Begin typing your search above and press return to search.

అదేంది హ‌నుమంత‌న్నా..రాజీవ్‌ ను అలా తిట్టేశారు

By:  Tupaki Desk   |   1 Jun 2018 10:02 AM IST
అదేంది హ‌నుమంత‌న్నా..రాజీవ్‌ ను అలా తిట్టేశారు
X
మిగిలిన విష‌యాల్ని ప‌క్క‌న పెడితే తెలంగాణ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వీహెచ్ హ‌నుమంత‌రావులో ఒక ప్ర‌త్యేక‌త క‌నిపిస్తుంది. గాంధీ ఫ్యామిలీ మీద ఆయ‌న అంతులేని విధేయ‌త‌ను ప్ర‌ద‌ర్శిస్తుంటారు. ఇందిర‌మ్మ మొద‌లు రాహుల్‌ వ‌ర‌కూ ఎవ‌రిని భ‌జ‌న చేసేందుకు వెన‌క్కి త‌గ్గ‌రు. గాంధీ ఫ్యామిలీ నుంచి ఎవ‌రు రాజ‌కీయాల్లోకి వ‌చ్చినా వారి వెన్నంటే ఉంటూ.. వారిని ఆకాశానికి ఎత్తేస్తుంటారు.

అలాంటి వీహెచ్ తాజాగా గాంధీ ఫ్యామిలీని మాట అనేశారు. అయితే.. అదంతా కావాల‌నా? అంటే కాద‌నే చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ మీద ఉన్న కోపం వీహెచ్ చేత అలా మాట్లాడించేసింది. తెలంగాణ సీఎం మీద విరుచుకుప‌డేందుకు త‌పించే ఆయ‌న‌.. తాజాగా కేసీఆర్ ను టార్గెట్ చేశారు. ఈ క్ర‌మంలో తాను దైవంగా కొలిచే రాజీవ్ గాంధీ మీద ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నాడు రాజీవ్ చేసిన త‌ప్పే ఇప్పుడు కేసీఆర్ చేస్తున్నారంటూ త‌ప్పు ప‌ట్టారు.

కేసీఆర్ నాలుగేళ్ల పాల‌న ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌ల్లో బాగుంద‌ని.. ప‌బ్లిసిటీ స్టార్ గా మారిన‌ట్లుగా విమ‌ర్శించారు.

ప‌బ్లిసిటీ మీద కేసీఆర్ కున్న ఆస‌క్తితో ఇత‌ర రాష్ట్రాల్లో కూడా ప్ర‌చారం చేసుకుంటున్నార‌న్నారు. చివ‌ర‌కు టాయిలెట్ల మీద కూడా ఫోటోలు వేసుకుంటున్నార‌ని.. అతిగా ప‌బ్లిసిటీ చేసుకున్న రాజీవ్ గాంధీని 1989లో ప్ర‌జ‌లు ఓడించార‌ని.. ఇప్పుడు అదే గ‌తి కేసీఆర్‌ కు ప‌ట్ట‌బోతుంద‌న్నారు. మొత్తానికి కేసీఆర్ మీద ఉన్న కోపంతో తాను దైవంగా త‌లిచే గాంధీ ఫ్యామిలీకి చెందిన వ్య‌క్తి త‌ప్పుల్నివీహెచ్ బ‌య‌ట‌కు చెప్పాల్సి వ‌చ్చిందే!