Begin typing your search above and press return to search.

అప్పటి కడుపుమంట ఇప్పుడు తీర్చుకుంటున్న వీహెచ్

By:  Tupaki Desk   |   2 March 2016 4:35 AM GMT
అప్పటి కడుపుమంట ఇప్పుడు తీర్చుకుంటున్న వీహెచ్
X
తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో వీహెచ్ హనుమంతరావు వ్యవహారం కాస్త భిన్నంగా ఉంటుంది. ఆయన చేతల కంటే మాటలకే ఎక్కువగా పరిమితం అవుతుంటారు. కాంగ్రెస్ అధినాయకత్వానికి వీర విధేయుడైన ఆయన.. సీజన్ ను తగ్గట్లుగా విమర్శలు చేస్తుంటారన్న విమర్శ ఉంది. పార్టీ అధినాయకత్వం మైండ్ సెట్ కు తగ్గట్లుగా తన వాదనను రెడీ చేసుకోవటం.. టార్గెట్ చేసుకొని మరీ విమర్శలు చేసే అలవాటున్న వీహెచ్.. తాజాగా తన లోపల దాగి ఉన్న కడుపు మంటను బయటపెట్టటం విశేషం.

ఉమ్మడి రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అంటే వీహెచ్ కు మొదటి నుంచి పెద్దగా పడదు. దీనికి తగ్గట్లే కిరణ్ కుమార్ రెడ్డి సైతం వీహెచ్ లాంటి నాయకుల్ని దగ్గరకు తీసే వారు కాదు. రాష్ట్ర విభజన సంగతి ఎలా ఉన్నా.. విభజన సమయంలో కిరణ్ వ్యవహరించిన వైఖరి పట్ల వీహెచ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు. కాంగ్రెస్ అధినాయకత్వానికి విధేయుడైన వీహెచ్ లాంటి వారు కిరణ్ కుమార్ రెడ్డి లాంటి నేతల మీద ఆ మాత్రం గుర్రుగా ఉండటం మామూలే. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. రాజకీయాలకు దూరంగా తన మానాన తాను ఉన్న కిరణ్ కుమార్ పై అదును చూసుకొని మరీ విమర్శలు చేయటం చూస్తే వీహెచ్ కు ఆయనపట్ల ఎంత కడుపు మంట అన్నది ఇట్టే అర్థమవుతుంది.

తాజాగా పార్లమెంటును స్తంభింపచేసిన మాజీ కేంద్రమంత్రి చిదంబరం పుత్రరత్నమైన కార్తీ చిదంబరం వ్యవహారం నేపథ్యంలో వీహెచ్ గళం విప్పారు. కార్తీ చిదంబరం వల్లే కిరణ్ కుమార్ రెడ్డి ఏపీకి ముఖ్యమంత్రి అయ్యారని.. ఆయన సీఎం అయిన తర్వాతే కాంగ్రెస్ కు దరిద్రం పట్టుకుందని వ్యాఖ్యానించారు. ఎయిర్ సెల్- మాక్సిస్ ఇష్యూలో అవినీతి ఎంత జరిగిందో తనకు తెలీదన్న వీహెచ్.. కార్తీకి కిరణ్ కుమార్ అత్యంత సన్నిహితుడిగా చెప్పటం గమనార్హం. కార్తీపై రచ్చ జరుగుతున్న సమయంలోనే.. ఆయనకు సన్నిహితుడు కిరణ్ అంటూ ఆయన పేరును తీసుకురావటం ద్వారా.. ఆయన సంగతి కూడా చూడండి బాబూ అన్నట్లుందే వీహెచ్ వ్యవహారం చూస్తుంటే..?