Begin typing your search above and press return to search.
వీహెచ్ డిమాండ్!..వెంకయ్య రాజీనామా చేయాలి!
By: Tupaki Desk | 19 April 2018 4:20 PM ISTఏపీకి ప్రత్యేక హోదా కోసం ఇప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమం నడుస్తోంది. గడచిన నాలుగేళ్లుగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ వస్తుండటంతో పాటుగా... హోదా వస్తే కలిగే ప్రయోజనాలపై ప్రజలు ప్రత్యేకించి యువతలో అవగాహన పెంచే నిమిత్తం విపక్ష నేత - వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏకంగా యువ భేరీల పేరిట ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అంతేకాకుండా ప్రత్యేక హోదా పోరులో భాగంగా గతంలో చెప్పిన మాటకు కట్టుబడి... ఏకంగా ఎంపీలతో రాజీనామాలు చేయించిన జగన్... హోదా ఉద్యమాన్ని పీక్స్‌కు తీసుకెళ్లారనే చెప్పాలి. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో నరేంద్ర మోదీ సర్కారుపై ఏకంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన వైసీపీ... తనదైన శైలి పోరాటాన్ని సాగించిందని చెప్పాలి. వైసీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలుకుతామంటూ పేర్కొన్న టీఆర్ఎస్... అభివృద్ధి విషయంలో పోటీ ఉన్నా కూడా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని కూడా తేల్చి చెప్పింది. ఇందుకోసం అవసరమైతే ఏపీ ఎంపీల పోరుకు మద్దతు కూడా పలుకుతామంటూ టీఆర్ఎస్ ఎంపీలు ప్రకటించడం కూడా మనకు తెలిసిందే.
ఇదంతా బాగానే ఉన్నా... తెలంగాణకు చెందిన ఇతర పార్టీల నేతలు కూడా ఏపీకి ప్రత్యేక హోదా కోసం గళం వినిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు కొత్తగా రంగంలోకి దిగిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు వి. హన్మంతరావు... కాసేపటి క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని వీహెచ్ డిమాండ్ చేశారు. ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని నాడు పార్లమెంటులో డిమాండ్ చేసిన ప్రస్తుత భారత ఉపరాష్ట్రపతి, నాడు విపక్షానికి చెందిన కీలక నేత హోదాలో వెంకయ్యనాయుడు వ్యాఖ్యలను ఈ సందర్భంగా వీహెచ్ గుర్తు చేశారు. నాటి వెంకయ్య ప్రకటన, ప్రస్తుతం ఆయన వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే... ఏపీపై వెంకయ్యకు చిత్తశుద్ధి ఉందా? అన్న అనుమానం తనకు కలుగుతోందని కూడా వీహెచ్ ఆసక్తికర వ్యాఖ్య చేశారు.
ఏపీకి న్యాయం జరగాలన్న చిత్తశుద్ధే ఉంటే... ఉపరాష్ట్రపతి పదవికి వెంకయ్య రాజీనామా చేయాలని ఆయన సంచలన డిమాండ్ చేశారు. వెంకయ్య రాజీనామాతో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీలకు భయం పట్టుకుంటుందని, ఫలితంగా ఏపీకి తప్పనిసరిగా న్యాయం చేసే దిశగా కేంద్రం అడుగులు వేయక తప్పదని కూడా వీహెచ్ చెప్పారు. మొత్తంగా ఏపీకి ప్రత్యేక హోదా రావాలంటే వెంకయ్య రాజీనామే మార్గమన్న కోణంలో వీహెచ్ సంచలన వ్యాఖ్యలే చేశారు. ఇక దేశంలో తలెత్తిన నోట్ల కొరతపైనా స్పందించిన వీహెచ్... ఈ తరహా దుస్థితికి కేంద్ర ప్రభుత్వ వైఖరే కారణమని కూడా వీహెచ్ ఆరోపించారు. దేశంలోని దాదాపుగా అన్ని ఏటీఎంల వద్ద నోక్యాష్ బోర్డులు కనిపిస్తున్నాయని, నగదు లేక ప్రజలు నానా ఇబ్బంది పడుతున్నారని వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.