుకుంటున్నారంటే.. బాగానే పనిచేస్తున్నట్లు కదా.

అలాంటి సమర్థవంతమైన గవర్నర్ పై టీ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు తనదైన శైలిలో నోరు పారేసుకున్నారు. గవర్నర్ గా నరసింహన్ చేస్తున్న పని ఇదేనని కూడా వీహెచ్ తనదైన సెటైర్లు సంధించారు. రెండు రాష్ట్రాల సీఎంలకు భజన చేయడం - గుళ్లు పట్టుకుని తిరగడం తప్పించి గవర్నర్ గా నరసింహన్ చేస్తున్న పనేమీ లేదని వీహెచ్ కాస్తంత ఘాటు వ్యాఖ్యలే చేశారు. తెలంగాణలో దళితులపై దాడులు జరిగినా... రైతులకు సంకెళ్లు పడినా... గవర్నర్ చోద్యం చూస్తున్నారు తప్పించి కనీసం స్పందిస్తున్న దాఖలా కూడా లేదని కూడా వీహెచ్ ఆరోపించారు.

సమస్యలపై అసలేమాత్రం స్పందించని నరసింహన్ లాంటి గవర్నర్ అవసరమా? అంటూ వీహెచ్ హాట్ కామెంట్ చేశారు. అసలు నరసింహన్ లాంటి గవర్నర్ అవసరం తెలంగాణకు లేదని కూడా ఆయన చెప్పేశారు. ఇలాంటి గవర్నర్ తమకు వద్దని కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు కూడా వెనుకాడేది లేదని వీహెచ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. మరి ఈ కామెంట్లు అటు గవర్నర్ నోరు విప్పే ప్రసక్తి అయితే లేదు గానీ... టీఆర్ ఎస్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.