Begin typing your search above and press return to search.

గవర్నర్‌పై మరీ అంతలా విరుచుకుపడలా వీహెచ్‌

By:  Tupaki Desk   |   29 Jun 2015 5:15 AM GMT
గవర్నర్‌పై మరీ అంతలా విరుచుకుపడలా వీహెచ్‌
X
కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు వీహెచ్‌కి కోపం వచ్చింది. ఆయనగారికి ఎవరి మీద కోపం వస్తే వారి మీద అడ్డదిడ్డంగా విరుచుకుపటం మామూలే. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారంలో గవర్నర్‌ నరసింహన్‌ చొరవ చూపటం లేదంటూ ఆయన ఫైర్‌ అయిపోతున్నారు వీహెచ్‌.

రెండు రాష్ట్రాల మధ్య రచ్చ.. రచ్చ జరుగుతున్నా పట్టించుకోకుండా.. గుళ్లు తిరుగుతున్నారంటూ గవర్నర్‌ మీద మండిపడ్డారు. కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్‌కు వీహెచ్‌ లేఖ రాస్తూ.. ఇద్దరు ముఖ్యమంత్రులు చెప్పేది వినటం తప్ప.. సమస్యకు పరిష్కారం చూపటం లేదని వ్యాఖ్యానించారు.

ఇప్పటివరకూ సెక్షన్‌ 8 అమలు చేయాలని డిమాండ్‌ చేసిన ఏపీ నేతలు.. ఇప్పుడు హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని డిమాండ్‌ చేస్తుంటే.. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణను తానే తెచ్చినట్లుగా.. సర్వాధికారాలు తనవే అన్నట్లు వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. గవర్నర్‌ ఎన్నెన్ని గుళ్లు ఎన్నెన్నిసార్లు తిరిగారో పరిశీలించాలని.. నరసింహన్‌ గవర్నర్‌గా కంటే స్వామీజీగా సరిపోతారంటూ నోరు పారేసుకున్నారు.

ఒకవేళ వీహెచ్‌ మాటలే నిజం అనుకుంటే.. ఈ రోజు విభజన రచ్చ ఇంత స్థాయిలో ఉండటానికి అసలు కారణంగా కాంగ్రెస్‌ పార్టీ కాదా? విభజన చట్టాన్ని ఐదారుగురు కూర్చొని ఎవరో తరుముకు వస్తున్నట్లుగా తయారు చేయటం.. దేశానికి భావి ప్రధానిగా చెప్పుకునే రాహుల్‌.. విభజన చట్టంపై ఒక్కసారి అయినా దృష్టి సారించారా? అసలు చట్టాన్ని రూపొందించే అంశంలో సోనియా సీరియస్‌గా దృష్టి సారించారా? విభజన తర్వాత వచ్చే సమస్యలపై ముందుస్తుగా దృష్టి సారించి ఉండి నిర్ణయాలు తీసుకొని ఉంటే ఈ రోజున ఇన్ని సమస్యలు ఉండేవి కాదు కదా?

గుళ్లు తిరిగారంటూ గవర్నర్‌ మీద విరుచుకుపడే వీహెచ్‌.. లోధావాలా రిసార్టుల్లో జాలీగా గడిపే రాహుల్‌ను ఎందుకు నిలదీయరు? ఇన్ని మాటలు చెబుతున్న వీహెచ్‌ విభజన సమయంలో పోషించిన పాత్ర ఏమిటి? తెలంగాణ కావాలి.. రావాలి అనటమే తప్పించి.. రెండు రాష్ట్రాల మధ్య ఎలాంటి వైషమ్యాలు చెలరేగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వీహెచ్‌ ఎందుకు హెచ్చరించలేదు...? చేయాల్సినవి ఏమీ చేయకుండా.. అందరిని ఆడిపోసుకోవటం వీహెచ్‌ లాంటివారు చేస్తుంటారు. ఇలాంటివి మానుకుంటే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.