Begin typing your search above and press return to search.

వీహెచ్ టూర్ల వెన‌క సీక్రెట్ అదా..!

By:  Tupaki Desk   |   28 Jun 2016 8:25 AM GMT
వీహెచ్ టూర్ల వెన‌క సీక్రెట్ అదా..!
X
వీహెచ్‌.. కాంగ్రెస్ రాజ‌కీయ నేత‌ల్లో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న తెలంగాణ కాంగ్రెస్‌ నేత‌. పేరు హ‌నుమంత‌రావే అయినా.. వీహెచ్ అనే రెండ‌క్ష‌రాల‌తో గుర్తింపు పొందారు. గ‌తంలో కాంగ్రెస్‌ లో అనేక ప‌ద‌వులు అలంక‌రించిన ఆయ‌న‌లో ఇప్ప‌టికీ ఆశ చ‌చ్చిపోలేదు. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ప‌ద‌వికి కొత్త వారిని నియ‌మించే అవ‌కాశం ఉంద‌ని వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో ఈ ప‌ద‌వే ల‌క్ష్యంగా ఆయ‌న పావులు క‌దుపుతున్న‌ట్టు తెలుస్తోంది. ఇటీవ‌లి కాలంలో ఆయ‌న చేప‌డుతున్న కార్య‌క్ర‌మాలు సైతం దీనికి ఊత‌మిస్తున్నాయి.

అయితే, ఈ ప‌ద‌వి కోసం కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ స‌హా గ‌ద్వాల్ జేజెమ్మ‌గా ముద్దుగా పిలుచుకునే డీకే అరుణ సైతం పోటీ ప‌డుతున్నారు. వీరి ప్రయ‌త్నాలు ఎలా ఉన్నా.. 68 ఏళ్ల వ‌య‌సులో టీ పీసీసీ ప‌ద‌వి కోసం వీహెచ్ ఒకింత దూకుడుగానే ప్ర‌య‌త్నిస్తున్నారట‌. ఈ క్ర‌మంలో ఈ పోస్టు తనకే ఇవ్వాలంటూ మాజీ ఎంపీ వి.హనుమంతరావు కాంగ్రెస్ హైకమాండ్ కు విజ్ఞప్తి చేశాడట. అయితే అప్పటి పరిస్థితిని బట్టి... ఎవరు సమర్థంగా పని చేస్తే వారికి టీ పీసీసీ చీఫ్ పోస్టు ఇస్తామని హైకమాండ్ పెద్దలు చెప్పడంతో... ఇప్పుడు హైకమాండ్‌ ను తన పనితీరుతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారట వీహెచ్. మల్లన్నసాగర్ ముంపు బాధిత గ్రామాల్లో వీహెచ్ తరచూ పర్యటిస్తుండటంతో పాటు మిగతా జిల్లాల్లోనూ ఆయన పర్యటనలను గమనిస్తున్న కాంగ్రెస్ నేతలు... సీనియర్ నేత టీ పీసీసీ పోస్టు కోసం బాగానే కష్టపడుతున్నారని గుస‌గుస‌లాడుకుంటున్నారు.

ఇదిలావుంటే, రాష్ట్రంలో కాంగ్రెస్‌ ను గ‌తంలోనూ - 2004 - 2009లో అధికారంలోకి తెచ్చిన రెడ్డి సామాజికవర్గాన్ని పార్టీ అధిష్టానం ప‌క్క‌న పెడుతుందా? అనే చ‌ర్చ కూడా జరుగుతోంది. దీంతో వీహెచ్ కు ఈ పోస్టు దక్కడం అంత ఈజీ కాదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. రెడ్డి సామాజిక వ‌ర్గంపై కాంగ్రెస్‌ కు ఉన్న ప్రేమ అలాంటిది. ఇక‌, గ‌త ఎన్నిక‌ల్లో ఎంపీ సీటు దక్కించుకోలేకపోయిన అధిష్టానం వీరవిధేయుడు వీహెచ్ కు టీ పీసీపీ పోస్టు దక్కితే అది టీ పాలిటిక్స్‌ లో పెద్ద సంచ‌ల‌న‌మే అన్న టాక్ వ‌స్తోంది. మ‌రి కేసీఆర్ దెబ్బ‌కు కుదేల‌వుతున్న ఈ ముస‌లి కాంగ్రెస్ సార‌ధ్య బాధ్య‌త‌లు స్వీక‌రిస్తే ఆ పార్టీని స‌మ‌ర్థ‌వంతంగా న‌డిపిస్తాడా అన్న ప్ర‌శ్న‌ల‌కు ఈ దేవుడే స‌మాధానం చెప్పాలి.